• తాజా వార్తలు

షియోమీ ఇండియా కి తేవలసిన 7 అద్భుతమైన గ్యాడ్జేట్ లు

షియోమీ గురించి మీకు ఏం తెలుసు? ఏముంది అందుబాటు ధరలలో అధ్బుతమైన స్మార్ట్ ఫోన్ లు అందించే కంపెనీ నే కదా! అని అనుకుంటారు. అయితే అది ఎంత మాత్రమూ కాదు. షియోమీ స్మార్ట్ ఫోన్ తో పాటు మరెన్నో ఆకర్షణీయమైన టెక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది. గత సంవత్సరం ఇది తయారుచేసిన ఎయిర్ ప్యూరిఫయర్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాగే అధునాతన ఫీచర్ లతో కూడిన రెడ్ మి 4 అనే స్మార్ట్ ఫోన్ ను కూడా లాంచ్ చేసింది . దీనితో పాటే ఇండియా లో తన కంపెనీని విస్తరించుకునేందుకు షియోమీ రూటర్ 3 c అనే ఒక సరికొత్త మెంబర్ ను కూడా రంగ ప్రవేశం చేయించింది.
అలాగే బ్యాక్ ప్యాక్ ల దగ్గరనుండీ రైస్ కుక్కర్ లదాకా ఇది అనేక ఉత్పత్తులను అందిస్తుంది. ఎయిర్ ఫ్యూరిఫయర్ మరియు వైఫై రూటర్ లు ఇప్పటికే ఇండియా లో ప్రవేశించగా మిగతావాటి జాడ మన దేశం లో ఇంతవరకూ లేదు. ఈ నేపథ్యం లో షియోమీ ఇండియా కి తీసుకురావలసిన 7 అద్భుతమైన గ్యాడ్జేట్ ల గురించి ఈ ఆర్టికల్ లో ఇస్తున్నాం.
1. షియోమీ లి- నింగ్ స్మార్ట్ షూస్ : ది రన్నింగ్ బడ్డీ
చైనీస్ షూ మేకర్ అయిన లి-నింగ్ తో కలిసి షియోమీ స్పోర్ట్స్ షూ లను ప్రవేశాప్ట్టింది. చైనా లో లాంచ్ చేయబడిన ఈ స్మార్ట్ షూ ల ధర షుమారుగా రూ 2035 /- లు ఉంటుంది.ఈ షూ ల యొక్క అడుగుభాగం లో సెన్సార్ లు ఉంటాయి. వీటిని బ్లూ టూత్ ద్వారా మన స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ షూ లు ఫిట్ నెస్ రిలేటెడ్ ఆక్టివిటీ లను ట్రాక్ చేస్తూ ఉంటాయి. అంటే ఎంత దూరం పరిగెత్తిందీ, ఎన్ని కెలోరి లు ఖర్చు అయింది మొదలైన విషయాలు ఇది ట్రాక్ చేస్తుంది. అంతేగాక ఇది స్వెట్ ప్రూఫ్ మరియు వాటర్ ప్రూఫ్ అయిఉంటాయి.ఇందులో ఉండే సెన్సార్ లు మిలిటరీ గ్రేడ్ మెటీరియల్ తో తయారుచేయబడి ఉంటాయి. మరి ఇలాంటి షూ లు మన దేశం లో కూడా ఉండాలి కదా!
2. షియోమీ క్వై సైకిల్
గత సంవత్సరం చైనా లోఈ కంపెనీ ఒక స్మార్ట్ బైక్ ను లాంచ్ చేసింది. ఇదే క్వై సైకిల్ . దీనిధర మన కరెన్సీ లో సుమారు రూ 30,000 లు ఉంటుంది. ఇది టార్క్ మెజర్ మెంట్ మెథడ్ తో కూడిన 250 W – 36 V ఎలక్ట్రిక్ మోటర్ ను కలిగి ఉంటుంది. ఇది రైడర్ యొక్క పెడల్ పవర్ ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉండే పానాసోనిక్ 18650 బ్యాటరీ ద్వారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 కిలోమీటర్ ల వరకూ రైడ్ చేయవచ్చు. అలాగే మనం దీనిని మడత పెట్టేసి కార్ లో పెట్టుకోవచ్చు లేదా ఏదైనా పెట్టెలో కూడా పెట్టుకోవచ్చు.
3. Yi4 K యాక్షన్ కెమెరా
