ప్రపంచంలో ఎక్కువమంది వాడుతున్న మెసేజింగ్ యాప్ వాట్సప్. కేవలం మెసేజ్‌లు పంపడమే కాదు వీడియోలు, ఫొటోలు పంపడానికి ఈ వాట్సప్ ఎంతో ఉపయోగపడుతుంది. వాట్సప్ లాంటి యాప్‌ల వల్లే ఆండ్రాయిడ్ ఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యం వినియోగదారులను మరింత ఆకట్టుకోవడానికి వాట్సప్ తన యాప్‌లో కొత్త మార్పులు చేస్తోంది. ఆ మార్పుల్లో భాగంగానే వాట్సప్ వీడియో కాలింగ్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇక వాట్సప్‌తో మెసేజింగ్, ఫొటోలు, వీడియోలు పంపుకోవడమేకాక నేరుగా మాట్లాడుకోవచ్చు. ఐతే ప్రస్తుతం ఈ ఆప్షన్ వినియోగదారులకు అందుబాటులో లేదు. త్వరలోనే వాట్సప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా వీడియో కాలింగ్ వస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. ఐతే ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌లో వాట్సప్ బేటా వీడియో కాలింగ్ ఆప్షన్ వినియోగదారులకు కనిపిస్తోంది. వాట్సప్ బేటా వీ2.16.80 వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు మాత్రమే ప్రస్తుతం ఈ ఫీచర్ కనిపిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో వాట్సప్ వీడియో కాలింగ్ ఆప్షన్ కనిపిస్తున్నా ఇది ఇప్పటికప్పుడు ఉపయోగపడడం లేదు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలోనే ఈ వీడియో కాలింగ్‌ను ప్రవేశపెట్టినట్లు త్వరలోనే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ సదుపాయాన్ని విస్తరిస్తామని వాట్సప్‌ను నడుపుతున్న ఫేస్‌బుక్ సంస్థ తెలిపింది. మొదట ఇన్వైట్ బేస్డ్ సిస్టమ్ ద్వారా దీన్ని ప్రవేశపెట్టాలని.. ఒకసారి క్లిక్ అయ్యాక ఈ వీడియో కాలింగ్ ఆప్షన్‌ను మరింత అభివృద్ధి చేసి యూజర్లకు అందుబాటులోకి తెస్తామని ఎఫ్‌బీ పేర్కొంది. మెసేజింగ్ చేస్తున్న విండోలోనే ఒక కాల్ బటన్ ఉంటుందని... దీంతో మనకు అవసరమైనప్పుడు కాల్ చేసుకోవచ్చని తెలిపింది. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో లభ్యం అవుతున్న ఈ వాట్సప్ వీడియో కాలింగ్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు.. మీరు ఫోన్ చేయడం సాధ్యం కాదు... అనే సందేశం వస్తుంది. ఆండ్రాయిడ్ వీ2.16.80 వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే ఈ ఆడియో సందేశం వినిపిస్తోంది. ఏదేమైనా ఇటీవల కాలంలో వాట్సప్ వేగంగా ఆప్‌డేట్ అవుతోంది. ఎండ్ టు ఎండ్ ఇన్‌క్రిప్షన్, డాక్యుమెంట్ షేరింగ్, టెక్ట్ ఫార్మాటింగ్ లాంటి ఆప్షన్లతో వాట్సప్ వినియోగదారులకు మరింత చేరువైంది. |