• తాజా వార్తలు

వాట్సప్ ని డిలీట్ చేసేవారి వాదన ఏమిటి?

ప్రస్తుతం వాట్స్ అప్ లేని స్మార్ట్ ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు. మీరు మాత్రమే కాక మీ స్నేహితులు, సహోద్యోగులు, బంధువులు, కుటుంభ సభ్యులు ఇలా అందరూ వాట్స్ అప్ ను ఉపయోగించడం మీరు గమనించే ఉంటారు. ఇది ఒక అద్భుతమైన మెసేజింగ్ ఫ్లాట్ ఫాంలాగా తయారుఅయ్యింది. మీ రోజువారీ ప్రణాళిక లను మీ స్నేహితులతో పంచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.అయితే వాట్స్ అప్ ను వాడని వారు కొందరు ఉంటారు. అప్పటిదాకా ఉపయోగించి కొన్ని కారణాల వలన డిలీట్ చేసేవారు కొందరు ఉంటారు. ఆ కారణాలు ఏమిటి? ఎందుకు కొంతమంది వాట్స్ అప్ ను డిలీట్ చేస్తున్నారు? ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు ఈ వాట్స్ అప్ కు ఉన్న అనుకూలతలను ఒకసారి చూద్దాం.

మనం స్నేహితులకు టెక్స్ట్ మెసేజ్ లు పంపాలి అనుకుంటే దానికి కొంత ఛార్జ్ పడుతున్న నేపథ్యంలో వాట్స్ అప్ అనేది వినియోగదారులకు ఒక ఉపశమనంగా మారింది. కేవలం డేటా ఛార్జ్ తో అపరిమిత మెసేజ్ లతో పాటు, ఫోటో లను, వీడియో లను కూడా వాట్స్ అప్ ద్వారా పంపవచ్చు. అంతేగాక వాట్స్ అప్ కాలింగ్ చేయవచ్చు మరియు ఈ మధ్యనే వాట్స్ అప్ వీడియో కాలింగ్ ను కూడా ప్రవేశ పెట్టింది. దీనివలన డబ్బు, సమయం ఆదా అవుతాయి. ఈ యాప్ తక్కువ మెమరీ నే ఆక్రమిస్తుంది. అంతేగాక మిగతా మెసేజింగ్ యాప్ లలో మాదిరిగా ఇందులో యాడ్ లు కూడా ఉండవు. మీ ఫోన్ పాతబడిపోయి నిదానంగా పనిచేస్తున్నా సరే దాని ప్రభావం వాట్స్ అప్ పై ఏ మాత్రం పడదు. ఇది చాలా చక్కగా పని చేస్తుంది. ఇంటర్ నెట్ స్పీడ్ కొంచెం అటుఇటుగా ఉన్నా సరే చక్కగా పనిచేసే ఏకైక యాప్ ఈ వాట్స్ అప్. మీరు ప్రయాణంలో ఉన్నా సరే ఇది బాగా పనిచేస్తుంది.

ప్రతికూలతలు

ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కొన్ని చికాకు పెట్టె అంశాల వలన వీటి వినియోగదారులు కొందరు దీనిని తమ ఫోన్  లనుండి డిలీట్ చేసేస్తున్నారు. దీనికి కారణాలు ఏమిటి? ఆ చికాకు పెట్టె అంశాలు ఏవి?

  1. మనకు తెలియకుండానే కొన్ని స్పామ్ మెసేజ్ లు మనకు వస్తూ చికాకు పెడుతూ ఉంటాయి.
  2. మనం ప్రమేయం ఏమీ లేకుండానే మనం కొన్ని గ్రూప్ లలో యాడ్ అవుతాము. అంతవరకూ బాగానే ఉంటుంది కానీ ఈ గ్రూప్ లలో ఉన్న యూజర్ లనుండి విపరీతంగా మెసేజ్ లు వస్తూ మనలను విసిగిస్తూ ఉంటాయి. ఇవి ఒకోసారి మన ఏకాగ్రతను దెబ్బతీస్తూ ఉంటాయి. ఉదాహరణకు మీరు మూడు గ్రూప్ లలో యాడ్ చేయబడ్డారు అనుకోండి. ఆయా గ్రూప్ లలో మీకు తెలిసిన వారు కానీ మీ స్నేహితులు కానీ అయిదారుగురు మాత్రమే ఉంటారు. కానీ మీకు సంబంధం లేని వారందరూ ఆ గ్రూప్ లో మీకు మెసేజ్ లు పెడుతూ ఉంటారు. ఆ మెసేజ్ లు మీకు అంత అవసరం కూడా ఉండవు. ఇవి నోటిఫికేషన్ ల రూపంలో మనలను అసహనానికి గురిచేస్తూ ఉంటాయి. వేరే వాళ్ళ మధ్య జరిగే సంభాషణలు కూడా మన వాట్స్ అప్ కే వస్తే ఎంత విసుగుగా ఉంటుందో ఆలోచించండి!
  3. మీరు అప్పటివరకూ వాడుతున్న ఫోన్ ను మార్చి వేరే ఫోన్ ను తీసుకున్నారు అనుకోండి మీ చాట్ హిస్టరీ ని జాగ్రత్తగా బ్యాక్ అప్ తీసుకోవాలి, లేకపోతే అది అంతా మాయం అయిపోతుంది. ఇది ఒక అసహనానికి గురిచేసే అంశం.
  4. మీరు అప్పటివరకూ ఆండ్రాయిడ్ ఫోన్ ను ఉపయోగించి ఐ ఫోన్ కు మారారు అనుకోండి ఇక అంతే సంగతులు. ఇందులో బ్యాక్ అప్ తీసుకునే అవకాశం కూడా ఉండదు. మీరు ఇంతకుముందు ఉపయోగించిన చాట్ హిస్టరీ అంతా ఆటోమాటిక్ గా డిలీట్ అయిపోతుంది.
  5. ఈ మధ్యనే వాట్స్ అప్ ఫేస్ బుక్ ను కొనుగోలు  చేసిన నేపథ్యం లో వినియోగదారుల డేటా ను ఫేస్ బుక్ తో వాట్స్ అప్ షేర్ చేసుకుంటుందేమో అన్న భయం తో కొంతమంది వాట్స్ అప్ ను డిలీట్ చేసేశారు.
  6. నేడు ప్రస్తుతం వాట్స్ అప్ తో పాటు అనేకరకాల మెసేజింగ్ యాప్ లు అందుబాటులో ఉన్నాయి. మీరు వాట్స్ అప్ లో ఉండి మీ స్నేహితులు, సన్నిహితులు ఎక్కువగా మిగతా మెసేజింగ్ సర్వీస్ లలో ఉంటె ఉపయోగం లేదు కదా! ఈ కారణం వలన కూడా అనేకమంది వాట్స్ అప్ ను తమ ఫోన్ లనుండి డిలీట్ చేస్తున్నారు.

చూశారుగా ఇవీ కారణాలు, అందరూ వాట్స్ అప్ ను డిలీట్ చేస్తున్నారు అని మేము చెప్పడం లేదు కానీ పైన తెలిపిన కారణాల వలన చాలామంది తమ ఫోన్ లలో నుండి వాట్స్ అప్ యాప్ ను డిలీట్ చేస్తున్నారు. మీరు వీరిలో ఒకరు కావచ్చు, కాకపోవచ్చు.

 

జన రంజకమైన వార్తలు