పాలు.. మనకు నిత్యావసరం. ఇది లేకుండా మన రోజు మొదలు కాదు. ఐతే ప్రతి రోజూ మనకు అవసరమయ్యే పాలకు మనం నెల వారీ బిల్లు చెల్లిస్తాం. కొంతమంది అప్పటికప్పుడు ప్యాకెట్లు తెచ్చకుంటారు. ఇంకొంతమంది నెలవారీ ఖాతాగా పాలు పోయించుకుంటారు. రెండో కేటగిరికి చెందిన వారే ఎక్కువమంది ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగులు నెలవారీ ఈ పాల బిల్లు చెల్లిస్తుంటారు. కానీ ఈ చెల్లింపులన్నీ సక్రమంగా ఉండవు. ఒకరోజు ప్యాకెట్ వేస్తే ఒకరోజు పడకపోవచ్చు. లేకపోతే మనం కోరుకున్న ప్యాకెట్ కాకుండా ఇంకో ప్యాకెట్ పడొచ్చు. ఒక్కోసారి అదనంగా పాలు కావాల్సి ఉన్నా దొరకని పరిస్థితి. ఇలా రకరకలా కారణాలతో పాల బిల్లు చెల్లింపులు కూడా కాస్త గందరగోళంగానే ఉంటాయి. ఇలాంటి ఇబ్బందుల నుంచి పుట్టిందే హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఈజీ మిల్క్ సంస్థ. వినియోగదారులను పాల వ్యాపారులకు అనుసంధానం చేస్తూ సాగడం ఈ ఈజీమిల్క్ స్టార్టప్ ప్రత్యేకత. ఈజీ మిల్క్ ద్వారా వినియోగదారులు తమ పాల బిల్లులను ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేసుకోవచ్చు. దీని వల్ల వినియోగదారులతో పాటు పాల వ్యాపారులకు కూడా ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే పాల వ్యాపారులు నెలవారీ డబ్బుల కోసం వినియోగదారుల ఇంటి దగ్గరకు వెళితే.. వారు సమయానికి లేకపోవడం లాంటి ఇబ్బందుల నుంచి ఈజీ మిల్క్ బయటపడేస్తుంది. నెల కాగానే పాల బిల్లును ఈజీ మిల్క్ యాప్ ద్వారా వినియోగదారులు కట్టేయచ్చు. పాల వ్యాపారులకు కూడా బిల్లుల కోసం ఇంటింటికి తిరిగే బాధ తప్పుతుంది. అంతేకాక డబ్బు లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు. అంతేకాదు వినియోగదారులు నెల అయ్యాక కానీ పేమెంట్ చేయరు. ఒక్కోసారి అదనంగా కూడా పాలు అడుగుతుంటారు. ఈ నేపథ్యంలో పాల వ్యాపారుల దగ్గర అదనంగా బయట నుంచి పాలు తీసుకు రావడానికి డబ్బులు సరిపోకపోవచ్చు. ఈ ఇబ్బంది నుంచి పాల వ్యాపారులను బయటపడేయడానికి, వినియోగదారులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు లభ్యమయ్యేలా చేయడానికి ఈజీ మిల్క్ ఇస్తున్న మరో ఆప్షన్ షార్ట్ టెర్మ్ లోన్లు. పాల వ్యాపారులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లోన్లు ఇచ్చి వారి వ్యాపారానికి సహాయం చేయడమే కాక, వినియోగదారుల అవసరాలు తీరేలా చేస్తోందీ ఈ అంకుర సంస్థ. ఇప్పుడిప్పుడే పాల ఏజెంట్లు ఈ సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నారు. 120 మంది ఏజెంట్లు ఈజీమిల్క్ ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా రూ.50 వేల వరకు పాల వ్యాపారాలకు మనీ లెండింగ్ చేసినట్లు ఈజీమిల్క్ సంస్థ తెలిపింది. |