అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు దేశమంతా ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే పంజాబ్, గోవాల్లో పోలింగ్ పూర్తికాగా ఉత్తర ప్రదేశ్ లోనూ కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ పూర్తయింది. మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తవడానికి మరో 20 రోజులకుపైగా సమయం ఉంది. మార్చి 11న ఫలితాలు వస్తే కానీ ఎవరు విజేతలో.. ఎవరు పరాజితులో చెప్పలేని పరిస్థితి. మార్చి 11 వరకు అందరి తలరాతలను తనలో దాచుకుని అభ్యర్థుల దృష్టిలో వరాలిచ్చే దేవతలాంటి ఈవీఎంను వారు మొక్కుకోవాల్సిందే. లక్షలాది ఓట్ల లెక్కలను తనలో ఇముడ్చుకుని ఎవరికెన్ని వచ్చాయో గుట్టుగా తనలో దాచిపెట్టుకున్న ఈవీఎం సాంకేతికత సులభమైనదే అయినా భారత పాలన వ్యవస్థకు ఆయువు పట్టులాంటిది. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు నుంచి దేశానికి ప్రధాని వరకు ఎవరినైనా ప్రాథమికంగా నిర్ణయించేది అదే. సామాన్యుడిని విజేతను చేయాలన్నా.. రారాజులను పరాజితులను చేయాలన్నా దానికే సాధ్యం. మరి ఈవీఎం సంగతేంటి.. అదెలా పనిచేస్తుందో.. అందులో టెక్నాలజీ ఏంటో ఈ ఎన్నికల సమయాన ఒకసారి మనమూ తెలుసుకుంటే బాగుంటుంది కదా..
ఎన్నికలంటే ఓ పెద్ద ప్రహసనం. క్యాండిడేట్లు ఎంత మంది ఉన్నారో లెక్క చూడాలి. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులకు వారి గుర్తు కేటాయించాలి. స్వతంత్రులకు గుర్తులు కేటాయించాలి. అభ్యర్థుల పేర్లు, వారి గుర్తులతో కలిపి బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేయించాలి. వాటిని పోలింగ్ స్టేషన్లకు పంపించాలి. ఓటర్లు వాటిపై ఓటేశాక వాటిని బ్యాలెట్ పెట్టెల్లో వేస్తారు. ఈ బ్యాలెట్ పెట్టెలన్నింటినీ స్ట్రాంగ్ రూంలో దాచి కౌంటి్ంగ్ రోజున అక్కడికి చేర్చాలి. తర్వాత బాక్సులన్నీ ఓపెన్ చేసి ఓట్లన్నీ కలపాలి. వీటి నుంచి ఏ అభ్యర్థికి పడిన ఓట్లెన్నో విడదీయాలి. ఈ ఓట్లన్నీ లెక్కించి ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న క్యాండేట్‌ను విన్నర్ గా ప్రకటించాలి. ఇదంతా 2004 ఎన్నికల ముందు వరకు ఉన్న పరిస్థితి. ఆ తర్వాత టెక్నాలజీ డెవలప్ అయింది. 70, 80 కోట్ల ఓటర్లు పాల్గొనే ఎలక్షన్స్ కోసం హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ సంస్థ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లు తయారు చేసింది. దీంతో ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీ అయిపోయింది. లక్షల కొద్దీ బాలెట్ పేపర్లకు బదులు ప్రతి బూత్‌కీ రెండో మూడో ఈవీఎంలు పంపిస్తే చాలు.. ఓటర్లు దానిమీద ఉండే గుర్తును ప్రెస్ చేసి నచ్చిన అభ్యర్థికి ఓటేస్తారు. ఓటింగ్ అయిపోయాక సీల్ వేసేస్తారు. కౌంటింగ్ రోజున ఓపెన్ చేసి ఏ క్యాండేట్‌కు ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్కపెడ్తారు.
ఈవీఎం ఎలా పని చేస్తుంది?
ఇండియాలో మనం వాడే ఈవీఎంలో రెండు కాంపోనెంట్లు ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్ ను బ్యాలెటింగ్ యూనిట్ అంటారు. దీనిలోనే అభ్యర్థుల గుర్తులు ఉంటాయి. గుర్తును ప్రెస్ చేసి ఓటర్ ఓటు వేస్తారు.
రెండో కాంపోనెంట్‌ను కంట్రోల్ యూనిట్ అంటారు. పోలింగ్ బూత్‌లో ఉండే పోలింగ్ ఆఫీసర్ సూపర్ వైజ్ చేయడానికి ఈ యూనిట్ పనికొస్తుంది. ఈ రెండు యూనిట్లు 5 మీటర్ల పొడవున్న కేబుల్‌తో కలిపి ఉంటాయి.
