యాపిల్ ఐ ఫోన్ అంటే క్రేజ్ ఉండనిది ఎవరికి. కొత్త ఫోన్లంటే మక్కువ చూపించే వారికి ఐ ఫోన్ విడుదల చేసే కొత్త బ్రాండ్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అందుబాటులో ఉన్న వాటిని కొనడం అంటే చాలా సరదా. ముఖ్యంగా భారత్ మధ్య తరగతి వినియోగదారులు కూడా ఐ ఫోన్లు కొంటున్నారంటే కారణం అది అందుబాటు ధరల్లో ఉండటమే! కానీ ఇప్పడు ఈ ధరలకు రెక్కలు రాబోతున్నాయి. భారత్‌లో ఐ ఫోన్ల ధరలు పెంచేయాలని యాపిల్ కంపెనీ నిర్ణయించింది. ఎస్-ఈ మోడల్‌కు ఆదరణ తక్కువగా ఉండటంతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఐ ఫోన్-6 మోడల్ ధరను 29 శాతం పెంచాలని అనుకుంటోంది. అంతేకాక జనవరి, మార్చిల్లో ప్రకటించిన కొన్ని ఆఫర్లను, డిస్కౌంట్లను కూడా ఉపసంహరించుకోవాలని యాపిల్ కంపెనీ ఆలోచిస్తుందట. 16 జీబీ సామర్థ్యం ఉన్న ఎస్-ఇ మోడల్ ధర మొదట్లో రూ.39000. కాగా ఇదే సామర్థ్యం ఉన్న ఐ ఫోన్-6 ధర రూ.31000, 6ఎస్ మోడల్ ధర రూ.40,500 కు లభ్యం అవుతున్నాయి. కానీ సవరించిన ధరల ప్రకారం ఐ ఫోన్-6 ధర రూ.40 వేలకు, 6 ఎస్ మోడల్ రూ.48 వేలకు పెరగనుంది. అంతేకాక ఐ ఫోన్ 5ఎస్ మోడల్ ధరను రూ.18 వేల నుంచి రూ.22 వేలకు పెంచాలని యాపిల్ కంపెనీ నిర్ణయించింది. అంతేకాదు ఈ ఫోన్ల అమ్మకాలు పెరగడం కోసం ఈఎంఐ సౌకర్యాన్ని కూడా కల్పించాలని యాపిల్ కంపెనీ అనుకుంటోంది. ఎస్-ఈ మొబైల్స్ లాంచ్ కోసం ఇటీవలే యాపిల్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ దీని స్ర్కీన్ సైజు తక్కువ ఉండటంతో భారత్‌లో దీని అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని యాపిల్ అనుకుంటోంది. భారత్‌లో వినియోగదారులు సాధారణంగా పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్లను కొనడానికి మక్కువ చూపుతున్నారు. అంతేకాక శాంసంగ్ కొత్త మోడల్ గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ మోడల్‌కు ప్రస్తుత భారత మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో శాంసంగ్‌కు ధీటుగా ఎస్-ఈ మోడల్‌ను తీసుకురావాలని యాపిల్ వ్యూహరచన చేస్తోంది. దీని కోసం ఈ ఫోను స్క్రీన్ సైజు పెంచడం లేకపోతే, ధరను అందుబాటులో ఉండేలా చూడాలని యాపిల్ కంపెనీ బావిస్తోంది. |