• తాజా వార్తలు

గర్భ నిరోధక మాత్రలకు ప్రత్యామ్నాయంగా ఓ యాప్ !? ఇది సాధ్యమా ?

 

దేంటి? గర్భ నిరోధక మార్గాలకు ప్రత్యమ్నాయమా? ఇది టెక్నాలజీ వెబ్ సైట్ కదా! మరి ఇందులో ఇలాంటి ఆర్టికల్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ ఆర్టికల్ చదివేయండి. ఇందులో ఉన్న టెక్నాలజీ మీకు అర్థం అవుతుంది.

సాధారణంగా ఆడవాళ్ళు గర్భ నిరోధక సాధనాలుగా అంటే గర్భం రాకుండా మాత్రలు వేసుకుంటారు.అందుకు వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఈ కారణాలు మేము విశ్లేషించదలచుకోలేదు.అయితే చాలా పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే ఈ గర్భ నిరోధక మాత్రల వలన ఆడవారి ఆరోగ్యం పై దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉంటాయి. మరి వీటికి ప్రత్యామ్నాయం ఏదీ అని ఆలోచిస్తున్న తరుణం లో ఒక యాప్ వచ్చింది. అవును గర్భ నిరోధక మాత్రలకు ప్రత్యామ్నాయంగా ఈ యాప్ రూపొందించినట్లు దీని రూపకర్తలు చెబుతున్నారు.

ఈ యాప్ ఎలా పని చేస్తుంది?

ఆడవాళ్ళు గర్భం దాల్చడానికి అనువుగా ఉన్న సమయం వచ్చినపుడు వారి శరీరం లో వచ్చే మార్పులను గమనించి ఈ యాప్ వీరికి అలెర్ట్ లను పంపిస్తుంది. కాబట్టి ఆ సమయం లో లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండడం ద్వారా వీరు అవాంచిత గర్భాన్ని నిరోధించవచ్చు. ఇది ప్రతీ రోజూ మీ శరీర ఉష్ణోగ్రత ను నోట్ చేసుకుంటుంది. అండోత్పత్తి జరిగిన తర్వాత ఆడవారి శరీర ఉష్ణోగ్రత లో 0.45 డిగ్రీ ల మార్పు వస్తుంది. ఈ మార్పును ఈ యాప్ చక్కగా గుర్తించి అలెర్ట్ లను పంపిస్తుంది. తద్వారా వీరు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది.

నాచురల్ సైకిల్స్ అనే సంస్థ యొక్క వ్యవస్థాపకులూ మరియు ఈ యాప్ రూపకర్త అయిన ఎలినా బెర్గ్లాండ్ మాట్లాడుతూ “ గర్భ నిరోధక మాత్రల నుండి నా శరీరానికి విముక్తి కలిగించాలని నేను అనుకున్నాను. కానీ నాకు సరైన ప్రత్యామ్నాయం ఏదీ దొరకలేదు. అందుకనే ఆ మార్గాన్ని నేనే కనుక్కున్నాను, నా అల్గోరిథం ను నేను రాసుకున్నాను” అని చెప్పారు.

నాచురల్ సైకిల్స్ అనే ఈ సంస్థ దీనిని ప్రయోగాత్మకంగా  రెండు సార్లు పరీక్షించింది. 20-35 సంవత్సరాల వయసులో ఉన్న సుమారు 4,000 ల మంది మహిళల పై ఈ  యాప్ ను పరీస్ఖించారు. ఇందులో 99.5 శాతం ఖచ్చితంగా ఈ యాప్ పని చేసినట్లు దీని రూపకర్తలు చెబుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ ఇది ఎంత వరకూ వాస్తవం అనేది రియల్ టైం లో చూడవలసిన అవసరం ఉంది. అప్పటివరకూ దేనినీ నమ్మడానికి లేదు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబందించిన వ్యవహారం కదా! అయితే ఈ తరహా ప్రయోగాలలో మాత్రం ఈ యాప్ మొదటిది అని చెప్పవచ్చు. ఇది ఎంత వరకూ సాధ్యం అనేది మెడికల్ అనలిస్ట్ లే చెప్పాలి, మనకు తెలియాలంటే పూర్తి స్థాయి లో అందుబాటులోనికి రావాలి. అప్పటివరకూ అవునా! అని అనుకోవడమే!

 

జన రంజకమైన వార్తలు