ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ ఇండియాలో కాలు మోపే రోజు దగ్గరలోనే ఉందా? మొబైల్ ప్రియుల కలల ఐ ఫోన్ ఇక మన దగ్గరే తయారవబోతుందా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానాలు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి ఐఫోన్ల తయారీ ప్రారంభమవుతుందని ఆ రాష్ట్ర ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే రెండు రోజుల క్రితం ఎనౌన్స్ చేశారు. యాపిల్ ఐఫోన్లను భారత్‌లో అసెంబుల్ చేసేందుకు యూనిట్ ఏర్పాటు చేయనుందని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. దీంతో ఏపీ, తెలంగాణతో సహా దేశంలోని చాలా రాష్ట్రాలు యాపిల్ తమ స్టేట్‌కే వస్తుందని చెప్పుకొచ్చాయి. అయితే చివరికి యాపిల్ తన యూనిట్‌ను బెంగుళూరులో ఏర్పాటు చేయబోతుందని తాజా సమాచారం.
ఎప్పటిలోగా అవుతుందో?
ఐఫోన్ల తయారీ కార్యకలాపాలను ప్రాథమికంగా ప్రారంభిస్తామని యాపిల్ చేసిన ప్రతిపాదనలను తమ ప్రభుత్వం ఆహ్వానించిందని ప్రియాంక్ ఖర్గే ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. యాపిల్.. తైవాన్‌కు చెందిన విస్ట్రోన్ కార్పొరేషన్‌తో కలిసి సంయుక్తంగా బెంగళూరులో అసెంబుల్ పాయింట్ ఏర్పాటు చేయబోతుందనేది లేటెస్ట్ న్యూస్. అయితే యాపిల్ దీనిపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మీడియాలో కొంత మంది దీని గురించి అడిగేందుకు ప్రయత్నించినా స్పందించలేదని సమాచారం.
ఇండియాలో తమ యూనిట్‌ను నెలకొల్పాలంటే ప్రభుత్వం తమకు ఎలాంటి రాయితీలిస్తుందో క్లారిటీ వచ్చాకే ముందుకెళ్లాలనేది యాపిల్ ఆలోచన. ఆ తర్వాతే తైవాన్‌కు చెందిన ఒరిజినల్ డిజైన్ మేకర్ విస్ట్రోన్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఐ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను బెంగళూరులో ఏర్పాటు చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్‌తో ప్రస్తుతం యాపిల్ సంప్రదింపులు జరుపుతోందని, అవి ఒక కొలిక్కి వస్తేగానీ ఆపిల్ ఉత్పత్తి ప్రారంభం కాదని ఓ టాప్ గవర్నమెంట్ అధికారి ఒకరు చెప్పారు. అంటే ఇప్పటికిప్పుడు యాపిల్ నుంచి దీనిమీద ఎలాంటి కన్‌క్లూజన్ వచ్చేలా లేదన్నది ఆయన ఉద్దేశం.
విస్ట్రోన్ కార్పొరేషన్‌కు బెంగళూరుకు సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలోని పీన్యాలో ఇప్పటికే యూనిట్ కట్టడానికి అవసరమైన సౌకర్యాలున్నాయి. ఇప్పటికే అక్కడ ఓ స్మార్ట్‌ఫోన్ తయారీ యూనిట్ ఏర్పాట్లలో విస్ట్రోన్ కార్పొరేషన్ ఉందని సమాచారం. యాపిల్ నెగోషియేషన్స్ పూర్తి చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పెట్టుబడి పెట్టడానికి ఈ సంస్థ సిద్ధంగా ఉందని సమాచారం. యాపిల్ యూనిట్‌ను బెంగళూరులో ఏర్పాటు చేయాలని తాము ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నామని కర్నాటక ఐటీ మినిస్టర్ చెప్పారు. యూనిట్ పెట్టేందుకు యాపిల్ సిద్ధమైతే అవసరమైన ఇన్సెంటివ్స్, రాయితీలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలను ఆకట్టుకునేందుకు ఇప్పటికే ఎలక్ట్రానిక్ సిస్టం డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ (ఈఎస్ డీఎం) పాలసీని కూడా తీసుకొచ్చింది. రాయితీలు కూడా ఇస్తోంది. విస్ట్రోన్ కార్పొరేషన్‌కు కూడా ఇప్పటికే ఇలా కొన్ని క్లియరెన్స్‌లు కూడా ఇచ్చింది.
వస్తే ఏంటి?
ప్రస్తుతానికి ఐ ఫోన్ అసెంబ్లింగ్ యూనిట్‌పైనే చర్చలు జరుగుతున్నాయి. తర్వాత స్టేజ్‌లో లోకల్‌గానే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పుతుందని అంచనా. అదే జరిగితే బెంగళూరు చుట్టూ ఉన్న స్మాల్ కాంపొనెంట్ మేకర్స్ కు మంచి ప్రయోజనం.
ఐఫోన్ ఇండియాలో తయారైతే మనకు కస్టమ్స్ డ్యూటీ పడదు. ఇతర రాయితీలు వస్తాయి కాబట్టి ఫోన్ ధర తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
భవిష్యత్తులో యాపిల్ ఇతర ఉత్పత్తులు (పీసీలు, మాక్‌లు, ఐ పోడ్, ఐపాడ్‌లు) కూడా ఇక్కడ అసెంబుల్ లేదా తయారీ చేస్తే వాటి ధరలు కూడా తగ్గొచ్చని మార్కెట్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.