ఇంటర్నెట్ అందరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాలు చూడటం చాలా సులభం అయిపోయింది. ఒకప్పుడు సినిమా చూడాలంటే ధియేటర్‌కు వెళ్లేవాళ్లు. లేకపోతే కేబుల్ టీవీలో చూసేవాళ్లు. కొత్త సినిమా టీవీలో చూడాలంటే చాలా కాలం పట్టేది. కానీ ఇంటర్నెట్ బాగా విస్తరించాక ఈ బాధ తప్పింది. ఇప్పుడు ఏ సినిమా కావాలంటే ఆ సినిమా చిటికెలో దొరుకుతుంది. విడుదలైన కొద్దిరోజులకే సినిమాలు దొరుతున్నాయి. ఐతే ఈ నేపథ్యంలో సినిమాల కోసమే ప్రత్యేకంగా ఒక యాప్ వచ్చింది. ఇది రీజనల్ సినిమాలను ఉద్దేశించి తయారు చేసిన యాప్. ఆ యాప్ పేరు ఫాస్ట్ ఫిల్మ్‌జ్. రూ.10 చెల్లిస్తే చాలు అన్ లిమిటెడ్‌గా మూవీలు చూడొచ్చట. ఈ యాప్‌లో ప్రత్యేకమైన ఉండే లైబ్రరీ ద్వారా మనకు నచ్చిన సినిమాలను చూసే అవకాశం ఉంటుంది. ఐతే ప్రస్తుతానికి ఈ ఫాస్ట్ ఫిల్మ్‌జ్ యాప్‌లో తమిళ సినిమాలు మాత్రమే లభ్యం అవుతున్నాయి. ఈ యాప్ లైబ్రరీలో 150 తమిళ సినిమాలను పొందుపరిచారు. ఈ యాప్‌లో త్వరలోనే తెలుగు సినిమాలను కూడా ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యం అవుతున్న ఈ యాప్ ద్వారా భవిష్యత్‌లో మరిన్ని భాషల్లో సినిమాలను చూసే అవకాశం ఉంటుంది. వివిధ భాషల్లోని సూపర్ స్టార్లను లక్ష్యంగా చేసుకుని లైబ్రరీలో సినిమాలు ఉంచాలని ఈ యాప్ తయారీదారులు పని చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా సినిమాలు చూడాలంటే చాలా చౌక. రోజుకు రూ.1 మాత్రమే చెల్లిస్తే చాలు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. పది రోజులకు రూ.10 చెల్లిస్తే చాలు మనకు నచ్చినన్ని సినిమాలు చూసే అవకాశం కల్పిస్తోందీ యాప్. కేవలం నేరుగా చూడటమే కాదు.. డౌన్‌లౌడ్ ఆప్షన్‌ను కూడా ఈ యాప్ ఇస్తోంది. పైగా ఈ సినిమాల్లో ఎలాంటి యాడ్స్ ఉండకపోవడంతో నిరాంతరాయంగా మనకు నచ్చిన సినిమాలను చూడొచ్చు. ఈ యాప్‌కు సబ్‌స్క్రిప్షన్ చెల్లించడం కూడా చాలా సులభం. మన ఫోన్ ద్వారానే సబ్‌స్క్రిప్షన్ చెల్లించొచ్చు. ఈ విషయం గురించి ఫాస్ట్ ఫిల్మ్‌జ్ యాప్ ఇప్పటికే ఎయిర్‌సెల్, వోడాఫోన్, ఎయిర్‌టెల్, ఐడియా లాంటి పెద్ద నెట్‌వర్క్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ యాప్‌లో ఆరు విభాగాలు ఉంటాయి. స్టార్లు, సీన్స్, న్యూ అరైవల్స్, షో కేస్, ఎక్స్‌ప్లోర్ మరియు మై డౌన్‌లోడ్స్ అనే ఆరు విభాగాలుగా యాప్ ఉంటుంది. మన అవసరాలకు తగ్గట్టుగా ఈ విభాలను వాడుకోవచ్చు. షో కేస్ విభాగంలో నటీ నటుల భారీ పోస్టర్లు లభ్యం అవుతాయి. |