భారత టెలికాం రంగం లో సుమారు పదికి పైగా ప్రముఖ ఆపరేటర్ లు ఉన్నప్పటికీ అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ జనాదరణ పొందింది మాత్రం రిలయన్స్ జియో నే. అసలు ఆ మాటకొస్తే జియో యొక్క ప్రవేశమే అత్యంత వైభవంగా జరిగింది. దీని సర్వీస్ లకు సంబందించి కంపెనీ కూడా ఊహించని స్పందన వినియోగదారులలో వచ్చింది. ఈ స్పందన కేవలం వినియోగదారులకే పరిమితం కాలేదు. మిగతా టెలికాం ఆపరేటర్ లు కూడా దీని దెబ్బకు తమ ఆలోచనా ధోరణిని మార్చుకోక తప్పలేదు. అప్పటివరకూ తమ సౌలభ్యాన్ని బట్టి టారిఫ్ ప్లాన్ లను ప్రకటిస్తూ వస్తున్న ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా లాంటి ఆపరేటర్ లు వినియోగదారుల అవసరాన్ని బట్టి టారిఫ్ లను ప్రకటించడం మొదలుపెట్టాయి. ఈ విషయం లో క్రెడిట్ అంతా జియో కే దక్కుతుంది. అంటే టెలికాం ఆపరేటర్ లు వినియోగదారుని చూసే దృక్పథాన్ని జియో సమూలంగా మార్చివేసిందన్నమాట. అయితే ఇదంతా ప్రస్తుతం అయినప్పటికీ గతం. ఎందుకంటే జియో విషయం లో ప్రస్తుతం అనదగ్గ మరొక సంచలనం ఇప్పుడు భారత టెలికాం రంగం లో సంచలనాలు సృష్టిస్తుంది. అదే రూ 999/- ల విలువైన ఫీచర్ ఫోన్. అవును. వెయ్యి రూపాయల ధరలోనే ఈ ఫోన్ ను అందుబాటులోనికి తెస్తున్నట్లు ఇప్పటికే జియో వర్గాలు అనధికారికంగా ప్రకటించేసాయి. ఇక ఇది లాంచ్ అవడమే తరువాయి. ఈ నేపథ్యం లో అసలు ఈ ఫోన్ ఎలా ఉండనుంది? దీని ప్రత్యేకతలు ఏమిటి? ప్రత్యేకించి భారత టెలికాం రంగం పై దీని ప్రభావం ఎలా ఉండనుంది? అనే అంశంపై ఒక సమగ్ర విశ్లేషణ ఈ వ్యాసం.
సంచలనాలకు కేంద్రం అయిన జియో రూ 1500/- లు కంటే తక్కువ ధర లో లభించే స్మార్ట్ ఫోన్ ను అందించి మరొక సంచలనం సృష్టించనుంది. దీని ధర రూ 999/- లు ఉండవచ్చు. ఈ ఫోన్ కి సంబందించిన డిజైన్ ఒకటి ఇంటర్ నెట్ లో లీక్ అయ్యి ప్రకంపనలు సృష్టిస్తుంది.ఇది స్మార్ట్ ఫోన్ డిజైన్ తో ఉన్న ఫీచర్ ఫోన్ అని అర్థం అవుతుంది. అయితే ఇందులో ఉండే ఆపరేటింగ్ సిస్టం మాత్రం ఆండ్రాయిడ్ కాదు. మరి ఇందులో ఉండే OS ఏది అనే అంశం మాత్రం ఇంకా రహస్యం గానే ఉంది. ఇంకా దీని డిజైన్ గురించి చెప్పుకోవాలి అంటే దీనిపై జియో యొక్క ఎక్స్ క్లూజివ్ కాంటెంట్ కు సంబందించి నాలుగు బటన్ లు ఉన్నాయి. ఇవి మై జియో, జియో టీవీ, జియో సినిమా, మరియు జియో మ్యూజిక్ ల ఫంక్షన్ లకు సంబందించినవి. ఇవి కేవలం రిలయన్స్ జియో 4 జి సిమ్ కార్డు లను మాత్రమే యాక్సెస్ చేస్తాయని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాయిస్ కాల్ లకోసం జియో కు VoLTE అవసరం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇంతవరకూ ఏ విధమైన సమాచారం తెలిసిరాలేదు.
టెలికాం రంగాన్ని ఇది ఎలా మార్చనుంది?
