• తాజా వార్తలు

పాత ఓఎస్ లకు వాట్స్ యాప్ బంద్...

ప్రపంచ‌వ్యాప్తంగా వాట్స్ యాప్ మెసెంజర్ సేవ‌లు ఆగిపోనున్నాయి. ఈ మాట వింటే చాలు చాలామందికి హార్ట్ అటాక్ వచ్చినంత పనవుతుంది... ఎందుకంటే వాట్స్ యాప్ గ్రూపుల్లో విహరిస్తూ ప్రపంచాన్నే మర్చిపోతున్నవారు లెక్కలేనంత మంది ఉంటున్నారు. అయితే ఈ వాట్స్ యాప్ సేవ‌లు అన్ని మొబైల్స్‌లోను ఆగిపోవు. బ్లాక్‌బెర్రీ, నోకియా ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే మొబైల్ హ్యాండ్‌సెట్లలో మాత్రమే వాట్స్ యాప్ ను ఆపేస్తున్నారు.

బ్లాక్‌బెర్రీ (బ్లాక్‌బెర్రీ 10 సహా), నోకియా ఎస్40, నోకియా సింబియాన్ ఎస్60, ఆండ్రాయిడ్ 2.1, 2.2, విండోస్ ఫోన్ 7.1 ఓఎస్‌లపై నడిచే ఫోన్లలో వాట్సాప్ మెసెంజర్ సేవలను ఈ ఏడాది చివరి నాటికి నిలిపివేస్తున్నట్లు వాట్స్ యాప్ సంస్థ ప్రకటించింది.

ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లో దాదాపు 99.5 శాతం వరకు ఫోన్లు గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీల ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)పై పనిచేస్తున్నాయి. అత్యధిక ప్రజలు ఉపయోగిస్తున్న ఓఎస్‌పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొంది. ఫేస్‌బుక్ 2014 ఫిబ్రవరిలో వాట్సాప్‌ను 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

ప్రస్తుతం వాట్స్ యాప్‌ను వాడుతున్న యూజర్లలో 99 శాతం మంది ఆండ్రాయిడ్ ఓఎస్‌ను వాడుతున్నారు. బ్లాక్ బెర్రీ, ఐ ఓఎస్, విండోస్ ఓఎస్‌లపై వాట్స్ యాప్ వినియోగిస్తున్నవారు మొత్తం కలిసి ఒక శాతమేనట. దీంతో పాత తరం డివైస్‌లకు, ఓఎస్‌లకు సపోర్ట్‌ను నిలిపివేయక తప్పడం లేదని వాట్స్ యాప్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఇంకా అలాంటి డివైస్‌లను వాడుతున్నట్టయితే కొత్త డివైస్‌లకు అప్‌గ్రేడ్ కావాలని వారు కోరుతున్నారు.  యూజర్లకు మరింత నాణ్యమైన సేవలను సులభతరంగా అందజేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పాత విండోస్, సింబియన్ డివైస్‌లను పక్కన పెడితే బ్లాక్‌బెర్రీ యూజర్లకు ఇది ఒకింత ఇబ్బంది కలిగించే విషయమే. 

 

జన రంజకమైన వార్తలు