మన దేశం లో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది, వినియోగదారులలో స్మార్ట్ ఫోన్ వాడకం పట్ల మంచి ఆసక్తి కనపడుతుంది అనే వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాము. ఇది నిజమే స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య మిలియన్ లను దాటి బిలియన్ ల వైపుకు పరుగులు తీస్తూ ఉంది. టెలి కం ఆపరేటర్ లందరూ ఈ మార్పులను నిశితంగా గమనిస్తూ వినియోగదారులను ఎలా ఆకట్టుకోవాలి అనే అంశంపై ప్రణాళికలు రచిస్తున్నారు. వీటి మధ్య పోటీ తారా స్థాయికి చేరిన వైనాన్ని కూడా మనం ప్రతీ రోజూ చూస్తూనే ఉన్నాం. అయితే జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు అర్థం అయ్యే విషయం ఏమిటంటే మన దేశంలో ఇప్పటివరకూ ఉన్న ఫోన్ వినియోగదారులు కానీ లేదా ప్రస్తుతం పెరుగుతున్న వినియోగదారులు కానీ సుమారు 95% మంది ప్రీ పెయిడ్ వినియోగదారులే. కేవలం 5 % మంది మాత్రమే పోస్ట్ పెయిడ్ ను వాడుతున్నారు. ఆపరేటర్ లు కూడా ప్రీ పెయిడ్ వినియోగదారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఒక్కో సర్కిల్ లో 1000 ప్లాన్ ల చొప్పున మొత్తం 22,000 కాల్ మరియు డేటా ప్లాన్ లను ప్రీ పెయిడ్ వినియోగదారులకు కేటాయించారు. ఈ ప్లాన్ ల ద్వారా పరిశ్రమ కు వచ్చే ఆదాయం సుమారు 50 బిలియన్ డాలర్ లు అంటే కంపెనీలు ప్రీ పెయిడ్ కస్టమర్ లపై ఎలా దృష్టి కేంద్రీకరించాయో అర్థం చేసుకోవచ్చు. భారత వినియోగదారులనూ వారి మైండ్ సెట్ నూ నిశితంగా గమనిస్తున్న ముగ్గురు స్నేహితులు భారత ప్రీ పెయిడ్ వినియోగదారుల కోసం ఒక సరికొత్త యాప్ ను తయారు చేశారు. రఘు వర్మ, అశ్విన్ రామ స్వామి మరియు ప్రణవ్ ఝా అనే ఈ ముగ్గురు స్నేహితులు భారత టెలికాం రంగం లో వస్తున్న మార్పులను పోకడలను చాలా కాలం నుండీ పరిశీలిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యం లో ప్రీ పెయిడ్ వినియోగదారుల సమస్యలు ఎలా ఉంటాయి వాటికీ మనం ఎలా పరిష్కారం చూపించవచ్చు అనే అంశం పై సుదీర్ఘ చర్చలు జరిపి ఒక యాప్ ను రూపొందించారు. ఆ యాప్ పేరే మబ్బుల్. “బ్యాలన్సు తెలుసుకోవాలన్నా లేదా డేటా వినియోగం తెలుసుకోవాలన్నా ప్రీ పెయిడ్ వినియోగదారులు సంక్లిష్టం గా ఉండే IVRS కు డయల్ చేయాలి లేదా అస్పష్టంగా ఉండే సెల్ఫ్ సర్వీస్ మెనూ ల ద్వారా తెలుసుకోవాలి. చాలా మందికి వీటిపై కనీస అవగాహన కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా అవి సంక్లిష్టంగా ఉండడం తో తికమక గా భావిస్తూ ఉంటాడు.కాబట్టి బ్యాలన్సు మరియు డేటా ప్లాన్ ల వివరాలు తెలుసుకోవడానికి వినియోగదారునికి ఒక సరళమైన టూల్ ఒకటి కావాలి. అందుకే మేము ఈ మబ్బుల్ అనే యాప్ ను రూపొందించాము” అని మబ్బుల్ సీఈఓ అయిన అశ్విన్ చెబుతున్నారు. ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? సాధారణంగా ఈ యాప్ ప్రీ పెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ రెండింటికీ పనిచేస్తుంది. కానీ దీని దృష్టి అంతా ప్రీ పెయిడ్ వినియోగదారులపై మాత్రమే ఉంది. ఎందుకంటే ఇది వారిని దృష్టిలో ఉంచుకునే తయారుచేయబడింది. ఈ యాప్ వినియోగదారులలో 90 శాతం మంది నాన్ మెట్రో సిటీస్ అంటే చిన్న చిన్న పట్టణాలు నగరాల నుండే ఉన్నారు. మరి వారందరికీ సరిగ్గా చేరాలి అంటే ఇంగ్లీష్ తో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉండాలి కదా! అందుకనే ఈ యాప్ ఇంగ్లీష్ తో పాటు మరాఠీ, బెంగాలి, తమిళ్, తెలుగు భాషలలో కూడా అందుబాటులో ఉంది. మీరు చేసే ప్రతీ కాల్ పూర్తి అయిన తర్వాత మీ టెలికాం ఆపరేటర్ ద్వారా మీ కాల్ ను విశ్లేషించి మీ ఎకౌంటు లో మిగిలిన బాలన్స్ ను మీకు చూపిస్తుంది. అలాగే మీరు ఇంటర్ నెట్ ను వాడిన ప్రతీసారి మీరు ఎంత డేటా వాడినదీ ఇంకా మీ ఎకౌంటు లో ఎంత డేటా ఉన్నదీ కూడా మీకు డిస్ప్లే చేస్తుంది. కొన్ని యాప్ లు స్క్రీన్ వెనుక రన్ అవుతూ ఉంటాయి కదా అలాంటపుడు మనకు డేటా ఎలా కట్ అయ్యిందో అర్థం కాదు, అయితే ఈ యాప్ ద్వారా మీకు రియల్ టైం డేటా వినియోగాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. తద్వారా వెనుక రన్ అవుతున్న యాప్ లను మీరు క్లోజ్ చేసుకోవచ్చు. అంతేగాక మీ టెలికాం ఆపరేటర్ మీకు అందించే ఆఫర్ ల గురించిన అలెర్ట్ లను కూడా అందిస్తుంది. ఈ యాప్ సైజు 4 MB ఉంటుంది. ఇది ఆన్ లైన్ లో మాత్రమే గాక ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తుంది. దీనివలన వినియోగదారులు తమ రియల్ టైం వినియోగాన్ని మరియు బాలన్స్ నూ తెలుసుకోవచ్చు. ఇది ప్రీ పెయిడ్ బిల్లులను జనరేట్ చేయడంలో తోడ్పడుతుంది. ప్రత్యేకించి డ్యూయల్ సిమ్ ఉన్న ఫోన్ లు ఉపయోగించే వినియోగదారులు ఒక్కో సారి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి సందర్భాలలో ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యం లో తన మార్కెట్ సైజు ను పెంచుకోవడానికి ఈ మబ్బుల్ యాప్ కు ఇదొక చక్కని అవకాశం. ఇప్పటికే ఈ రంగం లో ఉన్న ఇతర యాప్ లైన ట్రూ బాలన్స్, బిల్ బచావో మరియు స్మార్ట్ యాప్ ల లాంటి యాప్ లనుండి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ రియల్ టైం లో బాలన్స్ చెప్పడం మరియు ప్రాంతీయ భాషలలో కూడా సేవలు అందిస్తుండడం తో వినియోగదారుల మనసు గెలుచుకుంటుంది అనడం లో సందేహం లేదు. |