నోకియా 3310.. ఓ 15 ఏళ్ల కిందట మొబైల్ లవర్స్ కలల సెల్‌ఫోన్ అది. ఆ మోడల్‌కు అప్పట్లో ఎంత క్రేజ్ అంటే ఇప్పుడు ఐ ఫోన్ 7ఎస్ ప్లస్ చేతిలో ఉంటే ఎంత యూనిక్‌గా ఫీలవుతున్నామో దానికంటే ఎక్కువగా 3310 యూజర్‌కి గుర్తింపు ఉండేది. నోకియాకు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన ఫోన్లలో 3310 కూడా ఒకటి. తర్వాత ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లు వచ్చేయడం.. నోకియా ఈ రేసులో వెనకబడిపోడం చకచకా జరిగిపోయాయి. అందరూ ఆండ్రాయిడ్‌ను కోరుకుంటుంటే నోకియా ఆ దారిలో వెళ్లలేదు. తర్వాత కంపెనీ మైక్రోసాఫ్ట్ చేతిలోకి వెళ్లింది. వాళ్లు విండోస్ ఫోన్ తయారుచేశారు. నోకియా బ్రాండ్ ఇమేజ్‌తో మార్కెట్లలోకి వచ్చినా కస్టమర్లను ఇంప్రెస్ చేయలేకపోయింది. విండోస్ ఓఎస్.. ఆండ్రాయిడ్ అంత యూజర్ ఫ్రెండ్లీ కాకపోవడం నోకియాను సెల్‌ఫోన్ మార్కెట్‌లో వెనకడుగు వేసేలా చేసింది. ఇప్పటికీ స్టాండర్డ్ ఫీచర్ ఫోన్ కొనాలనుకునేవారికి నోకియానే ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్ అనడంలో అతిశయోక్తి లేదు. అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్, లో మెయింటనెన్స్ వంటివి నోకియాకు ప్లస్ పాయింట్లు. వీటినే నమ్ముకుని నోకియా మళ్లీ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. తనకెంతో అచ్చివచ్చిన 3310 మోడల్‌ను సరికొత్తగా లాంచ్ చేసింది. బార్సిలోనాలో ఇటీవల జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో దీన్ని లాంచ్ చేసింది. దీన్ని చూసినవారంతా వావ్ అన్నారు. కానీ ఎంత వరకూ దీన్ని మళ్లీ కొంటారన్నది వేచి చూడాల్సిందే..
నోకియా 3310 రీ ఎంట్రీతో దీని స్థాయిలోనే ఫీచర్ ఫోన్లలో సూపర్ హిట్టయిన కొన్ని మోడళ్లను రీ లాంచ్ చేయాలని కంపెనీలు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఫీచర్ ఫోన్లలో ఒకప్పుడు బాగా పాపులరయిన కొన్ని మోడళ్లను చూద్దాం. హార్డ్ వేర్‌ను కొద్దిగా రిఫ్రెష్ చేసి, సాఫ్ట్‌వేర్‌ను కాస్త డిబగ్గింగ్ చేస్తే ఇవి స్మార్ట్‌ఫోన్ల స్థాయిలో కాకపోయినా కస్టమర్ సాటిసిఫైడ్ పెర్‌ఫార్మెన్స్ ఇవ్వగలవని అంచనా.
మోటో రేజర్ వీ3
మోటోరోలా కంపెనీ నుంచి వచ్చిన ఈ ఫోన్ వన్ ఆఫ్ బెస్ట్ సెల్లింగ్ సెల్‌ఫోన్ . ఫ్లిప్ టు ఓపెన్ కామ్‌షెల్, మెటాలిక్ బాడీ తో చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది ఈ మోడల్. దీని ఫ్లిప్ కవర్‌పైనే ఉండే కెమెరా అదనపు ఆకర్షణ. రెండు డిస్‌ప్లేలు, మెటాలిక్ కీబోర్డ్‌తో డీసెంట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చేది. దీనిలో ఉన్న లాప్సెస్‌ను కవర్ చేస్తూ వీ3ఐ, రేజర్ 2 మోడళ్లను కూడా తర్వాత మోటో లాంచ్ చేసింది.
ఎల్‌జీ చాక్లెట్ కేజీ800
ఓ దశాబ్ద కాలం క్రితం ఎల్‌జీ మంచి స్టైలిష్ మోడల్స్ సెల్‌ఫోన్లను తీసుకొచ్చేది. వీటిలో ఎల్‌జీ చాక్లెట్ కేజీ 800 బాగా పాపులర్ అయింది. జెట్ బ్లాక్ లుక్‌తో బాగా ఆకట్టుకున్న ఈ ఫోన్ మంచి మ్యూజిక్ ఎడిషన్. 2007లోనే దీనికి స్టీరియో బ్లూ టూత్ సపోర్ట్ ఉండడం విశేషం. స్లైడ్ అవుట్ కీ బోర్డ్ తో స్టైలిష్ గా కనిపించే ఈ చాక్లెట్ మంచి ఫెర్‌ఫార్మర్ కూడా. మల్టీమీడియాను సపోర్ట్ చేస్తుంది.
ఐఎన్ క్యూ1
2008లోనే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు నడిచిన సెల్‌ఫోన్ ఇది. కంపాక్ట్ స్లైడర్ ఫోన్ అయిన ఐఎన్‌క్యూ1 ఫేస్‌బుక్, స్కైప్, విండోస్ వంటి వాటితో ఇంటిగ్రేట్ కాగలడం దీనిలో ప్రత్యేకత. స్మూత్ ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చే ఈ సెల్‌ఫోన్ మీ ఫోన్‌కు సోషల్‌నెట్‌వర్క్ ఎకౌంట్ల మధ్య సింకింగ్‌లో కూడా బాగా పని చేసేది.
