• తాజా వార్తలు

ఈ స్మార్టుఫోనుంటే సిగరెట్ ఉన్నట్లే

800లకు పైగా పఫ్‌లను లేదా 4సిగరెట్‌ ప్యాకెట్లు అందించే కిక్‌

ఆఫీసు పనుల్లోనో, ఇతరత్రా హడావుడిగా వుండి, కాస్త రిలాక్సు అవడానికి సిగరెట్‌ కాలుస్తుంటారు. అయితే.. డిఫరెంటుగా ఫోన్ ద్వారా సిగరెట్ కాల్చొచ్చంటున్నారు టెక్ నిపుణులు.  మొబైల్‌లో ఇప్పటివరకు ఫోన్‌ కాల్సు , సోషల్‌ మీడియా పోస్టులు, నెట్‌ సంబంధిత ఇతరత్రా పనులు చేయడమే తెలుసు. కానీ, మొబైల్ ద్వారా సిగరెట్ కాల్చే పరికరం ఒకటి అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా కోరుకున్నప్పుడంతా ఒక దమ్ము పీకొచ్చు.

ఈ పరికరం ద్వారా ఒక ఎలక్ట్రానిక్‌ పఫ్‌ను లాగించేయొచ్చు. యుఎస్‌ ఆధారిత కంపెనీ అయిన వాపర్‌ కేడ్‌ ఈ సిగరెట్‌ ఫ్లేవర్‌లు వున్న స్మార్టు ఫోన్‌ను విడుదల చేసింది. దీంతో కాల్సు, మెసేజ్‌లు పంపించడంతో బాటు సిగరెట్‌ కూడా తాగొచ్చు.  జూపిటర్ రశీ 3 అనే  ఈ స్మార్ట్‌ఫోన్‌... ప్రపంచంలోనే ఈసిగరెట్‌తో నిర్మితమైన మొట్టమొదటి స్మార్టు ఫోన్.   3జీ సేవలను వినియోగించుకోగలిగే సౌలభ్యం వున్న ఈ ఫోన్‌ ధర సుమారు రూ.20వేలు. ఇది ఆండ్రాయిడ్‌ కిట్‌క్యాట్‌ 4.4 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీనిలో మొత్తం రెండు బ్యాటరీలుంటాయి. ఒకటి ఫోన్‌కు పవర్‌ను అందిస్తోంటే, మరోటి ఈసిగరెట్‌కు పవర్‌ను అందిస్తుంది. ఈ రకంగా స్మార్ట్‌ఫోన్‌నూ, సిగరెట్‌నూ వాడుతుంటే బ్యాటరీలైఫ్‌ త్వరగా అయిపోతుందేమోననే ఆందోళనా అవసరంలేదు. ఎందుకంటే ఇది మూములు స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్‌టైమ్‌ను అందిస్తుంది.

ఫోన్  పైభాగంలో ఒక చిన్న ప్లాస్టిక్‌ కవర్‌ కింద చిన్న ఓపెనింగ్‌ వుంటుంది. ఆ ఓపెనింగ్‌కు లిక్విడ్‌ కాట్రిడ్జ్‌నూ, మౌత్‌పీస్‌నూ అటాచ్‌ చేసివుంటుంది. దానిసాయంతో ఎంచక్కా పఫ్‌ లాగించొచ్చు. వేడిని నియంత్రించడానికి, గట్టిగా దమ్ము లాగడానికి దీనికో బటన్‌ కూడా ఏర్పాటు చేశారు. లిక్విడ్‌ కాట్రిడ్జు ధర సుమారు వెయ్యి రూపాయలు వుంటుంది. ఇది దాదాపు 800లకు పైగా పఫ్‌లను లేదా 4సిగరెట్‌ ప్యాకెట్లు అందించే కిక్‌ను అందిస్తుంది. అంతేకాదు ఇది మింట్‌, పీచ్‌, కాఫీ లాంటి వివిధ రకాల ఫ్లేవర్లలో కూడా లభ్యమౌతోంది. ఈ సంస్థ ఒక యాప్‌ను కూడా ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసింది. బ్యాటరీలైఫ్‌, ఇంకా కాట్రిడ్జ్‌లో ఎంత లిక్విడ్‌ మిగిలివుంది, ఏ ఫ్లేవర్‌ అందులో లోడ్‌ అయివుంది, ఇప్పటివరకూ ఎంత ఉపయోగించారు వంటి వివరాలన్నీ ఆ యాప్‌ వినియోగదారులకు అందిస్తుంది. స్మోకింగ్‌ ఆపాలన్నా లేదా కొంచెం బ్రేక్‌ ఇవ్వాలన్నా అందులో స్టోర్‌ చేసి పెట్టుకుంటే, ఎప్పటికప్పుడు అలెర్ట్‌లను కూడా పంపిస్తుంది. అయితే దీనివలన ఇతరత్రా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? ఫోన్‌పై దీని ప్రభావం ఎంతవరకూ వుంటుంది అనే వివరాలు ఇంకా తెలియాల్సివుంది. ప్రస్తుతానికి ఇది యుఎస్‌ ఫెడరల్‌ కమిషన్‌ ఆమోదం కోసం లైన్‌లో వుంది. అదే సమయంలో దీనికి సంబంధించిన 4జీ మోడల్‌ ఫోన్‌లను విడుదల చేసే పనిలో ఆ సంస్థ బిజీగా ఉంది. దీని ధర సుమారు రూ.33వేలు వుండొచ్చు.

 

జన రంజకమైన వార్తలు