యాక్షన్ కెమెరా అనగానే మనకు గుర్తుకువచ్చే పేరు గో ప్రో . అయితే దీనికి పోటీగా 2016 లో షియోమీ Yi యాక్షన్ కెమెరా ను లాంచ్ చేసింది. ఇది ఈ కంపెనీ 2015 లో లాంచ్ చేసిన యాక్షన్ కెమెరా 2 కి అప్ గ్రేడేడ్ వెర్షన్. దీనిధర సుమారు రూ 12,500/- లు ఉంటుంది. ఇది 4 కె వీడియో లను 30 fps తో షూట్ చేయగలదు. 240 fps తో ఫుల్ HD వీడియో లను 120 fps తో HD వీడియో లను రికార్డు చేయగలదు. ఇందులో ఉండే పాకెట్ సైజు కెమెరా 12 మెగా పిక్సెల్ సోనీ IMX377 సెన్సార్ ను f/2.8 అపెర్చర్ మరియు 155 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్ తో కలిగిఉంటుంది. ఇది అంబరేల్లా A9SE చిప్ సెట్ తో పవర్ చేయబడి 2. 19 ఇంచ్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను కలిగిఉంటుంది. దీనిలో మైక్రో ఎస్ డి కార్డు స్లాట్ , డ్యూయల్ మైక్రో ఫోన్ మరియు 1400 mAh బ్యాటరీ ఉంటాయి.
4. నైన్ బోట్ మిని
రోబోటిక్ కంపెనీ అయిన నైన్ బోట్ లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన తర్వాతా షియోమీ 2015 లో ఒక సెల్ఫ్ బ్యాలన్సింగ్ టు వీలర్ స్కూటర్ ను లాంచ్ చేసింది. ఇది బ్యాటరీ తో పవర్ చేయబడి సేగ్వాయ్ కి పోటీ గా నిలుస్తుంది. ఇది గరిష్టంగా 16 km/h తో ప్రయాణం చేయగలదు అలాగే 15 డిగ్రీ ల వాలువరకూ పయనించగలదు. దీనిబరువు కేవలం 12.8 గ్రాములు మాత్రమే ఉంటుంది. దీనియొక్క ధర మన కరెన్సీ లో సుమారుగా రూ 20,000/- లు ఉంటుంది.
5. Mi డ్రోన్
చైనా ఆధారిత కంపెనీ అయిన ఫ్లై మి తో ఒప్పందం కుదుర్చుకున్న షియోమీ Mi డ్రోన్ అనే ఒక క్వాడ్ కాప్టర్ ను లాంచ్ చేసింది. ఇది కెమెరా తోనూ మరియు 5100 mAh బ్యాటరీ తోనూ లభిస్తుంది. ఇది 27 నిమిషాల వరకూ నిరంతరాయంగా గాలిలో ఎగరగలదు. ఈ డ్రోన్ లో రెండు వెర్షన్ లు ఉన్నాయి. ఒకటి 1080 p ఉండేది, దీనిధర రూ 26,000/- లు ఉంటుంది. మరొకటి 4 K వీడియో లను షూట్ చేయగలిగినది దీనిధర రూ 31,000/- లు ఉంటుంది. ఈ రెండూ కూడా 104 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ ను అందిస్తాయి. దీనిలో మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక మాడ్యులర్ డివైస్. దీనిని సులభంగా అసెంబుల్ చేయవచ్చు అలాగే డిసంబుల్ కూడా చేయవచ్చు. తద్వారా ఎక్కడికైనా దీనిని తీసుకువెళ్ళవచ్చు.
6. షియోమీ Mi నోట్ బుక్ ఎయిర్ 4 జి
2016 చివర్లో షియోమీ ఈ Mi నోట్ బుక్ ఎయిర్ 4 జి ని లాంచ్ చేసింది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. 12.5 ఇంచ్ డిస్ప్లే తో లభిచే దానిధర రూ 46,000/- ల వరకూ ఉండగా 13.3 ఇంచ్ డిస్ప్లే లభించే దాని ధర రూ 62,000/- లు ఉంటుంది. ఈ నోట్ బుక్ సిమ్ కార్డు సపోర్ట్ తో వస్తుంది. తద్వారా యూజర్ లు వైఫై కనెక్షన్ లేకపోయినా సరే ఇంటర్ నెట్ ను ఉపయోగించవచ్చు. పేరుకు తగ్గట్లు ఇది 4 జి LTE కనెక్టివిటీ ని సపోర్ట్ చేస్తుంది. 150 Mbps వరకూ డౌన్ లోడ్ స్పీడ్ ను అందిస్తుంది. ఈ రెండు డివైస్ లు కూడా విండోస్ 10 పై పనిచేస్తాయి.
7. షియోమీ 4 K Mi బాక్స్ 3 S
గత సంవత్సరం లాంచ్ చేయబడిన ఇది ఒక ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత Mi బాక్స్ 3 S. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో తో పవర్ చేయబడిన ఇది AI మరియు 4 K UHD సపోర్ట్ ను కలిగిఉంటుంది. ఇందులో అమ్లోజిక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 GB DDR3 RAM మరియు 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. దీని ధర మన కరెన్సీ లో సుమారుగా రూ 2800/- లు ఉంటుంది.

జన రంజకమైన వార్తలు