అసలు ఇది స్మార్ట్ ఫోన్ నా లేకా ఫీచర్ ఫోనా అనే విషయం లో కొంత సందిగ్ధత నెలకొని ఉన్నప్పటికీ దాదాపు ఇది ఫీచర్ ఫోన్ అని తేలిపోయింది. ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్ ఫీచర్ లతో ఫీచర్ ఫోన్ ను జియో తీసుకురావడానికి కారణం ఏమిటి? అని విశ్లేషిస్తే అనేక విషయాలు మనకు అవగతం అవుతాయి. ఇండియా లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ కంటే ఫీచర్ ఫోన్ మార్కెట్ నే ఎక్కువ. గణాంకాలు దీనిని స్పష్టo చేస్తున్నాయి. నవంబర్ 2016 వరకూ ఫీచర్ ఫోన్ ల సేల్స్ 25 మిలియన్ లు ఉంటే స్మార్ట్ ఫోన్ ల సేల్స్ కేవలం 19 మిలియన్ లు మాత్రమే ఉన్నాయి. అంటే వినియోగదారులు ఎక్కువశాతం ఫీచర్ ఫోన్ ల వైపే మొగ్గు చూపుతున్నారని అర్థం అయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. దేశం లో అందరికీ స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించే పరిజ్ఞానం ఉండదు. దేశం లో నిరక్షరాస్యత శాతం కూడా ఎక్కువే. దానికి తోడు నెట్ వర్క్ సమస్య లు ఉండనే ఉన్నాయి. దేశం లోని అనేక ప్రాంతాలకు 2 జి నెట్ వర్క్ కూడా సరిగ్గా ఉండదు. ఇక ఈ పరిస్థితులలో 3 జి మరియు 4 జి అంటే ఎలా? ఇన్ని కారణాల వలననే ఎక్కువమంది వినియోగదారులు ఫీచర్ ఫోన్ లను అంటిపెట్టుకుని ఉంటున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొంతమంది టాప్ క్లాస్ ప్రజలు అంటే ఉన్నత స్థాయి వర్గాల వారు కూడా వాయిస్ కాల్ లకోసం ఫీచర్ ఫోన్ లనే వాడుతున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. మరి ఈ ఫీచర్ ఫోన్ లలో ఉండే సిమ్ లు ఏవి? ఏమున్నాయి? ఎయిర్ టెల్, వోడాఫోన్ లేక ఐడియా. సరిగ్గా ఇదే విషయాన్ని పట్టుకుంది జియో. ఫీచర్ ఫోన్ లను ఉపయోగిస్తున్న వినియోగదారులందరినీ తమ వైపు తిప్పుకోవాలి అంటే ఫీచర్ ఫోన్ లను ప్రవేశపెట్టడమే మార్గం అని జియో భావించింది. ఫీచర్ ఫోన్ లలో ఉండే మామూలు ఫీచర్ లతో పాటు ఫేస్ బుక్, వాట్స్ అప్ మరియు ఇంటర్ నెట్ లతో పాటు జియో యొక్క కాంటెంట్ ను కూడా ఇస్తే ఇక వినియోగదారుడు జియో కు ఫిదా అయిపోతాడు కదా! ఎందుకంటే వీటిద్వారా ఉచిత వాయిస్ కాల్ లు ఉండనే ఉన్నాయి.కేవలం రూ 999/- లలోనే ఇవన్నీ లభిస్తున్నాయి. ఇక ఫీచర్ ఫోన్ వినియోగదారునికి వేరే ఆలోచన ఎలా ఉంటుంది? ఆహా అద్భుతమైన ఆలోచన కదా!
భారత టెలికాం రంగం లో లీడింగ్ ఆపరేటర్ లు గా ఉన్న ఎయిర్ టెల్ , వోడాఫోన్ మరియు ఐడియా లకు జియో యొక్క దెబ్బ మామూలుగా తగలలేదు. ఒక్క దెబ్బతో తమ టారిఫ్ లను క్రిందకు దించేశాయి. అయినప్పటికీ ఎయిర్ టెల్ ఇండియా లో అగ్ర స్థానం లో కొనసాగుతుంది అంటే దానికి కారణం ఫీచర్ ఫోన్ వినియోగదారులే అనడం లో సందేహం లేదు. అయితే జియో యొక్క ఒరవడి కేవలం స్మార్ట్ ఫోన్ లకు మాత్రమే పరిమితం అవుతుంది మిగతా వినియోగదారులు ఎలాగూ తమ చేతుల్లోనే ఉన్నారు కదా అని భావిస్తున్న భారత టెలికాం ఆపరేటర్ లకు జియో యొక్క ఈ రూ 999/- ల ఫోన్ ఒక అశనిపాతం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇండియన్ టెలికాం ఆపరేటర్ ల పరిస్థితి “ శరణమా ? రణమా? అన్నట్లు గా ఉంది. ఈ ఫోన్ లాంచ్ అయితే మెజారిటీ ఫీచర్ ఫోన్ వినియోగదారులు దీనికి మారడం ఖాయం. ఇది కేవలం జియో ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి స్టాండ్ బై గా వేరొక సిమ్ ఉంచుకోవడానికి అవకాశం లేదు . కాబట్టి ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా వినియోగదారులలో భారీ స్థాయి లో కోత పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం జియో ను వాడుతున్న వారందరూ దానిని ఒక ప్రత్యామ్నాయం గానే ఉపయోగిస్తున్నారు. వారి వారి స్మార్ట్ ఫోన్ లలో జియో కాకుండా వేరొక సిమ్ ఉంటుంది. అందువల్లనే జియో యొక్క వినియోగదారుల సంఖ్య 70 మిలియన్ లకు చేరుతున్నా మిగతా వినియోగదారుల సంఖ్య తగ్గలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు.ఊరించే ఆఫర్ లతో ఉన్న జియో ను ఎవరూ కాదనలేరు.
మరి ఇలాంటి పరిస్థితులలో భారత టెలికాం ఆపరేటర్ లు ఏం చేస్తాయనేది ఆసక్తికరంగానూ మరియు ప్రశ్నార్థకం గానూ మారింది. ఒక లెక్కలో చూసుకుంటే జియో అసలైన గేమ్ ఇప్పుడే మొదలుపెట్టింది? మొదటగా వచ్చిన జియో ట్రైలర్ మాత్రమే. దానికే ఆత్మరక్షణ లో పడిన భారత టెలికాం ఆపరేటర్ లు దీనికి ఎలా స్పందించనున్నాయో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఫోన్ లాంచ్ అయితే ఫీచర్ ఫోన్ రంగం లో ప్రకంపనలు సృష్టించే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో!