మన దేశంలో మహిళ రక్షణ అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. నిర్భయ ఉదంతం నేపథ్యంలో ఈ విషయంపై పెద్ద చర్చే జరిగింది. చివరికి నిర్భయ చట్టం వచ్చినా.. మహిళలకు మాత్రం రక్షణ ఉండట్లేదు. నిర్భయ తరహా ఘటనలు ప్రతి రోజూ ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. దీంతో స్మార్టుఫోన్లలో పానిక్ బటన్ పెట్టాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సెల్‌ఫోన్ తయారీ కంపెనీలను ఆదేశించింది. ఐతే పానిక్ బటన్ తరహాలోనే మహిళల రక్షణ కోసం ఒక యాప్ సిద్దమైంది. అదే పానిక్ యాప్. ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం ఈ యాప్‌ను రూపొందించారు. ఢిల్లీకి చెందిన మొబైల్ బేస్డ్ అలయన్స్ ఇండియా (ఎంఎస్ఏఐ) ఈ యాప్‌ను తయారు చేసింది. ఈ యాప్ పేరు ఐ ఫీల్ సేఫ్. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ లభ్యం అవుతుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు పద్ధతుల్లోనూ ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. స్మార్టు ఫోన్‌లోని పవర్ బటన్‌ను వరుసగా ఐదుసార్లు ప్రెస్ చేస్తే చాలు ఈ యాప్ యాక్టివేట్ అవుతుంది. ఒకసారి ఈ యాప్ యాక్టివేట్ కాగానే మొబైల్ ఏ ప్రాంతంలో ఉంది... సమయంతో సహా ఆ మొబైల్ యజమానికి సంబంధించిన కుటుంబ సభ్యులకు, సంబంధిత పోలీస్ స్టేషన్ సందేశాలు పంపుతుంది. అంతేకాదు స్థానిక పోలీసులకు ఒక అలర్ట్ కాల్ కూడా వెళుతుంది. అంతేకాదు మొబైల్ ఏ ప్రాంతంలో ఉందో తెలియజేస్తూ రూట్ మ్యాప్‌ను కూడా కుటుంబ సభ్యులు, పోలీసులకు పంపిస్తుంది. వినియోగదారులు ఈ బటన్ మరోసారి ప్రెస్ చేసే వరకు యాప్ ఇలా సందేశాలు పంపిస్తూనే ఉంటుంది. ఏదైనా ఆపద సంభవించినప్పుడు, ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు లేక కిడ్నాప్ లాంటివి జరిగినప్పుడు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుదని మొబైల్ బేస్డ్ అలయన్స్ ఇండియా సంస్థ తెలిపింది. మొబైల్ డివైజ్‌లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి తాము మొబైల్ తయారీదారులతో చర్చలు సాగిస్తున్నట్లు మొబైల్ బేస్డ్ అలయన్స్ ఇండియా తెలిపింది. రక్షణే ప్రధాన ధ్యేయంగా ఆ యాప్‌ను తీసుకొచ్చామని భారత యూజర్లే కాక విదేశీయులకు కూడా ఈ యాప్‌ను పరిచయం చేస్తామని ఈ సంస్థ తెలిపింది. ఇప్పటికే మొబైల్స్ ఉపయోగిస్తున్నవారికి అప్‌డేట్ చేసుకోవడం ద్వారా యాప్‌ను అందుబాటలోకి తెచ్చేలా ప్రయత్నిస్తున్నామని ఈ సంస్థ పేర్కొంది. ఈ యాప్‌ను మొబైల్ సంస్థలకు రూ.1 కే అందిస్తున్నామని చెప్పింది. |