• తాజా వార్తలు

రిలయన్సు 4జీ... రెడీ టు అటాక్...

సిమ్ ధర 200/-, 75 జీబీ 4జి డేటా, 4500 నిమిషాలు ఫ్రీ  కాల్సు

 
ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్సు జియో త్వరలోనే దేశవ్యాప్తంగా తన 4జి టెలికాం సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. గత మూడునెలలుగా రిలయన్సు గ్రూప్ ఉద్యోగులు, వారి స్నేహితులు వినియోగిస్తున్న ఈ జియో సిమ్‌ను త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇప్పటికే రిలయన్సు డిజిటల్ స్టోర్లకు  సిమ్ కార్డులు కూడా పంపించినట్టు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ స్విస్ తెలిపింది. రూ. 200 ఖరీదు చేసే ఈ సిమ్ ద్వారా 75జీబీ 4జి డేటాతో పాటుగా 4500 నిమిషాలు ఫ్రీ కాల్సు ఆఫర్ ఇస్తోంది. అయితే ఈ సిమ్ కార్డు అమ్మకాలు ఎప్పటి నుంచి.. టారిఫ్ వివరాలేంటనేవి కొంత మేర వెల్లడయ్యాయి.

రిలయన్సు జియో 4జి సిమ్ కార్డు ధర ప్రారంభంలో రూ. 200 ఉంటుంది. ఖాతాదారులు మూడు నెలల పాటు ఈ సిమ్ ద్వారా ఉచితంగా వాయిస్, డేటా సేవలు పొందవచ్చు. ఈ సిమ్ కొన్నవారికి మొదటి మూడు నెలలు దాదాపు 75 జిబి 4జీ డేటా, అలాగే 4500 నిమిషాల పాటు మాట్లాడుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. లాంచింగ్ ఆఫర్‌గా ఇస్తున్న ఈ సేవలు మూడునెలల పాటు చెల్లుబాటవుతాయి. మరి తర్వాత టారిఫ్‌ల పరిస్థితి ఏమిటన్న దానిపె కంపెనీ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఈ ఆఫర్ రిలయన్సు హ్యాండ్ సెట్లు కొన్నవారికే ఉంటుందా.. లేక 4జి సేవలను సపోర్టు చేసే ఇతర మొబెళ్లు వినియోగిస్తున్నవారికి కూడా ఈ అవకాశం అందుబాటులో ఉంటుందా అన్నదానిపై స్పష్టత లేదు.

కాగా జియో సిమ్ స్టాక్ లు ఇప్పటికే తమకు చేరాయని, కానీ ఎప్పటినుంచి అమ్మకాలు ప్రారంభించేదీ తమకు సమాచారం లేదని సిబ్బంది అంటున్నారు. ముంబైలో స్టోర్లలో సిబ్బందికి, వినియోగదారుల నమోదు డాక్యుమెంటేషన్ తదితరాలపై ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్టు క్రెడిట్ స్విస్ తెలిపింది. జియో సిమ్ ల ప్రభావం భారతి ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ లాంటి భారత టెలికం ప్రత్యర్థులపై భారీగానే పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

జన రంజకమైన వార్తలు