• తాజా వార్తలు

విండోస్ 10లో ఫేస్‌బుక్‌, మెసెంజ‌ర్ యాప్స్

కొత్త యాప్‌ల‌ను, టూల్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డంలో ఫేస్‌బుక్ ముందుంటుంది. కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తూ వినియోగ‌దారుల‌కు చేరువ కావ‌డానికి ఈ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ దిగ్గ‌జం వినూత్న ప్ర‌యోగాలు చేస్తూ ఉంటుంది. దీనిలో భాగంగానే విండోస్ 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లోకి ఫేస్‌బుక్ మ‌రియు మెసెంజ‌ర్ యాప్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది.  ఆర్టిక‌ల్స్‌ను సుల‌భంగా షేర్ చేయ‌డానికి, మ‌రింత వేగంగా న్యూస్ ఫీడ్‌ను విస్త‌రింప చేయ‌డానికి ఈ రెండు టూల్‌లు ఎంతో ఉప‌యోగ‌ప‌డనున్నాయి. ఈ కొత్త ఫేస్‌బుక్‌, మెసెంజ‌ర్ల ద్వారా విండోస్ వినియోగ‌దారులు వినూత్న ఫీచ‌ర్ల‌ను పొందొచ్చ‌ని ఫేస్‌బుక్ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. 

విండోస్ 8 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో పోలిస్తే విండోస్ 10 ఫేస్‌బుక్ యాప్ న్యూస్ ఫీడ్‌ను వేగంగా షేర్ చేయ‌డానికి, లోడ్ చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఎఫ్‌బీ తెలిపింది. విండోస్ 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లో  స్టార్ మెనూ నుంచి ఈ ఫీచ‌ర్ యాక్సిస్ చేయ‌చ్చ‌ని ఫేస్‌బుక్ తెలిపింది. 

విండోస్ 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లో బిల్ట్ ఇన్‌గా ఉన్న ఫేస్‌బుక్, మెసెంజ‌ర్ల వ‌ల్ల ఎప్ప‌టిక‌ప్పుడు నోటిఫికేష‌న్స్ మ‌నం తెలుసుకోవ‌చ్చు. అంతేకాక న్యూస్ ఫీడ్‌కు సంబంధించిన విశేషాల‌ను, లేటెస్ట్ అప్‌డేట్‌ల‌ను పొందొచ్చు. ఫైల్ ఎక్స్‌ప్లోర‌ర్ మ‌రియు ఇత‌ర ఫొటో యాప్స్ ద్వారా మ‌న‌కు న‌చ్చిన ఫొటోల‌ను క్ష‌ణాల్లో షేర్ చేసుకోవ‌డానికి ఈ ఫేస్‌బుక్ యాప్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌నుంది. 

మెసెంజ‌ర్ యాప్ వ‌ల్ల ఎప్ప‌టిక‌ప్పుడు సందేశాల‌ను మ‌నం చూడొచ్చు. ఇది మ‌న‌కు సాధార‌ణ డెస్క్‌టాప్ నోటిఫికెష‌న్ల‌లా కాకుండా యాక్ష‌న్ సెంట‌ర్ ఆప్ష‌న్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. ఐతే పేమెంట్స్‌, వీడియో కాలింగ్‌, ఫోటోలు తీసుకోవ‌డం ఇంకా ఈ యాప్‌తో ల‌భ్యం కావ‌ట్లేదు. త్వ‌ర‌లో ఈ ఆప్ష‌న్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఫేస్‌బుక్ తెలిపింది. విండోస్ 10తో విండోస్ 8.1 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌లో ఈ ఫేస్‌బుక్ యాప్ ల‌భ్యం అవుతోంది. మెసెంజ‌ర్ యాప్ విండోస్ 8, 8.1, 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌లో అందుబాటులో ఉంది. విండోస్ 10 మొబైల్ డివైజ్‌లోనూ ఇది దొరుకుతుంది. మైక్రోసాఫ్ట్ స్టోర్ ఆప్ష‌న్‌తో ఈ ఫేస్‌బుక్‌, మెసెంజ‌ర్ యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

 

జన రంజకమైన వార్తలు