సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా పనిచేసినప్పుడు అవి వేడెక్కిపోతుంటాయి. దానితో సిస్టమ్ స్లో అయిపోతుంది. దీర్ఘకాలంలో ఇది సిస్టమ్ పనితీరు మీద కూడా ప్రభావం చూపెడుతుంది. దీనికి చైనా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన పరిష్కారం కనిపెట్టారు. అది సిస్టమ్ హీట్‌ను తగ్గించడమే కాదు ఆ హీట్ ద్వారా ఎలక్ట్రిసిటీని సృష్టించి దాన్ని సిస్టమ్ వాడుకునేలా చేస్తుంది.
ఓవర్ హీటింగ్‌తో సమస్యలు
* ఓవర్ హీటింగ్ వల్ల సిస్టమ్ స్లో అయిపోతుంది
* సిస్టమ్ జీవితకాలం తగ్గిపోతుంది.
* కరెంట్ కూడా ఎక్కువ ఖర్చవుతుంది.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు
చైనాలో వుహాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక ఎలక్ట్రో గాల్వనిక్ హైడ్రోజెల్‌ను తయారు చేస్తున్నారు. ఇది సిస్టమ్ హీట్‌ను తగ్గిస్తుంది. అదే సమయంలో ఆ అదనపు వేడిని ఎలక్ట్రిసిటీగా మార్చుతుంది. అంటే ఓకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట. మన సమస్యను తీర్చడమే కాదు దానిని మనకు ప్రయోజనం కలిగేలా మార్చుతుండడం గ్రేట్ కదా అంటున్నారు టెక్నాలజీ నిపుణులు.
ఎలా పనిచేస్తుంది?
శాస్త్రవేత్తలు నీరు, కొన్ని అయాన్లను కలిపి ఒక పాలీఎక్రిడమిక్ ఫ్రేమ్‌వర్క్‌తో కూడిన హైడ్రోజెల్‌ను తయారుచేస్తున్నారు. దీన్ని సిస్టంలో అమరుస్తారు. సిస్టం బాగా వేడెక్కినప్పుడు అది హైడ్రోజల్‌ను వేడెక్కిస్తుంది. దీంతో రెండు అయాన్లు ఎలక్ట్రోడ్ల మధ్య ఎలక్ట్రాన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. దీంతో పవర్ పుడుతుంది. అదే సమయంలో హైడ్రోజెల్ లోపల ఉన్న నీరు ఆవిరై సిస్టంను చల్లబరుస్తుంది. ఆ తర్వాత చుట్టూ ఉన్న గాలిలో నుంచి నీటిని గ్రహించి హైడ్రోజెల్ రీజనరేట్ అవుతుంది.
సెల్ ఫోన్ బ్యాటరీమీద ప్రయోగం
ఈ థియరీని నిరూపించడానికి వుహాన్ శాస్త్రవేత్తలు ఓవర్ హీటింగ్‌తో స్పీడ్‌గా బ్యాటరీ డిశ్చార్జి అయిపోతున్న ఓ సెల్ ఫోన్ మీద టెస్ట్ చేశారు. ఈ హైడ్రోజెల్ దానిలో వచ్చిన ఓవర్ హీట్‌ను ఉపయోగించుకుని 5 మైక్రోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. అంతేకాదు సిస్టం ఉష్ణోగ్రతను 64 డిగ్రీల ఫారన్‌హీట్ అంటే 17 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించింది. ఓవర్‌హీట్ తగ్గి బ్యాటరీ మీద ప్రెజర్ తగ్టిందని, దాంతోపాటు ఉత్పత్తయిన పవర్‌ను బ్యాటరీ ఉపయోగించుకుని కాస్త ఎక్కువసేపు ఫోన్ పని చేసిందని సైంటిస్ట్‌లు వివరించారు. ఇది త్వరలో సాకారమైతే ముఖ్యంగా మన ఆండ్రాయిడ్ ఫోన్ల హీటింగ్ సమస్య తగ్గుతుంది.