సాంకేతికత రోజుకో రూపు మార్చుకుంటుంది... మొబైల్ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి విప్లవాత్మక మార్పొకటి అందరిని ఆకర్షిస్తోంది. డీబీఎస్ బ్యాంకు భారత దేశ మొదటి మొబైల్ బ్యాంకుగా నిలవనుంది. ఏటీఎమ్‌లతో పని లేకుండా, బ్యాంకులకు వెళ్లకుండా, ప్రత్యక్షంగా ఎలాంటి లావాదేవీలు లేకుండా ఒక్క క్లిక్‌తో మన పనులు అయిపోవడానికి ఈ మొబైల్ బ్యాంకు పని చేస్తుంది. ఏదైనా పని కావాలంటే సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. డీజీ బ్యాంకు పేరుతో విడుదలైన తొలి మొబైల్ బ్యాంకు బ్యాంకింగ్ రంగంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టనుంది. బ్రాంచ్‌లు ఉండవు, పేపర్లతో పని లేదు..సంతకాలు అవసరం లేదు.. ఇదే డీజీ బ్యాంకు ప్రత్యేకత. ఈ వినూత్న బ్యాంకును డీబీఎస్ ఇటీవలే ముంబయిలో ప్రవేశపెట్టింది. వినియోగదారులు అత్యంత సులభంగా బ్యాంకు కార్యకలాపాలు పూర్తి చేసేలా ఈ డీజీ బ్యాంకు యాప్‌ను రూపొందించారు. బయో మెట్రిక్, ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ సేవలను ఈ యాప్‌లోనే పొందుపరిచింది. దీని ద్వారా వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా బ్యాంకు కార్యకలాపాలను చేయచ్చు. ఎల్ల వేళలా కస్టమర్లకు అందుబాటులో ఉండేవిధంగా, వారికి ఏమైనా అవసరాలు వస్తే తీర్చే విధంగా వర్చువల్ అసిస్టెంట్ అనే ఆప్షన్‌ను కూడా డీజీ బ్యాంకులో ఉంది. మనకు ఏదైనా అనుమానాలు ఉంటే అప్పటికప్పుడు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టుకోవచ్చు. మన సందేహాలు అడిగిన వెంటనే రియల్ టైమ్‌లో మనకు సమాధానాలు ఇవ్వడం ఈ డీజీ బ్యాంకు ప్రత్యేకత. ఒకే రోజు 10 వేల వినియోగదారుల ప్రశ్నలకు ఇది సమాధానం చెప్పగలదు. వినియోగదారులతో ఇలా ఎప్పటికప్పుడు మాట్లాడే సాంకేతికతను రూపొందించిన బ్యాంకు డీజీనే అని డీబీఎస్ తెలిపింది. ఆసియాలో ఇలాంటి సేవలు అందిస్తున్న మొదటి బ్యాంకు కూడా ఇదే. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా కస్టమర్లకు సేవలు అందించడంలో డీజీ బ్యాంకుకు కసిస్టో అనే అంకుర సంస్థ సహాయం చేస్తోంది. భద్రత విషయంలో మిగిలిన బ్యాంకులతో పోలిస్తే మరింత మెరుగైన సేవలు అందించాలని డీజీ నిర్ణయించింది. ఓటీపీల కన్నా ఎక్కువ భద్రతనిచ్చే డైనమిక్ ఇన్‌బిల్ట్ సెక్యూరిటీ వ్యవస్థను ఈ బ్యాంకు తయారు చేసింది. ఓటీపీలు, ఎస్ఎంఎస్‌ల కోసం ఎదురు చూడకుండా మన ట్రాన్సాక్షన్స్‌ను సులభంగా, సురక్షితంగా చేసుకునేలా డైనమిక్ ఇన్‌బిల్ట్ సెక్యూరిటీ ఎంతో ఉపయోగపడుతుంది. 2014 డిసెంబర్ నాటికి భారత దేశంలో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు 16.8 మిలియన్లు ఉంటే, 2015 డిసెంబర్ నాటికి 39.5 మిలియన్లకు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాము కొత్తగా ప్రవేశపెట్టిన డీజీ బ్యాంకు మరింత ఆదరణ పొందుతుందని డీబీఎస్ బ్యాంకు భావిస్తోంది. |