సోనీ ఎరిక్సన్ వాక్‌మెన్ డబ్ల్యూ 910 ఐ
ఇప్పటి సోనీ అప్పట్లో సోనీ ఎరిక్సన్ గా మొబైల్ మార్కెట్‌లో ఉండేది. మ్యూజిక్ లవర్స్ ఇష్టపడే సెల్‌ఫోన్ అంటే అప్పట్లో సోనీ ఎరిక్సనే. ఇక వాక్‌మన్ సిరీస్ అయితే మరీనూ. కంపాక్ట్ మోడల్‌లో ఉండే ఈ మోడల్ అప్పట్లో మ్యూజిక్ లవర్స్‌ను ఓ ఊపు ఊపేసింది. కెమెరా పనితీరు బాగోకపోయినా దీని మ్యూజిక్ క్వాలిటీ, స్టైలిష్ లుక్‌తో చాలా కాలం మార్కెట్లో నడిచింది. ఫోన్‌ను షేక్ చేస్తే చాలు మ్యూజిక్ ట్రాక్ మారడం వాక్‌మన్ సిరీస్ లో స్పెషల్ ఎట్రాక్షన్.
మోటో పెబెల్ యూ6
మోటో రేజర్ వీ 3లాగే ఫ్లిఫ్ ఓపెన్ ఫోన్ ఇది. అయితే రౌండెడ్ స్మూత్ ఎడ్జెస్‌తో నున్నటి గులకరాయిలా కనిపిస్తుంది. ఆ లుక్కే దీని ప్రత్యేకం. ఫోన్‌ను ఓపెన్ చేసినప్పుడు కూడా 4.5 అంగుళాల ఫోనంత ఉండదు.
శ్యాంసంగ్ బీ5310 కార్బీ ప్రో
ఐఫోన్ ఇంకా మొబైల్ యూజర్లను పూర్తిగా చేరని రోజుల్లో.. ఆండ్రాయిడ్ ఫోన్లు మార్కెట్లోకి రావడానికి అడుగులు పడుతున్న తరుణంలో శ్యాంసంగ్ కార్బీ రేంజ్ ఫోన్లతో మార్కెట్‌లో హల్‌చల్ చేసింది. ఫీచర్ ఫోనే అయినప్పటికీ క్వర్టీ కీ పాడ్‌తో మెసేజింగ్ మంచి ఎక్స్‌పీరియన్స్‌గా మొబైల్ లవర్స్ దగ్గర గుర్తింపు పొందింది. కాల్ చేయాలన్నా రిసీవ్ చేసుకోవాలన్నా స్లైడర్‌ను జరపడం, టైప్ చేయడానికి క్వర్టీ కీపాడ్, మంచి బ్యాటరీ లైఫ్ దీని ప్రత్యేకతలు.
సోనీ ఎరిక్సన్ కె850 ఐ
సోనీ సైబర్ షాట్ సిరీస్‌తో వచ్చిన సెల్‌ఫోన్లు ఇవి. ఫోన్ కెమెరాలతో డీఎస్ఎల్ఆర్ స్థాయి ఫొటోలు తీయగలగడం దీని ప్రత్యేకత. 5 మెగాపిక్సెల్ కెమెరాతో సీఎంఓఎస్ సెన్సర్‌తో సెల్‌ఫోన్లలో అద్భుతమైన ఫొటోలు వచ్చేవి. కామ్ కార్డర్ , కెమెరాకు డెడికేటెడ్ బటన్స్, షూటింగ్ కోసం బోల్డన్ని ఆప్షన్లు ఈ సిరీస్‌లో వచ్చిన ఫోన్ల స్పెషాలిటీ.
స్మార్ట్ ఫోన్‌ను వదలగలరా?
ఈ ఫోన్లన్లీ బాగున్న ఫీచర్లన్నీ చెప్పుకున్నాం. వాటిలోనూ డిస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. మొబైల్ కంపెనీల మధ్య ఇంత కాంపిటీషన్ లేదు కాబట్టి రేట్ ఎక్కువగా ఉన్నా అప్పట్లో నడిచిపోయింది. ఇప్పుడు ఐదారువేలకే స్మార్ట్ ఫోన్లు వచ్చేస్తున్న నేపథ్యంలో అంతకంటే ఎక్కువ ఖరీదు పెట్టి ఈ ఫీచర్ ఫోన్లు కొనేవారు ఉన్నారా అంటే సందేహమే. అ దీకాక స్మార్ట్‌ఫోన్లతో బాగా కనెక్టయిపోయిన జనం వాటిని వదలడం చాలా కష్టం. రేటు ఎక్కువైనా ఎప్పటికప్పుడు హై ఎండ్ ఆప్షన్లకు వెళుతున్న జనం వీటిని తిరిగి చేతపట్టలేరు. అయితే మొబైల్‌ను బాగా వినియోగించే బిజినెస్ పర్సన్స్ వంటివారు సెకండ్ ఆప్షన్‌గా ఫీచర్ ఫోన్ వంటివి ఎంచుకోవాలనుకుంటే ఇలాంటి వాటివైపు చూడొచ్చు. ఇలాంటి వారికోసమే కంపెనీలు తమ పాత ఫీచర్ ఫోన్లను రీ లాంచ్ చేస్తాయా అంటే చూడాలి మరి..