పికాస... గూగుల్ సర్వీసులతో టచ్ ఉన్నవారందరికీ దీని గురించి తెలిసే ఉంటుంది. సుమారు దశాబ్దకాలంగా ఫోటో షేరింగ్ సేవలందించిన పికాస ఇకపై కనుమరుగు కానుంది. పికాసను ఆపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. గూగుల్ ఫొటోస్ అప్లికేషన్ ఉండడంతో దాన్ని మరింతగా డెవలప్ చేసి ఎక్కువ మందికి చేరువకావాలని.. ఆ క్రమంలో పికాసను ఆపేయాలని గూగుల్ డిసైడ్ అయింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ సేవలు యూజర్లకు అందుబాటులో ఉండవు. పికాస, గూగుల్ ఫొటోస్ రెండూ గూగుల్ కు చెందినవే. రెండూ ఇంచుమించు ఒకేలాంటి సర్వీస్ అందిస్తున్నాయి. దీంతో పికాస వాడకం చాలావరకు తగ్గింది. ఆ కారణంతో పికాసపై గూగుల్ కూడా ఆసక్తి తగ్గించుకుని రెండు రకాల సేవలు అనవసరం అన్న నిర్ణయానికి వచ్చింది. దాంతో పికాసను ఆపేసి అందులోని ఫీచర్లను కూడా గూగుల్ ఫొటోస్ కు జతచేసి మరింత మెరుగైన ఫీల్ వచ్చేలా చేసి గూగుల్ ఫొటోస్ ను పూర్తిగా యూజర్ ఫ్రెండ్లీగా, ఫేవరెట్ గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని ప్రమోట్ చేయడం కోసం పికాసను ఆపేశారు. మరి యూజర్లు ఇంతవరకు పికాసలో దాచుకున్న ఫొటోలు, వీడియోల సంగతేంటన్న అనుమానం రావొచ్చు. వాటిభద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు. అవి ఆటోమేటిగ్గా వారి గూగుల్ ఫొటోస్ అకౌంట్ కు మారిపోతాయి. ఒకవేళ అలా వద్దని ఎవరైనా అనుకుంటే వారు పికాసలో ఉన్న తమ చిత్రాలు, వీడియోలను డౌన్ లోడ్ చేసుకుని ఆ తరువాత వాటిని పికాస నుంచి డిలీట్ చేసుకోవచ్చు. కాగా పికాస మూసివేత వల్ల ఎవరైనా యూజర్లు అసౌకర్యానికి గురయితే వారికి తమ క్షమాపణలు చెబుతున్నామంటూ గూగుల్ ఫొటోస్ చీఫ్ అనిల్ సభర్వాల్ ఒక స్టేట్ మెంట్ కూడా రిలీజ్ చేశారు. దీంతో గూగుల్ పికాస కథ ముగిసినట్లేనని తేలిపోయింది. కాగా పికాసను ముసేయడం కంటే మొదటిలోనే దాన్ని అప్ గ్రేడ్ చేసుంటే గూగుల్ ఫోటోస్ అవసరమే ఉండకపోమేదన్న అనే వాదనాలు వినిపిస్తున్నాయి |