ప్రతి ఈవీఎంలో 64 మంది క్యాండేట్ల పేర్లను రికార్డ్ చేయవచ్చు. అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులుంటే మరో ఈవీఎం పెట్టి 65వ నెంబర్ నుంచి అందులో ఫీడ్ చేయాలి. క్యాండేట్లు 64 కంటే ఎక్కువ ఉంటే ఈవీఎంలు డబుల్ సంఖ్యలో కావాలన్నమాట. 64 మంది పేర్లను కూడా నాలుగు బ్యాలెటింగ్ యూనిట్లలో (ఒక్కోదానిలో 16 చొప్పున) వరుసగా పెడతారు.
ఒక్కో ఈవీఎం లో మాగ్జిమమ్ 3,840 ఓట్లు మాత్రమే స్టోర్ చేయగలరు. ఓటర్ల సంఖ్య అంతకంటే పెరిగితే మరో ఈవీఎం పెట్టాలి.
ఉపయోగాలు
* బోగస్ ఓట్లను అరికట్టొచ్చు
పోలింగ్ ఆఫీసర్ కంట్రోల్ యూనిట్‌లో ఉన్న బ్యాలెటింగ్ బటన్ నొక్కి ఓటర్‌కు ఓటేసేందుకు ఇస్తారు.తర్వాత ఓటర్ నచ్చిన గుర్తుపై ఓటేస్తాడు. ఓటర్ ఏదైనా గుర్తుపైన ఓటేయగానే అది వెంటనే లాకయిపోతుంది. మరోసారి ఓటేయడానికి అతనికి ఛాన్స్ ఉండదు. తర్వాత అతను ఓటేసినా దాన్ని సిస్టం తీసుకోదు.
* ఫాస్ట్ అండ్ యాక్యురేట్
కౌంటింగ్ రోజున ఈవీఎం ఓపెన్ చేసి ఏ క్యాండేట్‌కు ఎన్ని ఓట్లు పడ్డాయో ఓ గంటలో లెక్క పెట్టేస్తున్నారు. మొత్తం అన్నిఈ వీఎంలల్లో డిటైల్సన్నీ తీసుకుని నాలుగైదు గంటల్లోనే విన్నర్‌ను డిక్లేర్ చేసేస్తున్నారు. గతంలో కౌంటింగ్ చేసి విజేతను ప్రకటించాలంటే రోజు, రోజున్నర పట్టేది.
* ఈవీఎం 6 వోల్ట్స్ బ్యాటరీపై పని చేస్తుంది. అందువల్ల దీనికి బయటి నుంచి ఎలాంటి పవర్ అవసరం లేదు. కరెంట్ ఫెసిలిటీ లేని ఇంటీరియర్ ప్లేసెస్‌లో కూడా ఓటింగ్‌కు దీనివల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది.
* ఈవీఎం ధర ఎక్కువైనా తర్వాత ఖర్చు చాలా తగ్గుతుంది. లక్షల కొద్దీ బాలెట్ పేపర్ల ప్రింటింగ్, వాటిని బండిల్స్ కట్టడం, వాటికోసం బాలెట్ బాక్స్‌ల తయారీ, వీటన్నింటినీ ట్రాన్స్ పోర్టింగ్ అయ్యే ఖర్చు తగ్గుతుంది. .
* ఈవీఎం దాదాపు 15 సంవత్సరాలు పని చేస్తుంది. అందువల్ల దాని కొనుగోలు పెట్టే ఖర్చు మొదట ఎక్కువగా కనిపించినా 15 ఏళ్లపాటు బాలెట్ పేపర్ల ముద్రణ, ట్రాన్స్ పోర్ట్‌కు అయ్యే ఖర్చుతో పోల్చితే చాలా మనీ సేవ్ అయినట్టే.
ఎంత వరకు సేఫ్?
ఈవీఎం ఇంటర్నెట్‌కు గానీ వైర్‌లెస్‌గా గానీ దేనికీ కనెక్ట్ కాదు. అందువల్ల హ్యాక్ అవుతుందన్న భయం ఉండదు.
ఎలక్షన్ కమిషన్ తప్ప దీన్ని ఎవరూ యాక్సెస్ చేయలేరు కాబట్టి ఇది ట్యాంపర్ అవుతుందన్న సందేహం అక్కర్లేదు.
అయితే ఏ ఈవీఎంలో ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో తెలుస్తుంది కాబట్టి విన్నర్ లేదా ఓడిపోయిన వ్యక్తికి ఫలానాచోట తమకు ఓట్లు పడలేదని తెలిసే అవకాశం ఉంది.