ఫేస్ బుక్ ఉపాధ్యక్షుడు డియాగో జోరాన్ అరెస్టు ఇండియాలో ఫ్రీ బేసిక్స్ వ్యవహారంలో దెబ్బతిన్నది మొదలు ఫేస్ బుక్ సంస్థకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. మొన్న జర్మనీలో ఓ కోర్టు భారీగా జరిమానా విధించగా తాజాగా బ్రెజిల్ లో ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్ ను అరెస్టు చేయడం సంచలనంగా మారింది. మాదక ద్రవ్యాల కేసు విచారణలో సహకరించడం లేదన్న కారణంతో ఫేస్ బుక్ కీలక ఉద్యోగి ఒకరిని బ్రెజిల్ లో అరెస్టు చేశారు. ఫేస్ బుక్ ఉపాధ్యక్షుడు డియాగో జోరాన్ బ్రెజిల్ లో పర్యటిస్తుండగా ఆ దేశ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఫేస్ బుక్ కే చెందిన వాట్స్ యాప్ లో డ్రగ్ మాఫియా సమాచారం పంపించుకుంటూ డ్రగ్ బిజినెస్ ను ఆపరేట్ చేస్తోంది. అందుకు సంబంధించిన వాట్స్ యాప్ మెసేజిలను ఇవ్వాలంటూ ఆ కేసు విచారిస్తున్న జడ్జి ఫేస్ బుక్ ను కోరారు. కానీ..... డియాగో అందుకు స్పందించలేదు... దీంతో వ్యవస్థీకృత నేరాల చట్టం కింద ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అనంతరం బ్రెజిల్ లోనే ఆయన్ను అరెస్టు చేశారు. బ్రెజిల్ లో నేరాల నియంత్రణకు వాట్స్ యాప్ సహకరించాల్సిందేనంటూ అక్కడి ప్రజలు వాట్స్ యాప్ కు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నారు. ఫేస్ బుక్ లాటిన్ అమెరికా దేశాల వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న జోరాన్ ఇటీవల బ్రెజిల్ లోని సెర్గిపీ రాష్ట్రంలోని ఓ న్యాయస్థానం నుంచి వచ్చిన ఆదేశాలను విస్మరించారు. దీంతో ఆ జడ్జి అరెస్టు వారెంట్ ఇష్యూ చేయగా పోలీసులు డియాగోను అరెస్టు చేశారు. కాగా దీనిపై ఫేస్ బుక్ ఒకింత తీవ్రంగానే స్పందించింది. డియాగో అరెస్టు అన్యాయమని ఫేస్ బుక్ వర్గాలు వాదిస్తున్నాయి. ఆయన్ను అరెస్టు చేయడం తీవ్రమైన చర్యని అంటున్నాయి. వాట్స్ యాప్ వద్ద ఉన్న మొత్తం సమాచారం ఇచ్చామని... తమ వద్ద లేని సమాచారం ఎలా ఇవ్వగలమని వాట్స్ యాప్ అధికార వర్గాలు అంటున్నాయి. కాగా గత డిసెంబరులో బ్రెజిల్ లో రెండు రోజుల పాటు వాట్స్ యాప్ ను బ్లాక్ చేశారు. ఈ కేసు నేపథ్యంలోనే అప్పట్లో వాట్స్ యాప్ ను బ్లాక్ చేశారు. తాజాగా మరింత తీవ్రమైన చర్య తీసుకున్నారు. కాగా దిగ్గజ సంస్థలు, దర్యాప్తు విభాగాల మధ్య ఘర్షణ వాతావరణం ఇటీవల పెరిగింది. అమెరికాలోనూ యాపిల్ సంస్థకు అక్కడి ఎఫ్ బీఐ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తమ వినియోగదారుల సమాచారం భద్రంగా ఉండాలన్న ఉద్దేశంతో యాపిల్, ఫేస్ బుక్ వంటి సంస్థలు దర్యాప్తు సంస్థలు కోరిన సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. తాజా ఘటనపై ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ స్పందిస్తూ విచారకరమైన సంఘటన అని అన్నారు. |