మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కు తెర లేచింది. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైళ్ల ప్రదర్శన, సమ్మేళనానికి స్పెయిన్ లోని బార్సిలోనా వేదికైంది. ఏటా ప్రపంచ టెక్ ప్రియులు ఎదురుచూసే ఈ మహా సమ్మేళనం మొదలైపోయింది. సోమవారం నుంచి మార్చి 2 వరకు నిర్వహిస్తున్న ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో నోకియా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీదారులు, సాంకేతికతలు అందించే సంస్థలు, విక్రేతలు, యాప్ తయారీ సంస్థలు అన్నీ పాల్గొనే ఈ కార్యక్రమం నాలుగు రోజుల పాటు సందడి చేయనుంది.
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ను ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంటారు. సమ్మర్ ఈవెంట్, వింటర్ ఈవెంట్ పేరిట వేర్వేరు వేదికల్లో నిర్వహిస్తారు. ప్రస్తుత ఈవెంట్ బార్సిలోనాలో జరుగుతుండగా జూన్ 28 నుంచి జులై 1 వరకు చైనాలోని షాంఘైలో మరోసారి ఈ మెగా ఈవెంట్ నిర్వహించనున్నారు.
2006 వరకు దీన్ని కేన్స్ లో నిర్వహించేవారు. అప్పట్లో 3జీఎస్ఎం మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ గా పిలిచేవారు. అనంతరం కాలంలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్, జీఎస్ఎం వరల్డ్ కాంగ్రెస్ గా వ్యవహరిస్తున్నారు. 2007 నుంచి ఏటా బార్సిలోనాలో నిర్వహిస్తున్నారు. 2014 నుంచి షాంఘైలో సమ్మర్ ఈవెంట్ జరుపుతున్నారు.
ప్రధాన ఈవెంట్ అయిన బార్సిలోనా కాంగ్రెస్ కు ఏటా 90 వేల నుంచి లక్ష మంది హాజరవతుంటారు. 200కిపైగా దేశాల నుంచి ప్రతినిధులు వస్తారు. అన్ని ప్రధాన సంస్థలతో పాటు చిన్నచితకా మాన్యుఫ్యాక్చరర్స్ కూడా తప్పనిసరిగా అటెండయ్యే కార్యక్రమం ఇది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కు సిలికాన్ వ్యాలీ నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు వస్తారు. ఇవన్నీ కలిసి అక్కడో ప్రత్యేక సాంకేతిక లోకం ఆవిష్కారమవుతుంది.2016 ఈవెంట్లో 1,01,000 మంది పాల్గొన్నారు. 2011 నుంచి 2023 వరకు బార్సిలోనాయే దీనికి వేదికగా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.
అంకెల్లో 2017 ఈవెంట్
* హాజరయ్యే మొత్తం ప్రతినిధులు: 1,01,000
* హాజరయ్యే సీఈవోలు: 5,500
* తమ గాడ్జెట్స్, టెక్నాలజీ ప్రదర్శించబోయే సంస్థలు: 2,200
గత ఈవెంట్లలో హాజరు ఇలా..
2016- 1,01,000
2015- 94,241
2014- 85,916
2013- 72,534
2012- 67,176
2011- 60,361
ప్రత్యేకతలు..
* నాలుగు రోజుల పాటు జరిగే మొబైళ్ల ప్రదర్శనకు స్పెయిన్ లోని 20 వేల మంది పాఠశాల విద్యార్థులను తీసుకొస్తున్నారు.
* సాంకేతిక రంగంలో జెండర్ గ్యాప్ అంశంగా తీసుకుని ‘‘ఉమెన్4టెక్’’ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఉమెన్4టెక్ గ్లోమో అవార్డులూ ప్రదానం చేస్తారు.
* ‘పోకెమాన్ గో’ గేమ్ గత ఏడాది ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఈసారి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సరికొత్త గేమ్స్ కానీ, దీనికి అప్ డేట్స్ కానీ అనౌన్స్ చేస్తారని భావిస్తున్నారు.
5జీ ఫోకస్డ్ గా..
5జీ కమ్యూనికేషన్స్ ఫోకస్ట్ గా నెట్ వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్(ఎన్ ఎఫ్ వీ)పై ప్రత్యేక సమ్మేళనాలున్నాయి.
ఈ ఏడాది మొబైల్ సాంకేతికతలోకి ఎన్ ఎఫ్ వీ పెద్ద ఎత్తున పెనెట్రేట్ అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
తొలిరోజునే సునీల్ భారతి మిట్టల్ ప్రసంగం
ప్రపంచంలోని టాప్ నెట్ వర్క్ ప్రొవైడర్సులో ఒకరిగా ఎయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తొలిరోజునే కీలక ఉపన్యాసం చేయనున్నారు. భారత్ లో రిలయన్స్ జియో ప్రవేశం తరువాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఉపన్యాసంపై అంతటా ఆసక్తి నెలకొంది.
మిట్టల్ తో పాటు అంతర్జాతీయంగా అనేక సంస్థల్లో ఉన్న భారతీయ సీఈవోలు, టాప్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్ లో పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.