మొబైల్ మార్కెట్లో రిలయన్స్ కంపెనీ జోరు మీదుంది. ఈ సంస్థ చాలా వేగంగా భిన్నమైన మోడల్ ఫోన్లను మార్కెట్లోకి దింపుతోంది. ఎక్కువ శ్రేణి ధరలతో పాటు తక్కువ శ్రేణి ధరలు ఉన్న ఫోన్లను ఒకేసారి విడుదల చేసి అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందీ సంస్థ. ఇప్పటికే రిలయన్స్ .జియో బ్రాండ్‌తో ఎల్‌వైఎఫ్ ఫ్లేమ్ సిరీస్‌లో చాలా ఫోన్లు వచ్చాయి. వాటి వరుసలోనే మరో ఫోన్‌ను రంగంలోకి దింపింది ఈ సంస్థ. ఆ ఫోనే ఎల్‌వైఎఫ్ ఫ్లేమ్ 6. జియో బ్రాండ్‌కు మరింత ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో మార్కెట్లో అన్ని రకాల ఫోన్లు ఉండాలన్న సంకల్పంతో రిలయన్స్ ఫ్లేమ్ 6 ను వినియోగదారులకు పరిచయం చేసింది. ఈ 4జీ స్మార్ట్‌ఫోన్ అందుబాటు ధరతో పాటు ఎక్కువ నాణ్యతతో యూజర్లను ఆకట్టుకుంటోంది. విడుదలైన కొద్దిసేటికే వేలాది మంది ఈ ఫోన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ ఎల్‌వైఎఫ్ ఫ్లేమ్ 6 ఫోన్ ధర రూ.3,999 మాత్రమే. 4 అంగుళాల డిస్‌ప్లేతో పాటు మంచి రిజల్యూషన్ ఈ ఫోన్ సొంతం. ఈ డిస్ ప్లే కూడా స్క్రాచ్ రెసిస్టెంట్ కావడంతో ఫోన్ పైన భాగంలో గీతలు పడతాయన్న ఆందోళన కూడా అవసరం లేదు. ఈ డిస్‌ప్లేను డ్రాగన్‌ట్రయిల్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో తయారు చేశారు. 1,5 గిగా హెట్జ్ క్వాడ్ ప్రొసెసర్‌తో తయారైన ఈ ఫోన్ సామర్థ్యం 512 మెగా బైట్స్‌గా ఉంది. 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు ఎస్‌డీ కార్డు ద్వారా మెమెరీని 32 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ 2 ఎంపీ రేర్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్‌తో తయారైంది. సెల్ఫీల కోసం 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. దీని క్లారిటీ కూడా చక్కగా ఉందని ఈ కంపెనీ చెబుతోంది. ఫ్లేమ్ 6 స్మార్ట్‌ఫోన్ 4జీ సేవలకు అనుకూలంగా తయారు చేశారు. వైఫై, బ్లూటూత్, జీపీఎస్‌కు కూడా ఇది సహకరిస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 1750 ఎంఏహెచ్. ఈ నెలలో విడుదలైన రిలయన్స్ ఎల్‌వైఎఫ్ పోన్లలో ఇది మూడోది కావడం విశేషం. ఇంతకుముందు ఎల్‌వైఎఫ్ ఫ్లేమ్ 3, 4 ఫోన్లను రిలయన్స్ జియో విడుదల చేసింది. మిగిలిన ఫోన్ల నుంచి పోటీని తట్టుకుని ఈ ఎల్‌వైఎఫ్ ఫోన్లు మార్కెట్లో ఎంతమేరకు పోటీని ఇస్తాయో చూడాలి. తమ ఫోన్లు అత్యున్నత ప్రమాణాలతో తయారయ్యాయని.. మిగిలిన చిన్న కంపెనీ ఫోన్లతో పోలిస్తే తాము తక్కువ ధరలకు నాణ్యమైన ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని రిలయన్స్ కంపెనీ చెబుతోంది. |