వోల్వో బ్లూటూత్ ఆధారిత డిజిటల్ కీ టెక్నాలజీతో యాప్
కారుకు ఇక తాళం చెవి అవసరం లేని రోజులొస్తున్నాయి. మొబైల్ యాప్స్ విస్తృతమయ్యాక ప్రతిపనికీ ఓ యాప్ వచ్చేస్తోంది. ఇప్పుడు కారు డోర్ తీయడానికి, స్టార్ట్ చేయడానికి కూడా యాప్ వచ్చేసింది. మీ స్మార్ట్ ఫోన్‌లో ఆ యాప్ ఉంటే సరిపోతుంది. ప్రముఖ స్వీడన్ వాహన తయారీ సంస్థ వోల్వో ఈ కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుడుతోంది. కారు తాళం చెవి చేసే పనులన్నీ బ్లూటూత్ ఆధారిత డిజిటల్ కీ టెక్నాలజీతో పని చేసే మొబైల్ యాప్‌తో చేసేలా ఉండే కార్లను వోల్వో రూపొందిస్తోంది. ఈ యాప్ ద్వారా డ్రైవర్లకు మల్టిపుల్ డిజిటల్ కీస్‌ను పొందే అవకాశం కూడా కల్పించనున్నారు. దీనితో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న విభిన్న వోల్వో వాహనాలను నియంత్రించే అవకాశం ఉంటుంది. కారును షేర్ చేసుకునే వారు సైతం తాళం చెవుల మార్పిడి లేకుండానే తమ డ్రైవర్లకు సులభంగా యాప్ ద్వారా యాక్సెస్ ఇవ్వడానికి వీలు ఉంటుంది. కారును అద్దెకు తీసుకునే వారికి సైతం ఈ టెక్నాలజీతో ఉపయోగం ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అంటే... కారు ఎవరు తీసుకెళ్లాలన్నా వారికి తాళం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వారి ఫోన్లో ఈ యాప్ ఉంటే చాలన్న మాట. వినియోగదారుల సమయం ఆదా చేసే ఈ యాప్ టెక్నాలజీ 2017లో అందుబాటులోకి రానున్నది. అయితే... టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అవుతోందో దాన్ని హ్యాక్ చేసే విధానాలూ అంతే స్పీడుగా ఉన్న ఈ కాలంలో దీనివల్ల ప్రమాదాలూ కనిపిస్తున్నాయి. ఆ కారుకు, యాప్ ను అనుసంధానించే టెక్నాలజీ హ్యాక్ చేస్తే ఎవరైనా దాన్ని సులభంగా దొంగిలించే ప్రమాదముంది. క్రెడిట్, డెబిట్ కార్డులను సాంకేతిక చోరులు ఎక్కడో వేరే చోట కూడా ఉండి దుర్వినియోగం చేస్తున్నట్లే కార్లనూ ఎత్తుకెళ్లే ప్రమాదముంది. దాన్ని నిరోధించేలా సమర్ధమైన సాఫ్ట్ వేర్ డెవలప్ చేస్తే కానీ దీన్ని నమ్మే పరిస్థితి లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. |