స్మార్ట్ ఫోన్ బ్యాటరీని 20ని||లలోనే 70% శాతం వరకూ ఛార్జింగ్ చేయగల పంప్ ఎక్స్‌ప్రెస్ 3.0 టెక్నాలజీని తైవాన్‍కు చెందిన చిప్ తయారీ సంస్థ మీడియా టెక్ విడుదల చేసింది. సాధారణ ఛార్జింగ్ కన్నా 5 రెట్లు వేగంగానూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత వేగవంతమైన టెక్నాలజీ కన్నా రెట్టింపు వేగంగానూ పని చేస్తుందని తయారీ సంస్థ ప్రకటించింది. పంప్ ఎక్స్‌ప్రెస్ 3.0 టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న పంప్ ఎక్స్‌ప్రెస్ 2.0కన్నా వేగంగానే కాక సమర్థవంతంగా పని చేస్తుందనీ, విద్యుత్ వృధాను సగానికిపైగా అరికడుతుందనీ సంస్థ చెబుతోంది. అంటే వేగంగా ఛార్జింగ్ కావడమే కాక, ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ తక్కువగా వేడెక్కుతుందన్నమాట. ప్రయాణాల్లో ఉండగా ఛార్జింగ్ కోసం ఎక్కువ సమయం వృధా చేయకుండానే తమ ఫేవరిట్ యాప్స్‌ను ఎంజాయ్ చేసే అవకాశం వినియోగదారులకు కల్పించడమే మా లక్ష్యం మీడియాటెక్ సంస్థ ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్రీ జ్యూ చెప్పారు. ఈ టెక్నాలజీ ద్వారా అయిదు నిమిషాలు ఛార్జింగ్ చేసుకుంటే నాలుగుగంటలు ఫోన్ మాట్లాడుకోవచ్చని మీడియా టెక్ చెబుతోంది. టైప్-సి యు.ఎస్.బి ఛార్జింగ్ ద్వారా అత్యంత వేగంగా ఛార్జింగ్ చేసుకొనే అవకాశం ఈ టెక్నాలజీ అందిస్తోంది. ఫోన్లోని అనవసర సర్క్యూట్లను బైపాస్ చేసి, తిన్నగా బ్యాటరీకే ఛార్జింగ్ అందించడం ద్వారా ఫోన్ అనవసరంగా వేడెక్కడాన్ని నివారిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. మీడియాటెక్ హీలియో పి20 సిరీస్ ద్వారా మార్కెట్లోకి ప్రవేశించనున్న ఈ టెక్నాలజీ 2016 చివరి నాటికి వినియోగదారులకు అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. |