6జీబీ ర్యామ్ ఆండ్రాయిడ్ ఫోన్ తో రానున్న నోకియా
లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ తో బ్లాక్ బెర్రీ
ఏకంగా 8 జీబీ ర్యామ్ ఫోన్ తో వస్తున్న హెచ్ టీసీ
ప్రపంచమంతా మొబైల్ ఫోన్ల చుట్టూ తిరుగుతున్న తరుణంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్న మొబైళ్ల పండగకు ప్రముఖ సంస్థలన్నీ సిద్ధమైపోతున్నాయి. ఏటా నిర్వహించినట్లే ఈ ఏడాది కూడా స్పెయిన్ లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ నిర్వహించబోతున్నారు. అందుకు మరో 50 రోజుల సమయం ఉన్నప్పటికీ సంస్తలు మాత్రం ఇప్పటినుంచే సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు దిగ్గజ సంస్థగా ఉన్నా ఇప్పుడు మనుగడ కోసం పోరాటం చేస్తున్న నోకియా సంస్థ మొదలుకుని.. మొబైళ్ల మార్కెట్లో దూసుకుపోతున్న శాంసంగ్, లెనోవా వంటి సంస్థలూ అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నాయి. కొత్త కొత్త మోడళ్లను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
ఫిబ్రవరి 27 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ భారీ ఈవెంట్లో తమ కొత్త ఫోన్లను లాంఛ్ చేయాలని ప్రముఖ సంస్థలు భావిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్టు ఫోన్ల మార్కెట్లో ఏమాత్రం పట్టు సాధించకలేకపోతున్న నోకియా, బ్లాక్ బెర్రీ, ఎల్జీ వంటి సంస్థలు ఈ వేదికను తమ మార్కెట్ కు ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి.
నోకియా 8:
ఆండ్రాయిడ్ ఫోన్ల మార్కెట్లో నిలదొక్కుకునే ప్రయత్నాలకు నోకియా ఈ ఏడాది శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను కొత్త సంవత్సరంలో లాంఛ్ చేసిన నోకియా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ‘నోకియా 8’ను రిలీజ్ చేయబోతోంది. అదిరిపోయే ఫీచర్లతో నోకియా 8 అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ తో పనిచేసే ఇది 6జీబీ ర్యామ్ తో వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. 24 మెగా పిక్సెళ్ల రియర్ కెమేరా, 12 మెగా పిక్సెళ్ల ఫ్రంట్ కెమేరా ఇందులో ఉండొచ్చు.
బ్లాక్ బెర్రీ మెర్క్యురీ:
ఇటీవల లాస్ వెగాస్ లో జరిగిన కంజ్యూమర్ ఎలక్ర్టానిక్స్ షో-2017లో బ్లాక్ బెర్రీ తన కొత్త మోడల్ ను ప్రదర్శించింది. త్వరలో జరగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో బ్లాక్ బెర్రీ మెర్క్యురీని లాంఛ్ చేయబోతున్నారు. క్వెర్టీ కీబోర్డులకు ప్రసిద్ధిగాంచిన బ్లాక్ బెర్రీ ఈ మోడల్ లోనూ అది కొనసాగించబోతోంది. ఆండ్రాయిడ్ నౌగాట్ ఓఎస్ ఇందులో వాడబోతున్నట్లు టాక్.
ఎల్ జీ జీ6:
ఎల్జీ సంస్థ 2016లో జీ5 స్మార్టు ఫోన్ ను విడుదల చేసింది. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా జీ6ను లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది.
లెనోవో మోటో జీ5 ప్లస్:
మోటోరాలాతో జత కట్టిన లెనోవో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో మోటో జీ5 ప్లస్ పేరుతో కొత్త మోడల్ ను లాంఛ్ చేయబోతోంది. 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ ర్యామ్ తో అందరికీ అందుబాటులో ఉండే ధరతో మార్కెట్లోకి రావాలన్నది లెనోవో లక్ష్యంగా కనిపిస్తోంది. పనిలో పనిగా 3080 ఎంఏహెచ్ బ్యాటరీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
హెచ్ టీసీ 11: వీరందరినీ మించిపోయేలా తైవాన్ సంస్థ హెచ్ టీసీ ఏకంగా 8జీబీ ర్యామ్ తో మొబైల్ ను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతోంది. హెచ్ టీసీ 11 పేరుతో లేటెస్టు స్నాప్ డ్రాగన్ 835 చిప్ సెట్ తో ఇది రానుంది.
శాంసంగ్:
స్మార్టు ఫోన్ల మార్కెట్ రారాజుగా పిలుచుకుంటున్న శాంసంగ్ నుంచి మొబైల్ కాంగ్రెస్ వేదికపై తన 6జీబీ ర్యామ్ మోడల్ గెలాక్సీ ఎస్ 8 ఫోన్ ను రిలీజ్ చేస్తారని అంతా భావించారు. కానీ.. ఆ సంస్థ ఎస్ 8 లాంచింగ్ ను మార్చి నెలకు వాయిదా వేసింది. అయితే, టెక్ ప్రియులను నిరాశపరచకుండా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లోనూ పలు మోడళ్లను లాంఛ్ చేయడానికి శాంసంగ్ ఏర్పాట్లు చేసుకుంటోంది.