• తాజా వార్తలు

ఐఫోన్ 8 వ‌చ్చేస్తుందా? ఎలా ఉండబోతోంది?

టెక్నాల‌జీ దిగ్గ‌జం యాపిల్ ఏటా నిర్వ‌హించే వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్ (WWDC 2017)కి రంగం సిద్ధ‌మైంది. జూన్ 5 నుంచి  9 వ‌ర‌కు అమెరికాలోని శాన్‌జోస్‌లో 28వ డ‌బ్ల్యూడ‌బ్ల్యూడీసీ  కాన్ఫ‌రెన్స్ కండ‌క్ట్ చేస్తామ‌ని యాపిల్ ఎనౌన్స్ చేసింది.  ఐ ఫోన్‌, ఐపాడ్‌, యాపిల్ వాచ్‌, యాపిల్ టీవీ, మాక్ ఇలా  యాపిల్ ఉత్ప‌త్తుల‌కు సంబంధించిన కొత్త డెవ‌ల‌ప్‌మెంట్స్‌ను, ఆవిష్క‌ర‌ణ‌ల‌ను, కొత్త యాప్స్‌ను ప‌రిచ‌యం చేయనుంది. మిగతా సంస్థలూ ఈ వేదికను ఉపయోగించుకోనున్నాయి. అత్యంత ఆద‌ర‌ణ పొందిన ఐఫోన్‌తో స‌హా దాదాపు త‌న ప్రొడ‌క్ట్స్ అన్నింటినీ డ‌బ్ల్యూడ‌బ్ల్యూడీసీ  వేదిక‌గానే యాపిల్ ప్ర‌పంచానికి ప‌రిచయం చేసింది. టెక్నాల‌జీ రంగంలో రోజుకో కొత్త ఆవిష్క‌ర‌ణ పురుడు పోసుకుంటున్న ప్ర‌స్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది కాన్ఫ‌రెన్స్‌లో యాపిల్ ఏ ఉత్ప‌త్తుల‌ను రంగంలోకి తీసుకురాబోతోంది? ఐ ఫోన్  ల‌వ‌ర్స్  ఎదురుచూస్తున్న‌ట్లు ఐఫోన్ 8 తీసుకొస్తుందా?  అనే దానిపైనే ఇప్పుడు అంద‌రి దృష్టీ ఉంది.
 ఈసారి ఏం ఉంటాయో?
  ఏటా డ‌బ్ల్యూడ‌బ్ల్యూడీసీ ఈవెంట్ల‌లో  యాపిల్ త‌న ఉత్ప‌త్తుల కొత్త వెర్ష‌న్ల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తుంది. అందుకే టెక్నాల‌జీ ల‌వ‌ర్స్ నుంచి ఈ రంగంలోని దిగ్గ‌జ కంపెనీల వ‌ర‌కు అంద‌రూ ఈ ఈవెంట్‌ను ఆస‌క్తిగా గ‌మ‌నిస్తారు.  నెక్స్ట్ జ‌న‌రేష‌న్ మొబైల్ ఫోన్లు, వాచ్‌లు, యాపిల్ టెలివిజ‌న్లు, మాక్‌లు,  ఐవోఎస్ లో వ‌చ్చే కొత్త యాప్‌ల గురించి కాన్ఫ‌రెన్స్‌లో  ప్ర‌ద‌ర్శించ‌నుంది.
 ఐఫోన్ స్పెష‌ల్స్‌
 యాపిల్ కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ను విశ్వ‌వ్యాప్తం చేసిన ఐఫోన్ పుట్టి ఈ సంవ‌త్స‌రానికి ప‌దేళ్లు.  2007లో ఐఫోన్‌ను లాంచ్ చేసిన త‌ర్వాత  దీన్ని ఆల్‌టైం మోస్ట్  స‌క్సెస్‌ఫుల్ ప్రొడ‌క్ట్‌గా  పేర్కొంటున్నారు.  ఎందుకంటే గ‌త ప‌దేళ్ల‌లో ఐఓఎస్ డివైస్‌లు, వాటి స‌ర్వీసుల మీద ల‌క్ష కోట్ల‌కు పైగా వ్యాపారం చేసింది.  ఐఫోన్ ఆవిష్క‌ర‌ణ‌కు ప‌దేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా  కొత్త వెర్ష‌న్ ను యాపిల్ లాంచ్ చేస్తుంద‌ని టెక్నాల‌జీ ల‌వ‌ర్స్ ఎదురుచూస్తున్నారు.  యాపిల్ కొత్త ఆప‌రేటింగ్ సిస్టం ఐఓఎస్ 11 ను కూడా ఈ కాన్ఫ‌రెన్స్‌లో ప‌రిచ‌యం చేసే అవ‌కాశం ఉంది.  దీంతోపాటు మాక్ ఓఎస్ డెస్క్‌టాప్ సిస్టం, వాచ్ ఓఎస్‌, టీవీ ఆప‌రేటింగ్ సిస్టంల్లోనూ అప్‌డేట్స్ వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.
 ఐఫోన్ 8
 ఐఫోన్ 8 మోడ‌ల్‌ను ఈ ఏడాది యాపిల్ మార్కెట్‌లోకి లాంచ్ చేసే అవ‌కాశాలున్నాయి. ఈ కాన్ఫ‌రెన్స్‌లోనే దీన్ని రివీల్ చేయ‌వ‌చ్చ‌ని మార్కెట్ వ‌ర్గాల అంచ‌నా.
 * యాపిల్ ఫోక‌స్డ్ వెబ్‌సైట్ మాక్ రూమ‌ర్స్ క‌థ‌నం ప్ర‌కారం ఐఫోన్ 8లో చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉండబోతున్నాయి.
