సాధారణంగా కార్లలోని ఎయిర్ బ్యాగ్ లు, ఏబీఎస్ బ్రేకులు, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్స్ వంటివన్నీ కొంతలో కొంత ప్రమాదాల నుంచి క్షణనిస్తాయనుకుంటాం. వీటన్నికంటే ఇప్పుడు సరికొత్త పరికరం వచ్చింది. ఇది అత్యంత ఇంపార్టెంట్ పని చేస్తుంది. అది కారు టైర్లలోని గాలి పీడనాన్ని నిత్యం గమనిస్తుంది. కొత్తగా వస్తున్న లగ్జరీ కార్లలో డీఫాల్టుగానే ఇలాంటి వ్యవస్థ ఉండగా సాధారణ కార్లలో మాత్రం లేదు. దీంతో ఒక్కోసారి సరిగా చూసుకోకుండా తక్కువ గాలితో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురి అవుతున్న వారు ఉంటున్నారు.
రియల్ టైం చెకింగ్
నిజానికి కారును తయారు చేసే కంపెనీ సూచించిన ప్రమాణాల ప్రకారం టైర్లలో గాలిని మెంటైన్ చేస్తుండాలి. బట్... ఇది అన్ని సార్లూ అందరికీ సాధ్యం కాదు. అంతేకాకుండా కారు ప్రయాణిస్తున్నప్పుడు టైర్లు వేడెక్కడం వల్ల కూడా టైర్లలోని గాలి పీడనంలో మార్పు వస్తుంటుంది. ఇది రియల్ టైంలో చెక్ చేసుకోవడమన్నది ఎవరికీ మాన్యువల్ గా కుదరదు. జడ్ యూఎస్ మోనిటరింగ్ సిస్టమ్ మనకు ఆ పనిచేసి పెడుతుంది.
ఎలా పనిచేస్తుంది..?
ఇది స్మార్టు ఫోన్ తో కనెక్టయి పనిచేస్తుంది. మన స్మార్టు ఫోన్లో దీనికి సంబంధించిన యాప్ వేసుకోవాలి. బ్లూటూత్ ద్వారా ఫోన్ కు కనెక్టవుతుంది.
జడ్ యూఎస్ లో టైర్ డిటెక్షన్ సెన్సర్లు ఉంటాయి. కారు ఎయిర్ ఇన్లెట్ ఫోర్టుకు ఇది అమర్చాలి. బ్లూటూత్ తో వైర్ లెస్ గా ఇది కనెక్టయి ఉంటుంది. ఫోన్ కు కనెక్టయిన తరువాత ప్రయాణంలో అనుక్షణం రియల్ టైంలో టైర్ల ప్రెజర్ ను ఇది మోనిటర్ చేస్తుంది. అంతేకాదు.. ఒక వేళ ఏదైనా టైర్ నుంచి గాలి లీకవుతుంటే... లీకేజీ ఎంత వేగంతో జరుగుతోంది.. ఏ టైరు నుంచి లీకవుతుందన్నది కూడా గుర్తిస్తుంది. వెంటనే అలర్ట్ చేస్తుంది.
యాప్ లో మొత్తం రికార్డవుతుంది...
పైగా దీనికి సంబంధించిన యాప్ లో టైర్ల టెంపరేచర్, ప్రెజర్ వంటి వివరాలన్నీ రికార్డవుతాయి కూడా. ఈ హిస్టరీ చూసి మన అనాల్సిస్ చేసుకోవచ్చు కూడా.
ఏ కారుకైనా అమర్చుకోవచ్చు..
ఇందులో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సెన్సర్లను సులభంగా అమర్చుకోవడం, తొలగించడం చేయొచ్చు. అంటే మనం క్యాబ్ బుక్ చేసుకున్నా, కారు అద్దెకు తీసుకుని వెళ్తున్నా వాటికి కూడా అప్పటికప్పుడు దీన్ని ఫిట్ చేసేయొచ్చు. దీన్ని ఇతరులు దొంగిలించకుండా యాంటీ థెఫ్ట్ సిస్టమ్ కూడా ఉంది. మొత్తానికి ఈ జడ్ యూఎస్ మోనిటరింగ్ సిస్టమ్ ధర 97 డాలర్లు. అంటే మన రూపాయల్లో లెక్కేస్తే సుమారుగా 670 వరకు ఉంటుంది. ఆగస్టు నుంచి దీని విక్రయాలు మొదలవుతాయి.