ఫ్రీ డాటా, ఫ్రీ వాయిస్ కాలింగ్ తో ప్రపంచ టెలికం రంగాన్నే నివ్వెరపరిచిన రిలయన్సు జియో తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. 4జీ ఫీచర్ ఫోన్ ను రూ. 500కే ఇవ్వాలని నిర్ణయించింది. గతంలోనే ఈ ఫోన్ పై మార్కెట్ వర్గాల్లో వినిపించినా ధర ఇంత తక్కువ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. రూ. 1500 వరకూ ఉంటుందని భావించారు.
కానీ... అతి తక్కువ ధరకే అందించేందుకు ముఖేష్ అంబానీ నిర్ణయించుకోవడంతో రూ. 500కే దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ బ్రోకరేజ్, ఆర్థిక సేవల సంస్థ హెచ్ఎస్బీసీ తెలిపింది. ఈ నెల 21వ తేదీన జరిగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది.
మరోవైపు ఈ నెలతో ముగియనున్న ధన్ ధనా ధన్ ఆఫర్ స్థానంలో మరో ఆకర్షణీయ టారిఫ్ ప్లాన్ కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. రూ.309 రీచార్జితో ఆరు నెలల కాలానికి అద్భుతమైన ప్లానును తీసుకొస్తున్నట్లు రిలయన్స్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం 2జీ ఫోన్లను వాడుతున్న మార్కెట్ ను 4జీ వైపు పూర్తిగా మార్చే లక్ష్యంతోనే రూ.500కే ఫీచర్ ఫోన్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.