ఐ-ఫోన్లను ఇక హైదరాబాద్‌లోనే తయారుచేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే యాపిల్ ఐఫోన్లు ఇక తెలంగాణ రాష్ట్రంలో తయారయ్యే అవకాశముంది. ఐఫోన్‌లను పెద్ద మొత్తంలో తయారు చేసి యాపిల్ సంస్థకు చిప్ లు, ఇతర భాగాలు సరఫరా చేసి ఫాక్స్‌కాన్ కంపెనీని హైదరాబాద్ లో నెలకొల్పనుండడమే దీనికి కారణం. భారత్‌లో తయారీ కారణంగా చాలా తక్కువ ధరలకే ఐ ఫోన్లు లభ్యమయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొబైల్ ఫోన్‌ల తయారీ హబ్ ఏర్పాటు చేసి సుమారు రెండు లక్షల మందికి ఉపాధి కల్పించాలని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అందులోభాగంగా ఆయన ఇటీవల తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ప్రెసిడెంట్ కాల్విన్ చిన్, ఫిహ్ మొబైల్ లిమిటెడ్ ఛైర్మన్ విన్సెంట్ టాంగ్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తమ మొబైల్ తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఈ రెండు కంపెనీల ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇది కార్యరూపం దాల్చితే ఐఫోన్లు దాదాపుగా హైదరాబాద్ లోనే తయారవుతాయి. వాటి ధరా అందుబాటులోకి వచ్చే అవకాశముంటుంది. మరోవైపు ఇప్పటికే సెల్‌కాన్, కార్బన్, మైక్రోమాక్స్ వంటి కంపెనీలు రాష్ట్రంలో మొబైల్ తయారీ యూనిట్‌లను ఏర్పాటు చేసేందుకు రెడీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ లెక్కన ఇవన్నీ హైదరాబాద్ లోనే తయారైతే తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ ఫోన్ల ధరలు నేలకు దిగొస్తాయేమో? |