ఫొటొలని కళాఖండాలుగా మారుస్తున్న ప్రీస్మా యాప్ ఎలాగో మనం ఫోటో లను ఎడిట్ చేసుకోవాలి అనుకోండి ఏం చేస్తాం. మనదగ్గర ఉన్న కంప్యూటర్ లో ఫోటో షాప్ ఉంటె అందులో ఎడిట్ చేసుకొని మన ఫోటో లను అందమైన కళాఖండాలు గా మార్చుకుంటాం. ఒకవేళ మన దగ్గర కంప్యూటర్ లేకపోతే ఫోన్ లో ఇవన్నీ చేసుకోలేమా? ఫోన్ లో కూడా ఫోటో ఎడిటింగ్ ఫీచర్ లు ఉన్నప్పటికీ అవి ఎంత నాణ్యంగా ఉంటాయో మనందరికీ తెలుసు. స్మార్ట్ ఫోన్ లలో కూడా ఫోటో లను మరింత నాణ్యం గా ఇంకోరకంగా చెప్పాలంటే కళా ఖండాలుగా మార్చుకునే విధంగా ప్రిస్మా అనే ఒక యాప్ ఉందని ఇంతకూ ముందే మన వెబ్ సైట్ లో దాని గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అయితే ఫోటో లకు ప్రిస్మా ఎలా ఉపయోగపడిందో, వీడియో లను కూడా కళా ఖండాలుగా మార్చడానికి ఇప్పుడు ఒక యాప్ వచ్చేసింది. అదే ఆర్టిస్టో యాప్. అసలు ఇది ఎలా పనిచేస్తుందీ దీనికీ ప్రిస్మా కు ఉన్న సారూప్యతలు, తేడాలు ఏమిటి అనేవి ఈ వ్యాసం లో చర్చిద్దాం. ఫోటో ఎడిటింగ్ యాప్ లలో ప్రిస్మా ఒక విద్వంసక ఆవిష్కరణ గా మిగిలింది. అలాగే ఆర్టిస్టో కూడా వీడియో ఎడిటింగ్ లో మిగాలనుందా అని విశ్లేషకులు భావిస్తున్నారు. వీడియో ఎడిటింగ్ అనేది ప్రిస్మా లో కూడా ఒక భాగం గా ఉన్నప్పటికీ ఆర్టిస్టో అందించే నాణ్యత ఉత్కృష్టం గా ఉన్నది. యావరేజ్ గా ఉన్న వీడియో లను కూడా ఈ ఆర్టిస్టో కళా ఖండాలుగా మారుస్తుంది. అదికూడా స్మార్ట్ ఫోన్ లో. ఇది ఆండ్రాయిడ్ మరియు IOS రెండు పరికరాల లోనూ పనిచేస్తుంది. ప్రిస్మా ఎలా పనిచేస్తుందో ఆర్టిస్టో కూడా అలాగే పనిచేయనుంది. అంటే ఫోటో మరియు వీడియో కి సంబందించిన ప్రతీ వివరాన్నీ స్కాన్ చేసి ఫిల్టరింగ్ చేయడం ద్వారా వాటిని మరింత అందంగా తయారు చేస్తుంది. దీనికి ఇది మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం ను ఉపయోగించుకుంటుంది. ఆర్టిస్టో ఇదే పనిని మరింత వేగం గానూ మరియు వీడియో లను కూడా అత్యంత ఆకర్షణీయం గానూ చేస్తుంది. ఉదాహరణకు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినపుడు వీడియో గ్రాఫర్ దానిని షూట్ చేసి కంప్యూటర్ ద్వారా ఎడిట్ చేసి మనకు మరింత అందంగా దానిని చూపిస్తాడు కదా! ఈ యాప్ ఆర్టిస్టో యాప్ ను ఇన్స్టాల్ చేసుకుంటే అదే పనిని మనం ఫోన్ లో కూడా చేసేయవచ్చు. ఫోన్ ద్వారా తీసిన వీడియో లను కూడా ఇది అందంగా చేస్తుంది. ఫిల్టరింగ్ ప్రక్రియ కు ఎక్కువ సమయం తీసుకుంటుంది అని ప్రిస్మా పై ఒక విమర్శ ఉంది. ఈ విషయం లో ఆర్టిస్టో ముందంజ లో ఉంది. ఇది ఫిల్టరింగ్ ప్రక్రియను వేగవంతం గా చేస్తుంది. ఇది వీడియో లను గాలరీ నుండిగానీ లేదా యాప్ లో ఇన్ బిల్ట్ గా ఉన్న కెమెరా ద్వారా తీసిన వీడియో లను అయినా సరే ఎడిటింగ్ చేస్తుంది. కేవలం పది సెకన్ల లోనే ఇది పని పూర్తీ చేసేస్తుంది. ఈ ఫిల్టర్ లు చాలా వరకూ ప్రిస్మా లో ఉన్న వాటిని పోలి ఉన్నప్పటికీ వేటికవే ప్రత్యేకం. ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు IOS రెండింటి లోనూ విడుదల అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇది అందుబాటులో లేదు. ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఇండియా లో ఇది ఇంకా అందుబాటులో రాలేదు. అచ్చంగా వీడియో ఎడిటింగ్ కోసమే ప్రిస్మా మరొక యాప్ ను సిద్దం చేయనున్నట్లు సమాచారం. ప్రిస్మా మరియు ఆర్టిస్టో లను చూసి మరికొన్ని యాప్ లు కూడా ఈ అల్గోరిథం ఆధారిత సాఫ్ట్ వేర్ లను తయారు చేయడానికి సిద్దం అవుతున్నాయి. అంటే వీడియో ఎడిటింగ్ లో రానున్న రోజుల్లో పసందైన పోటీ ఉంటుందన్న మాట. పోటీ మంచిదే కదా! స్పర్థయా వర్ధతే సాంకేతిక పరిజ్ఞానం |