• తాజా వార్తలు

యాపిల్ తెస్తోంది ప‌వ‌ర్‌ఫుల్ ఎ-11 చిప్‌

ప్ర‌స్తుత కంప్యూట‌ర్ ప్ర‌పంచంలో సింహ‌భాగం పాత్ర పోషిస్తున్న కంపెనీల్లో యాపిల్ ఒక‌టి. కేవ‌లం కంప్యూట‌ర్ ఉప‌క‌ర‌ణాలు మాత్ర‌మే కాదు ఐ ఫోన్లు ఇత‌ర సాంకేతిక ప‌రిక‌రాల‌తో యాపిల్ దూసుకెళ్తోంది. మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యం కొత్త ప‌రిక‌రాల‌ను త‌యారు చేయ‌డంలో యాపిల్ ముందు వ‌రుసులో ఉంటుంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిందే ఎ-11 చిప్‌. శ‌క్తివంత‌మైన ఈ చిప్ యాపిల్ ఉప‌యోక‌ర‌ణాల‌ను మ‌రింత మెరుగ్గా ప‌ని చేసేలా చేస్తుంద‌ని ఆ కంపెనీ న‌మ్ముతోంది. సాధార‌ణంగా యాపిల్ కంపెనీకి సంబంధించిన ఉప‌క‌రాల‌ను త‌యారు చేసే తైవాన్ సెమీ కండ‌క్ట‌ర్ మాన్యుఫాక్చ‌రింగ్ కంపెనీకి ఎ-11 చిప్ త‌యారీ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పింది యాపిల్‌. అలా ఇలా కాదు భారీ ప్రొడెక్ష‌న్‌కు యాపిల్ ఆర్డ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. అంటే రాబోయే కాలంలో తాము త‌యారు చేయ‌బోయే గాడ్జెట్ల‌లో ఎ-11 చిప్‌ను ఉప‌యోగించాల‌నే ఆలోచ‌న‌తో యాపిల్ ఉన్న‌ట్లు ఆ సంస్థ తాజా నిర్ణ‌యాల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

ఐఫోన్ 8 కోసం..
ఐఫోన్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ మోడ‌ల్‌లో కొత్త సిరీస్ వ‌స్తుందంటే మొబైల్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తారు. ధ‌ర ఎక్కువే అయినా దీనిలో ఉండే ఫీచ‌ర్లు అలాంటివి మ‌రి. ఇప్ప‌టికే ఎన్నో మోడ‌ల్స్‌ను మార్కెట్లోకి తెచ్చి విజ‌య‌వంతం చేసిన యాపిల్ తాజాగా ఐఫోన్‌ ప‌దో వార్షికోత్స‌వం సంద‌ర్భంగా కొత్త ఫోన్‌ను తేవ‌డానికి రంగం సిద్ధం చేసింది. ఆ మోడ‌లే యాపిల్ 8. ఈ కొత్త మోడ‌ల్‌లోనే ఎ-11 చిప్‌ను ఉప‌యోగిస్తున్న‌ట్లు స‌మాచారం. శ‌క్తివంత‌మైన ఈ చిప్‌తో ఐఫోన్ 8 మ‌రింత శ‌క్తివంతంగా మార‌డం ఖాయ‌మ‌ని మొబైల్ వినియోగ‌దారులు అంటున్నారు. స్నాప్‌డ్రాగ‌న్ 820, 821కు పోటీగా యాపిల్ ఈ చిప్‌ను త‌యారు చేసిన‌ట్లు స‌మాచారం.

త్వ‌ర‌లో భార‌త్‌లో కూడా
ఎ-11 చిప్ ప్ర‌యోగం స‌ఫ‌ల‌మైతే త్వ‌ర‌లో భార‌త్‌లో కూడా దీన్ని ప‌రీక్షించాల‌ని యాపిల్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. భార‌త్‌లో చైనా కంపెనీల హ‌వా ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో యాపిల్ త‌న బేస్‌ను పెంచుకునేందుకు శ‌క్తివంత‌మైన ఈ ఫోన్‌ను రంగంలోకి దింప‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. అన్నిటిక‌న్నా ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే భార‌త్‌లో కూడా ఐ ఫోన్ ప్రొడ‌క్ష‌న్ చేయాల‌ని యాపిల్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. దీనిలో భాగంగానే ఇప్ప‌టికే బెంగ‌ళూరులో ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆగ‌స్టు నాటిక‌ల్లా ఇక్క‌డ ఐఫోన్ల త‌యారీని ప్రారంభించాల‌నేది ఆ సంస్థ ఆలోచ‌న‌. ఈ ఏడాది యాపిల్ ఐఫోన్ 7 ఎస్‌, 7 ఎస్ ప్ల‌స్‌ల‌ను లాంచ్ చేస్తోంది. ఆ త‌ర్వాత ఐఫోన్ 8 మోడ‌ల్‌ను రంగంలోకి దించాల‌ని యాపిల్ ప్ర‌య‌త్నం చేస్తోంది.

జన రంజకమైన వార్తలు