ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న యాప్‌లలో వాట్సప్‌ది అగ్రస్థానం. ఎక్కువమంది డౌన్‌లోడ్ చేసుకున్న యాప్ కూడా ఇదే. ఎవరితోనైనా ఏమైనా షేర్ చేసుకోవడానికి, చాట్ చేసుకోవడానికి దీనికి మించిన యాప్ దొరకదు. అందుకు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులంతా తప్పకుండా ఈ యాప్‌ను తమ ఫోన్‌లో ఉండేలా చూసుకుంటారు. వినియోగదారుల ఆదరణ విపరీతంగా ఉండటంతో ఆరంభంలో ఏడాది పాటు సర్వీసు అని ప్రకటించిన వాట్సప్..ఇప్పుడు ఒకసారి డౌన్‌లోడ్ చేస్తే జీవిత కాలం వినియోగించుకునే అవకాశాన్ని ఇచ్చింది. యూజర్ల నుంచి గొప్ప ఆదరణ ఉండటంతో వాట్సప్ ఎప్పటికప్పుడు తమ యాప్‌లో మార్పులు చేర్పులు చేస్తుంది. దానిలో భాగంగానే వాట్సప్ తాజాగా మెసేజ్ కోట్స్, రిప్లే ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. మనం వాట్సప్‌లో చాటింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి చాలా కన్ఫూజన్‌గా ఉంటుంది. ముఖ్యంగా గ్రూప్‌లో చాటింగ్ చేసేటప్పులు ఈ గందరగోళం మరింత ఎక్కువగా ఉంటుంది. దీని కారణం.. ఎవరు ఎవరికి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారో తెలియకపోవడమే. దీని వల్ల వరుసగా మెసేజ్‌లు చదువుకుంటే మనకు ఏమీ అర్ధం కాదు. ఎప్పూడో అడిగిన ప్రశ్నకు లేటుగా సమాధానం చెబితే..తాజాగా ఉన్న చాట్‌తో అది కనెక్ట్ అయితే అపార్థాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చింది కొత్త ఆప్షన్. ఈ కొత్త ఆప్షన్ వల్ల ఉపయోగం ఏమిటంటే మనం చాటింగ్ చేస్తున్నప్పుడు ఏ ప్రశ్నకు సమాధానం చెబుతామో.. ఆ ప్రశ్న కిందే మన జవాబు ఇవ్వొచ్చు. ఆ ప్రశ్నను పట్టుకుని డ్రాగ్ చేస్తే మనం టైప్ చేసుకునే అవకాశం వస్తుంది. దీంతో ఎక్కడ ప్రశ్నలకు అక్కడే సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. త్వరలోనే అన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ మోడల్స్‌లో ఈ ఆప్షన్ లభించనుందట. ప్రస్తుతానికి వాట్సప్ ఈ కొత్త ఆప్షన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. గూగుల్‌ప్లే యాప్ స్టోర్‌లలో త్వరలోనే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఇప్పటికే వాట్సప్ వాడుతున్నవాళ్లు యాప్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా కొత్త ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్తగా వచ్చిన ఆప్షన్‌లో రిప్లేతో పాటు డిలీట్, కాపీ, ఫార్వర్డ్ ఆప్షన్లు కూడా ఉంటాయి. ఇటీవలే వీడియో కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన వాట్సప్..త్వరలోనే పూర్తి స్థాయిలో మెసేజ్ కోట్స్, రిప్లేను కూడా వాడకంలోకి తీసుకురానుంది. |