సాఫ్టువేర్ దిగ్గజ సంస్థ గూగుల్ భారత వినియోగదారుల కోసం 'గూగుల్ హెల్తు సెర్చి' పేరిట ఓ సరికొత్త ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ పీసీ వెర్షన్‌లలో గూగుల్ సెర్చును ఉపయోగించే యూజర్లు ఈ ఫీచర్‌ను అందుకోవచ్చు. ప్రస్తుతం ఈ తరహా ఫీచర్ కేవలం అమెరికా, బ్రెజిల్‌లలో మాత్రమే లభ్యమవుతుండగా, ఆ లిస్టులో 3వ స్థానంలో ఇప్పుడు భారత్ వచ్చి చేరింది. 'గూగుల్ హెల్తు సెర్చి' ద్వారా యూజర్లు ఏదైనా ఒక వ్యాధి గురించి గూగుల్ సైట్‌లో వెతికితే దానికి సంబంధించిన లక్షణాలు, ఆ వ్యాధి ఎందుకు వస్తుంది, వైద్య పరీక్షలు ఏమేం చేయాలి, ఎలాంటి చికిత్స తీసుకోవాలి అనే తదితర అంశాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. అయితే ఈ ఫీచర్ యూజర్లకు కేవలం అవగాహన కోసం మాత్రమేనని, దాన్ని వైద్య సంబంధ చికిత్సల కోసం ఉపయోగించరాదని గూగుల్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. భారత్‌లో అపోలో హాస్పిటళ్ల సహకారంతో తాము ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామని గూగుల్ ప్రతినిధులు తెలిపారు. దాదాపు 400 రకాలకు పైగా వ్యాధుల గురించిన సమాచారాన్ని ఈ ఫీచర్ ద్వారా తెలుసుకునేందుకు వీలుందని అన్నారు. దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తమకు దాదాపు సంవత్సరం పట్టిందని వారు పేర్కొన్నారు. కాగా గూగుల్ సెర్చిలో ఇప్పటికే అనేక ఫిల్టర్లు, ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి. దీంతో కోరిన సమాచారాన్ని తక్కువ సమయంలో కచ్చితంగా వెతికే అవకాశం మిగతా సెర్చింజన్లలో కంటే గూగుల్ లోనే ఎక్కువ. తాజా ఆప్షన్ తో గూగుల్ సెర్చి మరింత యూజ్ ఫుల్ గా మారనుంది. |