వాట్సప్ ఓపెన్ చేయగానే మనకు కుప్పలు తెప్పలుగా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. ఫొటోలు, వీడియోలు, వార్తలు ఇలా వరదలా మన పోన్లో పడుతూనే ఉంటుంది. వాటిల్లో ఏది నిజమే తేల్చుకోవడం చాలా కష్టంగా మారింది. అసలే ఇండియాలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ఫేక్ న్యూస్ వాట్సప్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎలాగైనా వీటిని కట్టడి చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా దేశంలో ఉన్న సోషల్ మీడియా యూజర్లను నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉంచేందుకు వాట్సాప్, నాస్కాం ఫౌండేషన్‌లు నడుం బిగించాయి.
రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న 1 లక్ష మంది సోషల్ మీడియా యూజర్లకు.. తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను ఈ సంస్థలు అందజేయనున్నాయి.అందులో భాగంగానే ఈ రెండు సంస్థలు ప్రస్తుతం భాగస్వామ్యం అయ్యాయి.
ఈ క్రమంలోనే సదరు సోషల్ మీడియా యూజర్లకు ఈ రెండు సంస్థల ప్రతినిధులు డిజిటల్ లిటరసీ ట్రెయినింగ్ ఇవ్వనున్నారు. ట్రెయినింగ్‌లో భాగంగా యూజర్లకు.. తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి, దాని పట్ల రిపోర్ట్ ఎలా చేయాలి, అలాంటి సమాచారం పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి.. అనే విషయాలను ప్రాక్టికల్‌గా నేర్పిస్తారు. అందులో భాగంగానే ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో మొదటి ట్రెయినింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఆ ట్రెయినింగ్‌లో పాల్గొనాలనుకునే వారు mykartavya.nasscomfoundation.org వెబ్‌సైట్‌లో రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు.