ఇది యాప్‌ల కాలం... రోజుకో యాప్ ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది. ప్రతి చిన్న అవసరానికి ఒక యాప్ పుట్టుకోచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిందే భావోద్వేగాల నియంత్రణ యాప్! వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ యాప్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ఇప్పటికే కార్యరూపం దాల్చిన ఈ యాప్ త్వరలోనే పూర్తి స్థాయిలో తయారై అందుబాటులోకి రానుంది. మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు విపరీతమైన బిజీగా గడుపుతున్న రోజులివి. మనుషుల మధ్య సంబంధాలు యాంత్రికమైపోయిన ఈ రోజుల్లో ఒత్తిడి కూడా అంతే స్థాయిలో పెరిగిపోతుంది. దీని ఫలితమే రకరకాల శారీకర రుగ్మతలు. యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్ అండ్ మాంచెస్టర్ ఆధ్వర్యంలో తయారైన క్యాచ్ ఇట్ యాప్ మనుషుల్లోని భావోద్వేగాలను పసిగట్టి వారికి సూచనలు, సలహాలు అందిస్తుందట. తీవ్ర ఒత్తిడితో కూడిన జీవన శైలి వల్ల మనుషులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అవి శారీరకంగానే కాక, మానసికంగా కూడా ఉంటున్నాయని ఈ యూనివర్సిటీ తెలిపింది. ఈ యాప్‌ను స్మార్టుఫోన్‌లో ఉంచుకోవడం ద్వారా మన చేతి స్పర్మ ద్వారా మన మానసిక పరిస్థిని పసిగట్టి మనకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి ఈ యాప్ ప్రయత్నిస్తుందని ఈ యాప్ రూపకర్తలు వెల్లడించారు. ఈ యాప్ వల్ల యూజర్లు తమ మానసిక స్థితిని పసిగట్టి తమను తాము సరి చేసుకునే అవకాశం వస్తుందని వారు అంటున్నారు. ఇది కాంజినేటివ్ బిహేవియర్ థెరపీలా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. క్యాచ్ ఇట్... చెక్ ఇట్.. ఛేంజ్ ఇట్ అనే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఐతే ఈ కాంజినేటివ్ బిహేవియర్ థెరపీ వల్ల మనుషులకు వచ్చే సమస్యలు పరిష్కారం కాకపోయినా... వెంటనే ఆ సమస్యను గుర్తించి దానికి సూచనలు, సలహాలు ఇవ్వడం వల్ల వారికి మార్గనిర్దేశనం చేసినట్లవుతుందని యాప్ రూపకర్తలు అంటున్నారు. మనుషుల్లోని నెగిటివ్, పాజిటివ్ స్పందనలను తెలుసుకోగలిగితే వారు మరింత సమర్థంగా పని చేసే అవకాశం కూడా ఉంటుందట. ఇది మానసిక ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. |