హైఎండ్ ల్యాప్ టాప్ లలో మరోకొత్త ప్రొడక్ట్ లాంఛ్ అయింది. జెట్ స్పీడుతో పనిచేసే ఈ ల్యాప్ లో ఎక్కువగా డెస్క్ టాప్ కు ఉండే స్పెసిఫికేషన్లున్నాయి. కెనడాకు చెందిన కంప్యూటర్ల తయారీ సంస్థ యూరోకామ్ తయారుచేసిన ఈ ల్యాప్ స్పెసిఫికేషన్లు వింటే షాకవ్వాల్సిందే. స్కై ఎక్స్9డబ్ల్యూ పేరుతో విడుదల చేసిన ఈ ల్యాప్ వేరియంట్లలో ర్యామ్ 16 జీబీ నుంచి మొదలై 64 జీబీ ర్యామ్ కూడా ఉండడం విశేషం.యూరోకామ్ ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్కై ఎక్స్9కి ఇది అప్ గ్రేడెడ్ వెర్షన్ గా చెప్పొచ్చు. భారీ సామర్థ్యం ఉన్న దీని ధర కూడా అంతేస్థాయిలో ఉంటుంది. స్టార్టింగ్ మోడల్ ధరే సుమారుగా 2 లక్షల రూపాయలు ఉందట. స్కై ఎక్స్9డబ్ల్యూ యూరోకామ్ మొబైల్ వర్క్ స్టేషన్ గా చెబుతోంది. అయితే... మొబైల్ అని అనగానే దీని గురించి తక్కువగా అంచనావేయడానికి వీల్లేదు. హై ఎండ్ డెస్క్ టాప్ లలో కూడా లేని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అధిక సామర్థ్యం ఉన్నది కావడంతో డివైస్ ను చల్లబరిచేందుకు కూలింగ్ ఫ్యాన్లు ఎక్కువగా ఉన్నాయి. స్పెసిఫికేషన్లు.. - క్వాడ్ కోర్ ప్రాసెసర్ - ఇంటెల్ కోర్ ఐ7 స్కైలేక్ 6700కే చిప్ సెట్ - ఇంటెల్ కోర్ ఐ7 స్కైలేక్ 6700 ఎస్ఓసీ చిప్ సెట్ తో కూడా లభిస్తుంది. - ఇక మెమరీ విషయానికొస్తే ప్రారంభ మోడల్ 16జీబీ ర్యామ్ తో వస్తుంది. ప్రారంభ వేరియంట్ 16 జీబీ డీడీఆర్ 4 2133 మెగా హెర్జ్ట్ ర్యామ్ తో లభిస్తుండగా దాని తరువాత 32 జీబీ ర్యామ్ తో ఇంకో వేరియంట్... అన్నిటికంటే టాప్ వేరియంట్ గా 64 జీబీ డీడీఆర్ 4 2666 మెగా హెర్ట్జ్ ర్యామ్ వేరియంట్ లభిస్తోంది. - దీని తెర సాధారణ ల్యాప్ టాప్ ల కంటే పెద్దగా ఉంటుంది. 17.3 అంగుళాల డిస్ ప్లే దీని సొంతం - 3840 * 2160 పిక్సెళ్ల సామర్థ్యమున్న అధిక నాణ్యత గల తెర మంచి అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. - అయితే... డిస్ ప్లేలో తక్కువ సామర్థ్యం ఉన్న వేరియంట్ కూడా ఉంది. 1920*1080 పిక్సెళ్ల ఫుల్ హై డెఫినిషన్ డిస్ ప్లేతో ఇది వస్తుంది. - దీనికి ఒక 3.1 టైప్ సీ పోర్ట్ యూఎస్బీ పోర్టు... 3.0 యూఎస్బీ పోర్టులు అయిదు ఉంటాయి. - దీనికి ఉన్న రెండు మినీ డిస్ ప్లే పోర్టుల నుంచి నాలుగు మోనిటర్లకు కనెక్షన్ ఇవ్వొచ్చు. - వైఫై, హెచ్ డీఎంఐ వంటి అన్ని ఇతర సదుపాయాలూ ఇందులో ఉన్నాయి. - 5 టెరా బైట్ల హార్డ్ డిస్క్ సామర్థ్యం దీని ప్రత్యేకత. - ఈ మోడల్ లో అన్నీ హై ఎండ్ ఫీచర్లున్నది సుమారు రూ.7,75,000 ధర ఉంటుందని అంచనా. - ఈ ల్యాప్ కు మూడేళ్ల వారంటీ కూడా ఇస్తున్నారు. - అన్నీ అధిక సామర్థ్యమున్న ఫీచర్లే ఉండడంతో దీని బరువు కాస్త ఎక్కువగా ఉంది. 4.8 కేజీల బరువు ఉంటుంది. ఇక సాప్ట్ వేర్ విషయానికొస్తే విండోస్ 10, విండోస్ 8.1, విండోస్ 7 ప్లాట్ ఫాంలే కాకుండా పలు ఇతర ప్లాట్ ఫాంలపైనా ఇది పనిచేస్తుంది. |