గూగుల్ స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ లో కొత్త ఆప్షన్ ఒకటి తీసుకొస్తోంది. ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. అయితే... దీన్ని ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ లో యాక్టివేట్ చేశారని... ఆండ్రాయిడ్ 8 ఓఎస్ లో యూజర్లకు ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
ఇంతకీ ఏంటా ఫీచర్
ఫోన్లు ఒక్కోసారి హ్యాంగవుతుంటాయి.. అలాంటప్పుడు కనీసం హోం స్ర్రీన్ కు రావడం కూడా కుదరదు. స్విచ్ఛాఫ్ చేయడం కూడా సమస్యగా మారుతుంది. సరే.. బ్యాటరీని తొలగించి ఆఫ్ చేద్దామంటే ఇప్పుడొస్తున్న ఫోన్లలో చాలావరకు ఇన్ బిల్ట్ బ్యాటరీ ఉంటోంది. దీంతో ఫోన్ హ్యాంగయితే నరకయాతనే. ఒక్కోసారి వైరస్ ఎఫెక్టయినా ఫోన్ హ్యాంగవుతుంది. అలాంటప్పుడు మనం వాడుతున్న యాప్ నుంచి బయటకు రావాలంటే సాధ్యం కాదు. నష్టనివారణ చర్యలు వెంటనే చేపట్టాలన్నా కూడా కనీసం అందులోంచి బయటపడి హోంలోకే రావాల్సి ఉంటుంది. కానీ, అది సాధ్యపడదు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేసే ఫీచర్ ను ఆండ్రాయిడ్ లో తేనుంది గూగుల్. పానిక్ బటన్ పేరుతో ఈ ఫీచర్ ను అందించనున్నట్లు సమాచారం.
ఎలా పనిచేస్తుంది...?
ఈ ఫీచర్ వల్ల ఏదైనా వైరస్ కారణంగా హ్యాంగ్ అయిన ఫోన్‌లో వెంటనే హోమ్ స్క్రీన్ వచ్చేలా చేయవచ్చు. వైరస్ వచ్చి ఏదైనా యాప్‌లో ఫోన్ హ్యాంగ్ అయి ఆగిపోయిన సందర్భంలో యూజర్ వెంట వెంటనే నాలుగు సార్లు బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే పానిక్ బటన్ యాక్టివేట్ అయి హోమ్ స్క్రీన్‌కు రీడైరెక్ట్ అవుతుంది. దీంతో వెంటనే ఫోన్‌లో హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు తగ్గుతాయి.