 * ఐఫోన్ 8లో క‌నీసం ఒక్క మోడ‌ల‌యినా అల్యూమినియం బాడీ కి బ‌దులు గ్లాస్ బాడీతో మార్కెట్లోకి వ‌స్తుంది.  ఓఎల్ఈడీ (ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డ‌యోడ్‌) డిస్‌ప్లే దీనికి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ కాబోతోంది. దీని ధ‌ర కూడా 1000 డాల‌ర్ల కంటే పైనే ఉంటుంది.
 * ఐఫోన్ ఫీచ‌ర్లు ఎలా ఉండబోతున్నాయని గ‌తంలో అనేక‌సార్లు విజ‌య‌వంతంగా ప్రెడిక్ట్ చేసి చెప్పిన కేజీఐ సెక్యూరిటీస్ ఎన‌లిస్ట్ మింగ్‌- చీ కూ అయితే మ‌రో అడుగు ముందుకేసి  ఐఫోన్ 8లో సాధార‌ణ హోం బ‌ట‌న్‌కు బ‌దులు  వ‌ర్చువ‌ల్ బ‌ట‌న్స్  ఉంటాయ‌ని చెబుతున్నారు.
 * ఐఫోన్ 8 ఫుల్ స్క్రీన్ డిజైన్ రానుంది.  గ‌తంలో ఐఫోన్‌లో చూడ‌ని విధంగా ఓ ఫంక్ష‌న్ ఏరియా ఇందులో ఉంటుంద‌ని యాపిల్ ఇన్‌సైడ‌ర్ పేర్కొంది.
 డిజిట‌ల్ అసిస్టెంట్స్
 టెక్నాల‌జీ రంగంలో మిగిలిన కంపెనీలు ఇప్ప‌టికే డిజిట‌ల్ అసిస్టెంట్ల త‌యారీపై బాగా దృష్టి పెట్టాయి. వీటికి ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)ను జోడిస్తున్నాయి. యాపిల్ కూడా ఈ కోవ‌లోనే సిరి ఏఐను అభివృద్ధి చేస్తుంద‌ని స‌మాచారం. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా కాన్ఫ‌రెన్స్‌లో వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.
 టికెట్ ల‌క్ష రూపాయ‌లు
 యాపిల్ డెవ‌ల‌ప‌ర్ ప్రోగ్రాంలో మెంబ‌ర్లు,  యాపిల్ డెవ‌ల‌ప‌ర్ ఎంట‌ర్‌ప్రైజ్ ప్రోగ్రాంలో మెంబ‌ర్ల‌యిన డెవ‌ల‌ప‌ర్లు మాత్ర‌మే  ఈ కాన్ఫ‌రెన్స్‌కు హాజ‌ర‌య్యేందుకు టికెట్ల కోసం అప్ల‌యి చేసుకోవ‌చ్చ‌ని సంస్థ ప్ర‌క‌టించింది.  రిజిస్ట్రేష‌న్లు మార్చి 27న ప్రారంభ‌మ‌వుతాయి.  వీటిలో నుంచి ర్యాండ‌మ్‌గా కొంత మందిని సెలెక్ట్ చేస్తుంది. ఎంపికైన డెవ‌ల‌ప‌ర్స్  ఒక్కొక్క‌రు 1,599 డాల‌ర్లు (ల‌క్షా 7వేల రూపాయ‌లు ) చెల్లించాలి.  యాపిల్ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న క్రేజ్ నేప‌థ్యంలో ఈ టికెట్ల‌న్నీ నిముషాల్లో అమ్ముడుపోతాయి.
 డ‌బ్ల్యూడ‌బ్ల్యూడీసీ 2017ను యాపిల్ డెవ‌ల‌ప‌ర్ వెబ్‌సైట్‌లో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చూడొచ్చు.  ఐఫోన్‌, ఐపాడ్‌, యాపిల్ టీవీల్లో WWDC యాప్ లోనూ లైవ్ టెలికాస్ట్ చూసే అవ‌కాశం  ఉంది.
 యాపిల్ ఇంజినీర్ల‌తో మాట్లాడొచ్చు
 డ‌బ్ల్యూడ‌బ్ల్యూడీసీకి అస‌లు వేదిక శాన్‌జోసే. 1988లో ఈ కాన్ఫరెన్స్‌లు ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి 2002 వ‌ర‌కు ప‌దిహేనేళ్ల‌పాటు ఇక్క‌డే వీటిని కండ‌క్ట్ చేశారు. త‌ర్వాత వేదిక‌లు మారినా మళ్లీ శాన్‌జోస్‌లోని మెక‌న్రీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌కు తిరిగివ‌చ్చింది. ఇక్క‌డ నుంచి యాపిల్ హెడ్‌క్వార్ట‌ర్స్ ఉన్న క్యూప‌ర్టినో కు కేవ‌లం 10 నిముషాల ప్ర‌యాణం. అందువ‌ల్ల కాన్ఫ‌రెన్స్‌కు వ‌చ్చే డెవ‌ల‌ప‌ర్స్ యాపిల్ హెడ్‌క్వార్ట‌ర్స్‌కు వెళ్లి అక్క‌డున్న వెయ్యి మందికి పైగా ఇంజినీర్ల‌తో నేరుగా మాట్లాడే అవ‌కాశం ద‌క్క‌నుంది.  డెవ‌ల‌ప‌ర్స్ తాము చేస్తున్న ప్ర‌యోగాలు ఇంకా ఎలా ఉంటే బాగుంటుందో తెలుసుకోవ‌డానికి ఇది చాలా మంచి అవ‌కాశం.

జన రంజకమైన వార్తలు