జియో యూజర్లలో చాలామందికి నిరాశ ఎదురవుతోంది. ఆన్‌లైన్ ద్వారా కొత్త జియ్ ప్రైమ్ మెంబర్ షిప్ పొందడం అంత సులభం కావడం లేదట. సాంకేతిక సమస్యల కారణంగా ఆన్ లైన్లో ఇది వీలవడం లేదని చెబుతున్నారు. దీనిపై స్పందించిన జియో యాజమాన్యం ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలుపుతూ.. త్వరలోనే మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది. మరికొందరు జియో యూజర్లు ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించినప్పటికీ, తమకు ప్రైమ్ యాక్టివేట్ కాలేదని చెబుతున్నారు.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని గతంలో ప్రకటించిన విధంగానే జియో ప్రైమ్ మెంబర్‌షిప్ కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. రూ.99 తో ప్రైమ్ మెంబర్‌షిప్ పొందితే పలు సదుపాయాలు పొందవచ్చని రిలయన్స్ అధినేత చేసిన ప్రకటనతో జియో యూజర్లు ఇప్పుడు ఆ పనిలోనే పడ్డారు. అందుకోసం ఆన్‌లైన్‌లో జియో యాప్ ద్వారా గానీ, జియో స్టోర్‌కు గానీ వెళ్లి ప్రైమ్ సభ్యులుగా నమోదు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వినియోగదారులు సోషల్ మీడియాలో గొంతెత్తుతున్నారు.
మరోవైపు రిలయన్స్ జియో ప్రైమ్ పై ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జియో చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. జియో తీరుతో భారత టెలీకాం పరిశ్రమ ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో స్పెక్ట్రం రేట్లు కూడా విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక‌్తం చేశారు. జియో ప్రైమ్ పేరిట కొత్తగా టారిఫ్ ప్లాన్లు ప్రకటించడం దౌర్జన్యమని, భరించలేని చర్య అని అన్నారు. మొత్తానికి జియో అటు వినియోగదారులను, పోటీదారులను కూడా చికాకు పెడుతోందన్నమాట.