ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడం మీకు సరదానా? ప్రతి చిన్న అంశానికీ స్పందించి పోస్టులు పెట్టేస్తున్నారా? ఫ‌్రెండ్స్ పోస్టులు పెట్టగానే టపీమని కామెంట్లు కొట్టేస్తున్నారా? అయితే కాస్త దూకుడు తగ్గించండి.. ఇది అందరూ ఎంజాయ్ చేసినంత వరకూ బాగానే ఉంటుంది. తేడావస్తే మాత్రం ఆ ఫేస్ బుక్ కామెంటో, పోస్టింగో మన తుప్పు వదిలించే ప్రమాదం ఉందంట. ముందూ వెనకా చూడకుండా ఆరోపణలు చేస్తూ పోస్ట్ పెట్టినందుకు అమెరికాలో ఓ మహిళ ఏకంగా రూ.3.2కోట్లు కాంపెన్సేషన్ చెల్లించాల్సి వచ్చింది.
అమెరికాలోని అషేవిల్లే ఏరియాలో ఉండే జాక్వెలైన్ హమ్మాండ్ ఓ రేడియో స్టేషన్‌లో పనిచేస్తున్నప్పుడు డెయిల్ అనే మరో మహిళతో ఫ్రెండ్‌షిప్ కుదిరింది. తర్వాత ఏదో గొడవ వచ్చి ఇద్దరూ కటీఫ్ అయిపోయారు. అయితే హమ్మాండ్ తనపై ఫేస్‌బుక్‌లో ఎలిగేషన్స్ చేసిందంటూ డెయిల్ కోర్టుకెక్కింది. డెయిల్ తన కొడుకుని తానే చంపిందని ఆరోపిస్తూ హమ్మాండ్ 2015లో ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. అసలే ఫ్రెండ్‌షిప్ కటీఫ్ అయి ఉందేమో.. డెయిల్ తన మాజీ ఫ్రెండ్‌పై మండిపడింది. తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని, ఆమె ఫేస్‌బుక్ పోస్టుతో తన పరువు గంగలో కలిసిపోయిందని గగ్గోలు పెట్టింది. ఆ పోస్ట్ తనను మానసికంగా ఎంతో బాధ పెట్టిందని కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతకుముందు కూడా ఇలాంటి పోస్టులు ఎన్నో పెట్టారని చెప్పింది. దీనిపై ఉత్తర కరోలినా కోర్టు విచారణ చేపట్టింది. హమ్మాండ్‌ను 5 లక్షల డాలర్లు(రూ.3.2కోట్లు) డెయిల్‌కు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ప్రజలు పదాల ప్రాముఖ్యాన్ని గుర్తించడం లేదని, హమ్మాండ్‌ను చూసైనా వాటిని వాడేటప్పుడు జాగ్రత్తపడాలని లాయర్ మిస్సీ వ్యాఖ్యానించారు.
లిమిట్స్ దాటకుంటేనే బెటర్
కాబట్టి ఫేస్‌బుక్ వాడేటప్పుడు జాగ్రత్త పడడం మంచిది. ఫ్రెండే కదాని అమ్మాయిలతో ఫేస్‌బుక్‌లో మాట్లాడేటప్పుడు లిమిట్ దాటేయకండి.. స్నేహం చెడితే అదే మీ తలకు చుట్టుకోవచ్చు. ముఖ్యంగా హీరోలు, పొలిటీషియన్స్‌కు సంబంధించి వాళ్ల ఫ్యాన్స్ అవతలి హీరో లేదా పొలిటీషియన్స్‌పై చాలా అతిగా కామెంట్లు చేస్తుండడం ఇప్పుడు బాగా ట్రెండయిపోయింది.. కాబట్టి కామెంట్ చేసేటప్పుడు, పోస్టు పెట్టేటప్పడు బీ కేర్‌ఫుల్...!