• తాజా వార్తలు

బీఎస్సెన్నెల్ చూస్తోంది... ఫోన్ దొంగిలించినా దొరికిపోతారు

    అన్నిటికీ స్మార్టు ఫోనే ఆధారమైపోయిన ప్రస్తుత తరుణంలో కాస్త అడ్వాన్సడ్ ఫోన్లు  అందరికీ అవసరం అవుతున్నాయి. వాటి ధరలూ ఎక్కువే ఉంటున్నాయి. కానీ, అంత రేటు పెట్టి కొనే ఫోన్లకు భద్రత కరువవుతోంది. మనం పొగొట్టుకున్నా, దొంగలు ఎత్తుకెళ్లినా మళ్లీ ఆ ఫోన్ మనకు దక్కే ఛాన్సే ఉండడం లేదు. యాంటీ థెప్టింగ్ సాఫ్టువేర్లు, ట్రాకింగ్ సిస్టమ్స్ ఎన్నున్నా కూడా అన్నిటినీ మార్చేస్తున్నారు, చివరకు ఐఎంఈఐ నంబరు కూడా చేంజి చేసి వాడేస్తున్నారు. అయితే.. ఇకపై ఇలాంటివి సాగవు. చోరీకి గురైన, పొరపాటున పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లకు పూర్తిగా సర్వీస్ నిలిపేసేలా ప్రయత్నాలు మొదలవడమే అందుకు కారణం.  ఇందుకోసం సెంట్రల్ ఎక్వీప్ మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్(సీఈఐఆర్‌) అనే ఈ కొత్త వ్యవస్థకు తెరతీస్తూ దీనికోసం సాఫ్టువేర్ రూపొందిస్తోంది బీఎస్ ఎన్ ఎల్.

ఆర్నెళ్లలో అందుబాటులోకి..
    దొంగిలించిన సెల్ ఫోన్లలో సిమ్‌ కార్డులు, ఐఎమ్‌ఈఐ సంఖ్యలను మార్చినా పని చేయకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వరంగ టెలికామ్‌ దిగ్గజం ‘బీఎస్‌ఎన్‌ఎల్‌’ పుణేలోని తమ రీసెర్చి కేంద్రంలో ప్రాజెక్టు చేపడుతోంది. ఈ ప్రాజెక్టు ఆర్నెళ్లలోగా ఫలితాలను అందిస్తుందని టెలికామ్‌ వర్గాలు అంటున్నాయి. 

ఏమీటీ  కొత్త వ్యవస్థ..
    సీఈఐఆర్‌ అనే ఈ కొత్త వ్యవస్థ కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉంది బీఎస్సెన్నెల్ టీం. మొబైల్‌ ఆపరేటర్ల ఐఎమ్‌ఈఐ డేటాబేస్‌లకు ఓ కేంద్రీయ వ్యవస్థలా సీఈఐఆర్‌ పని చేస్తుంది. చోరీకి గురైన, పోగొట్టుకున్న ఫోన్ల ఐఎమ్‌ఈఐలను ఇది సేకరిస్తుంది. ఆ తర్వాత సిమ్‌లు మార్చినా నిర్ధారించుకొని.. సదరు ఫోన్లను పని చేయకుండా చేస్తుంది. 

పనికి రాకుంటే దొంగతనం ఎందుకు చేస్తారు?
అంటే దొంగలు ఆ ఫోన్లను ఏమీ చేసుకోలేరన్న మాట. వాటిని డస్ట్ బిన్లో పడేయడం తప్ప వేరే మార్గం లేదు. ఆ మాత్రం దానికి దొంగతనం చేయడం కూడా వేస్టు కాబట్టి దొంగలు ఇక ఫోన్ దొంగతనాలు మానుకుంటారు. ఒకవేళ ఎవరైనా నకిలీ ఐఎమ్‌ఈఐని సృష్టించినా సీఈఐఆర్‌ లో వెంటనే ట్రేస్ అయిపోతుంది. 
 

జన రంజకమైన వార్తలు