బౌద్ధ భిక్షవు ఏమిటి రోబో ఏమిటి; ఈ రెండింటికి సంబంధం ఏమిటీ అనుకుంటున్నారా! కానీ బౌద్ధ భిక్షవులు కూడా టెక్నాలజీపై ఆధారపడుతున్నారు. ఒక చైనా బౌద్ధ ఆలయంలో ప్రత్యేకమైన రోబో భిక్షవును తయారు చేశారు. ఈ రోబో బౌద్ధ భిక్షవు ద్వారా బుద్ధిజాన్ని ప్రచారం చేయాలనే తలంపుతో ఎంతో ఖర్చు పెట్టి ఈ రోబోను తయారు చేశారు. బీజింగ్ నగర శివార్లలో ఉన్న ఒక బౌద్ధ ఆలయంలో ఈ రోబో భిక్షవు అందర్ని ఆకట్టుకుంటున్నాడు. బౌద్ధ మంత్రాలు చదవడం, మాటలను బట్టి పనులు చేయడం, చిన్న చిన్న మాటలు మాట్లాడటం ఈ రోబో చేస్తోంది. జియానర్ అని పేరు పెట్టిన ఈ రోబో అందర్ని విశేషంగా ఆకర్షిస్తోంది. నున్నని గుండుతో బౌద్ధ బిక్షువు ఆకారాన్నిపోలిన ఈ రోబో రెండు అడుగుల పొడవు ఉంటుంది. ఇది ఛాతిపై ఒక టచ్ స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. బుద్ధిజం గురించి, నిత్య జీవనం గురించి ఇది కనీసం 20 సరళమైన ప్రశ్నలకు జవాబులు చెబుతుంది. ఈ ప్రశ్నలు రోబో ఛాతి మీద ఉండే ఎలక్ర్టానిక్ తెరపై ఉంటాయి. దీనికి కాళ్ల దగ్గర చక్రాల ద్వారా ఏడు రకాల కదలికలు కూడా ఇది చేయగలదు. చైనాలో బౌద్ధ మతాన్ని మరింత వ్యాప్తి చేయడానికి ఈ రోబో బౌద్ధ బిక్షువు ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నట్లు ఈ రోబోను తయారు చేసిన జియాన్‌ఫాన్ అన్నాడు. సైన్స్, బుద్ధిజం ఈ రెండూ పరస్పర విరుద్ధమైనవి కావని... ఈ రెండు కలిస్తే మరింత మంచి జరుగుతుందని జియాన్‌ఫాన్ అంటున్నాడు. మన వేగవంతమైన జీవితంలో మతం అనేది మళ్లీ వెనక్కి వెళిపోతుందని, ఇది మనుషులకు ప్రధాన అంశంగా ఉండట్లేదనేది ఆయన ఆవేదన. ఈ నేపథ్యంలో తాను తయారు చేసి వినూత్న రోబో కాస్తయినా మతాన్ని దేశం నలుమూలలా తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నట్లు జియాన్‌ఫాన్ తెలిపాడు. స్మార్టుఫోన్లు సమాజంపై ఆధిపత్యం చూపుతున్న నేపథ్యంలో ప్రజలకు మతం గురించి ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది బౌద్ధ బిక్షువుల మాట. ఈ బౌద్ధ రోబోను చైనాలోని కొన్ని టాప్ యూనివర్సిటీల నుంచి వచ్చిన నిపుణులతో పాటు ఒక టెక్నాలజీ సంస్థ సహకారంతో ఈ రోబోను తయారు చేశారు. ఇప్పటికే ఈ రోబో చైనాలోని అన్ని ప్రదర్శనశాలలను చుట్టి వచ్చింది. 2013లో తాను తయారు చేసిన జియానర్ కార్టున్ బొమ్మ నుంచి స్ఫూర్తి పొందిన జియాన్‌ఫాన్ మళ్లీ అదే పేరుతో రోబో బౌద్ధ బిక్షువును రూపొందించాడు. |