ప్రముఖ ప్రింటర్లు, కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్ పీ జెట్ ఫ్యూజన్ 3200, జెట్ ఫ్యూజన్ 4200 పేరుతో ఇటీవలే రెండు 3డీ ప్రింటర్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ రెండూ కూడా పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా రూపొందించింది. ఇలాంటి ఇతర ప్రింటర్ల కంటే ఇవి పది రెట్లు వేగంతో పనిచేస్తాయి. అంతేకాదు... వాటితో పోల్చితే వీటి ధర అందులో సగం కూడా లేదు.
ఆ రెండు దిగ్గజాలతో కలిసి
ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగంలో సరికొత్త సాంకేతికతలు వస్తున్న తరుణంలో హెచ్ పీ కూడా దానిపై దృష్టి పెట్టి ఈ కమర్షియల్ ప్రింటర్లను అందుబాటులోకి తెచ్చింది. మాన్యుఫ్యాక్చరింగ్, డిజైన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ఉద్దేశంతో నైకి, బీఎండబ్ల్యూలతో కలిసి హెచ్ పీ ఈ రంగంలో మరిన్ని ఉత్పత్తులు తేవడానికి సిద్ధమవుతోంది.
ధర 1,30,000 డాలర్ల నుంచి మొదలు
ఇందులో ఫ్యూజన్ 3డీ ప్రింటర్ల ధర 1,30,000 డాలర్లు నుంచి మొదలవుతుంది. ఆర్డర్లు అందుకున్న రోజే ఉత్పత్తులు తయారుచేసి అందించడం తయారీ రంగంలో అంత సులభం కాదు. కానీ... ఈ ప్రింటర్ల సహాయంతో అది సాధ్యమవుతుందని హెచ్ పీ అంటోంది.