పిల్లలు బయట ఆడుకుంటున్నారంటే ఎంత దగ్గర్లో ఉన్నా ఎందుకో భయం... వాళ్లు ఎక్కడి వెళతారో ఏం చేస్తున్నారో అన్ని వేళలా చూసే అవకాశం ఉండదు. పొరపాటున వాళ్లు ఆడుకుంటూ తప్పిపోతే ఇక తల్లిదండ్రుల కంగారు అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో పిల్లలు ఎక్కడ ఉన్నారో మనకు సులభంగా తెలిపేలా... వారికి ఏమైనా ఇబ్బంది ఎదురైతే మనం తెలుసుకునేలా ప్రముఖ సాంకేతిక వస్తువుల తయారీ సంస్థ ఎవోక్సోజ్ ఒక కొత్త పరికరాన్ని తయారు చేసింది. ఈ పరికరం మన పిల్లలకు మాత్రమే కాదు ఇంటికి, మన పెంపుడు జంతుల భద్రతకు కూడా ఉపయోగపడుతుందట. ఈ ఎలక్ర్టానిక్ పరికరం ఒక యాప్ ద్వారా పని చేసేలా రూపొందించారు. ఈ యాప్‌ను మన స్మార్టు ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే ఈ పరికరం ఆ యాప్‌కు అనుసంధానం అయి పని చేయడం ప్రారంభిస్తుంది. ఏదైనా భద్రతా పరమైన సమస్యలు తలెత్తితే ఈ యాప్ మన ఫోన్‌కు వెంటనే ఎలర్ట్ పంపిస్తుంది. దీని వల్ల ప్రమాదాన్ని ఊహించి జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. సన్నని ఈ వాటర్‌ఫ్రూప్ పరికరాన్ని మీ పిల్లల స్కూల్ బ్యాగుకి లేకపోతే వాళ్ల దుస్తులకు అమర్చొచ్చు. అదే పెంపుడు జంతులైతే వాటి మెడకు రింగ్‌లా చుట్టొచ్చు. ఇంటికి అయితే మీ గుమ్మం దగ్గరో లేక తాళం దగ్గరో పెట్టొచ్చు. దీనిలో ఉండే సాంకేతికత వల్ల ఏదైనా ప్రమాదం ఎదురైతే దీన్ని ఉపయోగిస్తున్న వాళ్లు ఎక్కడ ఉన్నారో నేవిగేషన్ ద్వారా అడ్రెస్, సమయంతో సహా యజమాని ఫోన్‌కు మెసేజ్ వెళుతుంది. అంతేకాదు ఇది సెల్ఫీలు కూడా తీసి వాటిని కూడా యజమాని స్మార్టుఫోన్‌కు పంపుతుంది. ఈ భద్రత పరికరాన్ని అన్ని వయసుల విభాగాల వారికి ఉపయోగించొచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో కంగారు పడే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడనుంది. ఇటీవల విడుదలైన ఈ పరికరానికి ఆదరణ బాగా లభిస్తోందని ఆ సంస్థ వెల్లడించింది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఈ పరికరం లభ్యమవుతుంది. ఆన్ లైన్ మార్కెట్లో ఈ పరికరాన్ని రూ.1399 ధరకు అమ్ముతున్నారు. |