• తాజా వార్తలు

యాహూ.. అవుట్లుక్.. హాట్ మెయిల్ ఇక జీమెయిల్ లో..

 

ఇప్పటికే 100 కోట్ల మంది వినియోగదారులతో ప్రపంచ నంబర్ 1జీమెయిల్

 

ఒకప్పుడు మెయిల్ సర్వీసుల్లో అగ్రస్థానంలో ఉండి జీమెయిల్ వచ్చిన తరువాత వెనుకబడిపోయిన  యాహూ మెయిల్ ఇక నుంచి జీమెయిల్ లోనే చూసుకునే వీలు కలుగుతోంది. దీనివల్ల కోల్పోతున్న ఆదరణను తిరిగి పొందలేకపోయినా ఉన్న వినియోగదారులను పట్టి నిలపడం యాహూకు సులభమవుతుందని భావిస్తున్నారు.

జీమెయిల్‌లో ఇప్పుడో సరికొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి యాహూ.. అవుట్‌లుక్‌.. హాట్‌మెయిళ్లను కూడా జీమెయిల్‌లోనే చూసుకోవచ్చు. ఈ మేరకు గూగుల్ ప్రకటించింది. జీమెయిల్‌ఫై పేరుతో ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తోంది. జీమెయిల్‌ఫై సదుపాయం కోసం ముందుగా జీమెయిల్‌లోకి అన్ని ఈమెయిల్‌ ఐడీలు.. పాస్‌వర్డ్‌లతో లాగిన్‌ అవ్వాలి. ఆ తర్వాత జీమెయిల్‌ఫై ఫీచర్‌ను ఎనేబుల్‌ చేయాలి. అప్పుడు యాహూ.. అవుట్‌లుక్‌.. హాట్‌మెయిల్‌ మెయిళ్లనూ అందులోనే చూసుకోవచ్చు.

ఇంకో విషయం ఏంటంటే స్పామ్‌ ప్రొటెక్షన్‌.. ఇన్‌బాక్స్‌ టూల్స్‌ వంటి జీమెయిల్ సర్వీసులన్నీ వీటికీ పనిచేస్తాయి. ఒకవేళ ఈ సర్వీసును వద్దనుకుంటే కొన్ని మెయిల్‌ ఐడీలను జీమెయిల్‌ఫై నుంచి తొలగించే వీలూ ఉంటుంది.

ప్రస్తుతం యాహూ, హాట్‌మెయిల్‌, మైక్రోసాఫ్ట్‌ అవుట్‌లుక్‌ ఈమెయిళ్లకు మాత్రమే జీమెయిల్‌ఫై పనిచేస్తుందని.. త్వరలో మరిన్ని అందుబాటులోకి రానున్నట్లు గూగుల్‌ తెలిపింది. అన్ని డొమైన్లలోని మెయిళ్లనూ జీమెయిల్ లోనే చూసుకునే వీలు కలిగితే ఎన్ని మెయిల్ ఐడీలున్నా ఈజీగా మెంటెయిన్ చేయొచ్చన్నమాట.

కాగా జీమెయిల్ ఇప్పటికే 100 కోట్ల మంది వినియోగదారులతో ప్రపంచంలోనే అగ్రగామి ఈమెయిల్ సేవల సంస్థగా నిలిచింది. ఇలా అన్ని మెయిళ్లను చూసుకునే సర్వీసు అందుబాటులోకి తెస్తే దాని ఆదరణ మరింతగా పెరగడం ఖాయం. ఒకప్పుడు రీడిఫ్ మెయిల్, యాహూ, హాట్ మెయిల్ వినియోగించనవారంతా ఇప్పటికే జీమెయిల్ వినియోగదారులుగా మారిపోయారు. ఇకపై నేరుగా ఆయా మెయిల్ సర్వీసులే జీమెయిల్ లో మెర్జి అయితే మొత్తం ఈమెయిల్ సేవలన్నీ గూగుల్ గుప్పిట్లోనే ఉన్నట్లవుతుంది. 

 

జన రంజకమైన వార్తలు