వర్చువల్ రియాల్టీ... మనకు నిజమా అన్న అనుభూతిని ఇచ్చే సాంకేతికత. మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లడానికి.. మనం ప్రతిరోజూ చూసే దృశ్యాలనే కొత్తగా చూపించడానికి.. కలయా.. నిజమా అన్న భావన కల్పించడానికి వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. తాజాగా బాహుబలి సినిమా ప్రమోస్ విడుదల సమయంలోనూ ఈ వర్చువల్ రియాల్టీని ఉపయోగించారు. అభిమానులు వర్చువల్ రియాల్టీ సెట్‌ల సాయంతో మహిష్మతి సామ్రాజ్యంలోకి వెళ్లి వచ్చిన భావన కలిగింది. అందుకే వర్చువల్ రియాల్టీ ప్రస్తుతం హాట్ హాట్. దీనిలో ఎన్నో కొత్త కొత్త వెర్షన్లు కూడా వచ్చేశాయి. 360 డిగ్రీల కోణంలో ఒక దృశ్యాన్ని తిలకించే అవకాశం కూడా దీనిలో ఉంది. ఐతే వర్చువల్ రియాల్టీ సాంకేతికత కొంచెం ఖరీదైనది. అందరూ వీఆర్ సెట్లు కొనలేరు. కానీ ఇప్పుడు వీఆర్ సెట్‌లు కూడా చవకగా దొరికే పరిస్థితి వస్తోంది. ప్రతి ఒక్కరూ వర్చువల్ రియాల్టీ అనుభూతిని పొందే అవకాశం ఉంది.
హెడ్‌సెట్ లేకుండానే..
సాధారణంగా వర్చువల్ రియాల్టీ అనుభవాన్ని పొందాలంటే కచ్చితంగా ఒక హెడ్‌సెట్ కావాలి. కాని హెడ్ సెట్ లేకుండానే ఈ అనుభూతిని పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కువమంది శాంసంగ్, ఎల్జీ కంపెనీలు తయారు చేస్తున్న 360 డిగ్రీల కెమెరాలతో వీఆర్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఐతే వీఆర్ వీడియో హెడ్‌సెట్ల ధర 1000 డాలర్ల పైనే ఉంది. అందరూ ఇంత ఖర్చు పెట్టి ఈ హెడ్‌సెట్ కొనుక్కునే పరిస్థితి ఉండదు. అందుకే కొన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీ తక్కువ ఖర్చు ఉన్న వీఆర్ హెడ్‌సెట్‌లను తయారు చేస్తున్నాయి. దీనిలో గ్రాఫిక్స్‌ను కూడా యాడ్ చేస్తున్నాయి. దీంతో వర్చువల్ రియాల్టీ వీడియోలను చూడడం చాలా సులభం అవుతుంది. అంతే కాదు వీటి ధర 100 డాలర్లు మాత్రమే ఉండడంతో ఎక్కువమంది వీటిని కొనుగోలు చేయడానికి మక్కువ చూపుతున్నారు. సోని, ఎల్‌జీ, హెచ్‌టీసీ లాంటి పెద్ద కంపెనీలు ఇలా తక్కువ ఖర్చుతో వీఆర్ హెడ్‌సెట్లను అందించి వినియోగదారులను ఆకర్షించే పనిలో ఉన్నాయి.
గూగుల్ కార్డ్‌బోర్డ్
గూగుల్ కార్డ్‌బోర్డ్ అనే సరికి అంతా తక్కువ అంచనా వేశారు. అయితే వేల రూపాయిలు పెట్టి కొన్న వీఆర్ హెడ్‌సెట్ల మాదిరిగానే ఇది కూడా వర్చువల్ రియాల్టీ అనుభూతిని ఇస్తుండడంతో అందరి చూపు దీనిపై మళ్లింది. అట్టపెట్టె మాదిరిగా ఉండే ఈ వీఆర్ సెట్ తక్కువ ధరతో దొరుకతుంది. ఐ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లతో దీన్ని అనుసంధానం చేసి వీఆర్ వీడియోలు తిలకించొచ్చు. గూగుల్ మాత్రమే కాదు చాలా పెద్ద కంపెనీలు ఉచితంగా వీఆర్ సెట్‌లను అందజేస్తూ ఈ టెక్నాలజీని విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇటీవలే న్యూయార్క్ టైమ్స్ పత్రిక తమ వినియోగదారులకు ఉచితంగానే ఈ కార్డ్‌బోర్డ్ పరికరాలను పంపింది. కార్డ్‌బోర్డ్ సాయంతో 360 డిగ్రీల వీడియోలు, రోలర్ కాస్టర్ రైడ్స్ లాంటి వాటిని చూస్తూ నిజమైన అనుభూతిని పొందే అవకాశం ఉంది.