• తాజా వార్తలు

మహిళల కోసం ట్విట్టర్ గళం... పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఉద్యమం

ఇండియాలో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ప్రముఖ సామాజిక మాధ్యమ వెబ్‌సైట్ ట్విట్టర్ నడుం బిగించింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ మగవారి ఆధిపత్యం కొనసాగుతోందని నివేదికలు వెలువడిన నేపథ్యంలో పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఉద్యమాన్ని ప్రారంభించింది. అన్ని రకాలుగా మహిళలు తమ వాణి వినిపించేలా చేయడమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశం. ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌లలో ఇప్పటికే ఈ ఉద్యమం ప్రారంభమైంది. భారత్‌లో ఆన్‌లైన్ వేదికగా స్త్రీ, పురుష సమానత్వమే అజెండాగా దీనికి శ్రీకారం చుట్టారు. ప్రపంచ దేశాల కంటే భారత్ లో లింగ వివక్ష అధికంగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆన్ లైన్ వేదికగా చేపట్టిన ఈ ఇనిషియేటివ్ భవిష్యత్ లో ఆఫ్ లైన్ కూ విస్తరించేదిశగా ట్విట్టర్ యోచిస్తోంది. ఆఫ్ లైన్ లో సదస్సులు, చర్చాగోష్ఠులు, కార్యాలయాల్లో అవగాహన శిబిరాలు వంటి కార్యక్రమాలతో స్త్రీపురుష సమానత్వం దిశగా చర్యలు తీసుకోవాలని ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ తలపోస్తోంది.

ముఖ్యంగా రాబోయే తరం మహిళలు తమ అభిప్రాయాలను ధైర్యంగా వినిపించే విధంగా వారిని తీర్చిదిద్దుతారు. ట్విట్టర్ వేదికగా మహిళను చైతన్య పరచడం  తమ ప్రధాన ఉద్దేశం, ముఖ్యంగా లింగ భేదం , పిల్లల సంరక్షణ, గృహ హింస, ఆరోగ్యం, సౌకర్యవంతమైన పని తదితర అంశాలను పొజిషిన్ ఆప్ స్ట్రెంగ్త్ వేదికగా చర్చిస్తామని ఇండియా పబ్లిక్ పాలసీ అధికారి మహిమా కౌల్ తెలిపారు. దీని ద్వారా మహిళల ఆలోచనా సరళి మారి సామాజికంగా ధృడంగా మారతారని భావిస్తున్నట్టు మహిమా కౌల్ తెలిపారు.

అంతేకాకుండా ట్విట్టర్ లో హిందీలో ఒక సేఫ్టీ సెంటర్ ఏర్పాటు చేశారు. విద్య, సాధికారిత దిశగా మహిళలను డ్రైవ్ చేయడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చని ట్విట్టర్ వర్గాలు చెబుతున్నాయి. భద్రంగా, ఆత్మవిశ్వాసంతో ఈ ప్లాట్ ఫాంను ఉపయోగించుకునేలా ఇది వీలు కల్పిస్తుందని చెబుతున్నారు. ట్విట్టర్ ఇంతకుముందు కూడా సామాజిక అంశాలపై పలు మార్లు స్పందించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగానూ పలు కార్యక్రమాలు చేపట్టడంలో ట్విట్టర్ ముందుంది.

 

జన రంజకమైన వార్తలు