![]() |
డిజిటల్ పరికరాల వినియోగదారులకు స్టోరేజీ సామర్థ్యం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంటుందని మనకు తెలుసు. మొబైల్ ఫోన్లోనే కెమెరాలు కూడా వచ్చేయడంతో ఎక్కడపడితే అక్కడ ఫొటోలు, సెల్ఫీలు తీసుకొని దాచుకోవడం, వాటిని ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఫొటో, ఆడియో, వీడియో మెసేజీల రూపంలో పంచుకోవడం ఎక్కువై పోయింది. మరో పక్క పెరుగుతున్న ప్రోసెసింగ్ సామర్థ్యం ఇంటర్‌నెట్ బ్యాండు విడ్త్ లకు అనుగుణంగా అన్ని ప్లాట్‌ఫాంలూ తమ అప్లికేషన్ల సైజుని పెంచేస్తున్నాయి. దీంతో ఫోన్లో ఎన్ని జిబీల మెమరీ ఉన్నా సరిపోవడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామంటూ సరికొత్త స్మార్ట్ ఫోన్ "రాబిన్"తో మన ముందుకొస్తోంది అమెరికా కేంద్రంగా కలిగిన స్టార్టప్ కంపెనీ నెక్స్ట్‌బిట్. ఈ రోజుల్లో మన ఫోన్ మెమరీని, కార్డులతో 128జిబి దాకా పెంచుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ఆ మెమరీ అంతా అనవసరమైన చెత్తతో నిండిపోకుండా చూసుకోవడమే పెద్ద సమస్య. కనీసం వారానికోసారి మెమరీని చెక్ చేసుకొని అందులోని ఫైల్సును మన ప్రాధాన్యతలకు అనుగుణంగా సర్దుకోవడం, డిలీట్‌చేయడం ఒక తప్పనిసరి పనైపోయింది. "రాబిన్" ఫోన్ మీ దగ్గరుంటే ఇక నుంచీ మీరు మీ మెమరీని సర్దుకోవడానికి సమయం, శక్తి వృధాచేయనక్కర్లేదని "నెక్స్ట్‌బిట్" హామీ ఇస్తోంది. రాబిన్ ఫోన్లో ఉన్న 32జిబి మెమరీతో పాటు, మరో 100జిబి క్లౌడ్ మెమరీ కూడా మీకు ఉచితంగా లభిస్తుంది. అయితే ఆకర్షణ అంతా ఈ క్లౌడ్ మెమరీలో కాదు, తమ ఫోన్ టెక్నాలజీలోనే ఉందంటోంది "నెక్స్ట్‌బిట్". ఈ ఫోన్లో ఉపయోగించిన"క్లౌడ్ ఫస్ట్" అనే టెక్నాలజీ "ఎఐ"(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్), మెషీన్ లెర్నింగ్‌లను ఆధారం చేసుకొని, వినియోగదారుల మెమరీ అవసరాలను, అలవాట్లను పరిశీలించి గుర్తుపెట్టుకుంటుంది. నిజంగా అవసరమైన వాటిని మాత్రమే ఫోన్ మెమరీలో ఉంచి మిగిలిన ఫైల్సును క్లౌడ్ మెమరీకి పంపేస్తుంది. మీరు మెమరీని వాడుతున్న విధానాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, మీ ఫైల్స్‌ను ఫోన్‍కూ, క్లౌడ్ కూ మధ్యలో సర్దుబాటు చేయడం ఆటోమాటిక్‌గా జరిగిపోతుంది. త్వరలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి రానున్న ఈ ఫోన్ ఖరీదు రూ19999/-. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో అడుగుపెట్టి గుర్తింపు పొందాలంటే, తమకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనుకుంటున్నామని కంపెనీ ప్రతినిధి టామ్ మాస్ చెప్పారు. కొత్త టెక్నాలజీ అంటే మోజుపడే యువకులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ ప్రథమ లక్ష్యాలని, తర్వాత మార్కెట్‍ను క్రమంగా విస్తరిస్తామని ఆయన చెప్పారు. |
![]() |