• తాజా వార్తలు

నెట్ టీవీ... నో కేబుల్.. నో డీ2హెచ్..

ఇంటర్నెట్ వాడకం విస్తారమయ్యాక  ఆన్ లైన్ ఉపకరణాల వినియోగం అంతేస్థాయిలో పెరుగుతోంది. దీంతో టీవీ, రేడియో, పత్రికలు, ఇతర వినోద వస్తువుల వినియోగం తగ్గి... ఆ అవసరాలన్నీ ఆన్ లైన్లోనే తీరుతున్నాయి. దేశంలోని ప్రజల సగటు సంపాదనలో ఆన్ లైన్ ఉపకరణాల వినియోగానికే ఎక్కువ మొత్తంలో ఖర్చుపెడుతున్నారని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆన్ లైన్ మార్కెట్లోకి ఇప్పుడు మరో కొత్త సర్వీసు దూసుకొచ్చింది. అదే... వీడియో స్ర్టీమింగ్... అమెరికాకు చెందిన ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు భారత్ మార్కెట్ పై కన్నేసింది. ఇది భారత్లో జనవరి నుంచి సేవలు ప్రారంభించింది.  ఈ వీడియో స్ట్రీమింగ్ సేవలను దేశీయ వినియోగదార్లు మొదటి నెల రోజుల పాటు ఉచితంగా పొందొచ్చు. ఆ తర్వాత నుంచి నెలవారీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

నెట్ ఫ్లిక్స్ తన ఇంటర్నెట్ టీవీ నెట్ వర్కును భారత్ తో పాటు పాటు ప్రపంచవ్యాప్తంగా 130దేశాల్లో కొత్తగా ప్రారంభించటం విశేషం. 2016 సంవత్సరాంతానికి 200 దేశాల్లో సేవలు విస్తరించడమే లక్ష్యమని నెట్ ఫ్లిక్సు ప్రకటించింది. 

2007లో ప్రారంభమైన నెట్ ఫ్లిక్స్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు తొలుత కెనడాలో మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆ తరువాత లాటిన్అమెరికా, ఐరోపా దేశాలు... ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, జపాన్ తో పాటు 60 దేశాలకు విస్తరించాయి. చైనాలో ఇప్పటి వరకు ఈ సేవలు ప్రారంభం కాలేదు. అమెరికా ఆంక్షల కారణంగా నెట్ ఫ్లిక్స్ తమ సేవలను క్రిమియా, ఉత్తర కొరియా, సిరియా దేశాల్లో విడుదల చేయలేకపోయింది. 

మార్వెల్ కు  చెందిన డేర్ డెవిల్, జెస్సికా జోన్స్, ఆర్కోస్, సెన్స్8, గ్రేస్అండ్ఫ్రాంకీ, మార్కో పోలో వంటి సిరీస్ లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, వీడియోలు, టీవీ సీరియళ్లు, ప్రత్యేక ప్రదర్శనలను 'నెట్ ఫ్లిక్స్' ప్రసారం చేస్తుంది. ఇండియాలో హంగామా, హుక్, హాట్ స్టార్ వంటి  ప్రత్యర్థి సంస్థల సేవలతో నెట్ ఫ్లిక్స్ పోటీపడనుంది. ఇలా ప్రసారం చేయడానికి కాపీ రైటు హక్కులను 'నెట్ ఫ్లిక్స్' పొందింది. ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉన్న ఏ డివైస్ లోనైనా ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నెట్ స్పీడ్ కనీసం 512కేబీపీఎస్ ఉండాలి. ఇవి బేసిక్, స్టాండర్డ్, ప్రీమియమ్ ప్యాకేజీల రూపంలో అందుబాటులో వుంటాయి. బేసిక్ ప్లాన్ ధర రూ.500. స్టాండర్డ్ ప్లాన్ ధర రూ.650, ప్రీమియమ్ ప్లాన్ ధర రూ.800.  ఏ ప్లానయినా సరే మంచి క్వాలిటీతో వీడియోలు చూసే అవకాశం ఉండడం దీని ప్రత్యేకత.

 

జన రంజకమైన వార్తలు