• తాజా వార్తలు

మై షేక్ (MYSHAKE) ఆండ్రాయిడ్ యాప్ ..

భూకంపం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందు జాగ్రత్త పడడానికి, తప్పించుకోవడానికి ఏమాత్రం సమయం ఇవ్వని ప్రకృత్తి విపత్తు అది. తుపాను వచ్చినా, సునామీ వస్తున్నా, వరదలు వస్తున్నా కూడా ఎంతో కొంత జాగ్రత్త పడి కొందరి ప్రాణాలనైనా కాపాడే అవకాశం ఉంటుంది కానీ.. భూకంపం విషయంలో సెకను కూడా టైముండదు. అందుకే భూకంపాలు వచ్చేటప్పుడు జరిగే నష్టం భారీగా ఉంటుంది.

అయితే... వరదలు, తుపాన్లు వంటి వాటి విషయంలో ప్రజలకు ఉన్న అవగాహన భూకంపాల విషయంలో లేదు. తరచూగా భూకంపాలు వచ్చే దేశాల్లోనూ ఇలాంటి అవగాహన తగినంత లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించడానికి... భూకంపాల గురించి ప్రజలు తెలుసుకోవడానికి వీలు కల్పిస్తూ నిత్యం మన ప్రాంతంలో వచ్చే భూ ప్రకంపనలు గుర్తించి జాగ్రత్త పడేందుకు వీలు కల్పించే మొబైల్ యాప్ ఒకటి తయారు చేశారు. ఇది భూకంపాలను నివారించలేకపోయినా.... భూకపంనలను తరచూ గుర్తిస్తుంటే ఏవైనా తేడాలు వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తం కావడానికి వీలుంటుందన్నది ఇందులో ఉద్దేశం. కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు మైషేక్ అనే ఈ మొబైల్ యాప్ రూపొందించారు.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వాడే యూజర్లు ఈ 'మై షేక్ (MYSHAKE)' యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.  దీని ద్వారా భూకంపాలను ముందుగానే గుర్తించి సురక్షితంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 4.1 ఆపైన వెర్షన్ కలిగిన డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. 

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధక బృందం 'మై షేక్' యాప్‌ను రూపొందించింది. ఆండ్రాయిడ్ డివైస్‌లో ఉండే యాక్సలరోమీటర్ సెన్సార్, జీపీఎస్ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. భూకంపాల తీవ్రతలను గుర్తించే 'సీస్మోమీటర్స్' పనితీరుకు అనుగుణంగా ఈ యాప్‌ను తీర్చిదిద్దినట్టు పరిశోధకులు తెలియజేస్తున్నారు. ల్యాబొరేటరీలో తాము అన్ని విధాలుగా ఈ యాప్‌ను పరీక్షించామని, దాదాపు 93 శాతం కచ్చితత్వంతో ఈ అప్లికేషన్ పనిచేస్తుందని వారు చెబుతున్నారు. ఇంకేముంది ఈ యాప్ ఉంటే ఎంతో కొంత సురక్షితమనే అనుకోవాలి.

 

జన రంజకమైన వార్తలు